.
కొన్ని విశ్లేషణలు కనిపిస్తున్నయ్… హరీష్‌రావు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని హైజాక్ చేసినట్టేనని..! ఎలా..? రేవంత్ రెడ్డి కూడా కేటీయార్, కేసీయార్‌లకు క్షమాభిక్ష పెట్టేసి, అరెస్టుల నుంచి పోనీ పాపంలే అని తప్పించేసి.,. పూర్తిగా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నాడని..! నిజమేనా..? ఐతే ఎందుకు..? ఈ దిశలో పాడి కౌశిక్ రెడ్డి వంటి తల్నొప్పి కేరక్టర్లతో హరీష్ రావు అనుకోకుండా మునిగిపోతాడా..? అనుబంధ చర్చ ఇది..!!
కాస్త వివరంగానే చెప్పుకోవాలి… బీఆర్ఎస్ అంటే జస్ట్, కేసీయార్… అది ఎప్పుడు..? తను ఫామ్ హౌజులో బందీ అయిపోనప్పటివరకు నడిచింది… తను ఏదంటే అది… పార్టీ నేతలంతా బానిసలే… రోజుల తరబడీ ఢిల్లీలో తిష్ట వేసినా, ఫామ్ హౌజులో పడుకుని పత్తా లేకపోయినా అడిగేవాడు లేడు… అదొక అరాచకం… ఒక దశలో హరీష్ రావును పక్కన పెట్టేశాడు… ఎందుకు..?
Ads
ఏమో, కేసీయార్‌కే ఈర్ష్య కలిగించే సంపాదన తెలుసుకుని అని స్వీపింగ్ కామెంట్ చేయలేం కానీ… కేటీయార్ తన నెత్తుటి మగ వారసుడు… అందుకే ఆడ వారస కవితను ఎక్కడికక్కడ కట్ చేశాడు, కుటుంబేతర హరీష్‌ను కట్ చేశాడు… కానీ చివరకు కేటీయార్‌కు పార్టీలో యాక్సెప్టెన్స్ లేకపోవడం, మోడీ వంటి ప్రధాని కూడా అబ్బే, మీవాడితో కష్టం సుమీ అని తేల్చేయడంతో… ఎహె, నాకేమైంది, మస్తు ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకుంటూ కథ నడిపిస్తూ వచ్చాడు ఇన్నాళ్లూ కేసీయార్….
కానీ కాలం కేసీయార్ చెప్పినట్టు నడవదు… సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి చెప్పినట్టు శుక్రమహర్దశ ఎల్లకాలం నడవదు… అధికారం పోయింది, బిడ్డ ఛీఫో అని వదిలేసి వెళ్లిపోయింది… చివరకు వదిలించుకోవాలీ అనుకున్న ఆ హరీష్ రావే దిక్కయ్యాడు… పార్టీ ఇప్పుడు హరీష్ చెప్పుచేతల్లోకి వచ్చేసింది… అనేక అంశాల్లో హరీష్ ఏది చెబితే అదే…

కేటీయార్ లేదు, ఇంకెవరూ లేరు… అసలు వేరే నాయకుడు ఏమైనా మాట్లాడే సీన్ ఉంటే కదా పార్టీలో… ఈరోజు హరీష్ రావు గనుక అమిత్ షా మాట వింటే బీఆర్ఎస్, కేటీయార్, కేసీయార్ ఎట్సెట్రా గోవిందా… చివరకు అసెంబ్లీలో కూడా హరీష్ రావే హైలైట్ అవుతున్నాడు… కేటీయార్ అమెరికా వెళ్లిపోయాడు వారం పదిరోజులు… కేసీయార్ స్వీయ బందిఖానా… మరి బీఆర్ఎస్ పెబ్బ ఎవరు..?
జస్ట్, హరీష్ రావు… తన సంగతి తెలుసు గనుకే కవిత తనే టార్గెట్ చేస్తోంది… రేప్పొద్దున కిషన్ రెడ్డి, లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ప్లస్ హరీష్ రావు కలిసి… ఈటల మార్క్ కొత్త ఎంట్రీలను బయటికి పంపించేస్తే… అసలు సిసలు పోటీ రేవంత్ రెడ్డికి ఈ కూటమితోనే..!
ఎస్, అందుకే రేవంత్ రెడ్డి నేరుగా హరీష్ రావును టార్గెట్ చేస్తున్నాడా..? అందుకే కేటీయార్ పట్ల సానుభూతి, జాలి చూపిస్తూ ఫార్ములా వన్ కేసును లైట్ తీసుకుంటున్నాడా..? ఈ ధోరణితోనే కాళేశ్వరాన్ని దిక్కూమొక్కూ ఉండదని తెలిసీ సీబీఐకి అప్పగించాడా..? ఇదేనా తెర వెనుక సాగుతున్న రాజకీయం..? కేటీయార్ చక్కదిద్దుకోగలడా..? లేక చేతులెత్తేసి హరీష్ రావుకు సరెండ్ అయిపోతాడా..? ఇంట్రస్టింగు విశ్లేషణలు..!!

ఆగండాగండి… జగదీష్ రెడ్డి వంటి నేతలు సైతం అన్నీ మూసుకుంటున్న వేళ పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు..? ఇది తెలంగాణవాదుల్లో సీరియస్ చర్చ… బేసిక్‌గా తను తెలంగాణ వ్యతిరేకి, జగన్ కోసం మానుకోటలో రాళ్ల యుద్ధంలో జగన్ సైనికుడు… (రెడ్డీ రెడ్డీ అనుకున్నాడు గానీ, ఏపీ- తెలంగాణ సోయి లేదు అప్పటికి…)…
సరే, ఫక్తు తెలంగాణ వ్యతిరేకులే తన పార్టీ ప్రాణాధారం అయిపోయిన కేసీయార్ పార్టీలోకి చేరాడు… పెళ్లాంబిడ్డల్ని ముందుబెట్టి వోట్లు వేయకపోతే చస్తాం అని బ్లాక్‌మెయిల్ చేస్తాడు వోటర్లను… ప్రతిదీ ఇష్యూయే… అడ్డూఅదుపూ లేని నోరు…
ఆమధ్య కరీంనగర్ సీపీని మతం పేరిట దూషించాడు, సీఐడీ నోటీసులు, విచారణ షురూ… నిన్నగాక మొన్న అసెంబ్లీలోనే కడియంను చూస్తూ బెదిరింపు సైగల దాకా… అనేక ఇష్యూస్… ప్రతిదీ వివాదమే… ఇటు తనను మోయలేక, వెనకేసుకురాలేక హరీష్ రావు కిందామీదా పడుతున్నాడు… (ఓ దిశ, ఓ దశ లేని కేటీయార్‌ను కాసేపు వదిలేయండి, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే హరీష్ మాత్రమే కదా…)
రాను రాను పార్టీకి తలనొప్పిగా మారాడు కౌశిక్ రెడ్డి… కేటీయార్, హరీష్ తప్ప ఇంకెవరికీ పార్టీ వాయిస్ వినిపించే చాన్స్ లేదు, వినిపిస్తే పార్టీలో ఉంచరు… అది దొరతనం తెలుసు కదా… ఆ దొర గీత దాటి కౌశిక్ రెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నాడు దేనికి..? హరీష్ రావు ఉస్కో అంటున్నాడా..? లేక రేప్పొద్దున హరీష్, కేటీయార్ కలిసి మెడలు బట్టి బయటికి గెంటేయబోతున్నారా..?!
ఓవరాక్షన్‌కు మారుపేరైనా జగదీష్ రెడ్డి వంటి వాళ్లే అన్నీ మూసుకుని ఉంటున్నారు కదా… మరి ఈ కౌశికుడు ఏమిటి..? వెనకేసుకొస్తున్న హరీషుడు ఏమిటి..? కొంపదీసి, కేటీయార్‌ను వ్యతిరేకంగా పకడ్బందీగా హరీష్ రావు ఆర్గనైజ్ చేసుకొస్తున్నాడా..? చివరకు భస్మాసురుడిలాగా కౌశికుడు ఆ హరీష్ రావు నెత్తి మీదే చేతులు పెడతాడా..?
బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు క్వయిట్ ఇంట్రస్టింగు..!! ఓ పాయింట్ దగ్గర రెడ్డి వేరు, దొర వేరు... గతంలో ఇదే కేసీయార్ దొర రెడ్లకు వ్యతిరేక క్యాంపెయిన్ నడిపించాడు అడ్డమైన ఏదో ఛానెల్‌లో... కౌశికుడికి తెలియదేమో బహుశా...
అది దొరల కుటుంబం, ఏదో ఓ దశలో వాళ్లూ వాళ్లూ ఒకటే... అవసరమైతే కౌశికులాంటివాళ్లను వాళ్లు ఇట్టే బలిపెట్టగలరు..!! అది తెలిస్తే తను కౌశిక్ ఎందుకు అవుతాడు..?
Share this Article