Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జామురాతిరి జాబిలమ్మా… అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…

April 7, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. నాకు తిక్కుంది , దానికో లెక్కుంది స్కూల్ స్టూడెంట్ , సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ అతిలోకసుందరి శ్రీదేవికి వ్రాసిన లవ్ లెటర్ 1991 అక్టోబరులో వచ్చిన ఈ క్షణక్షణం సినిమా . లవ్ లెటర్ అని ఆయనే చెప్పుకున్నారు ధైర్యంగా . అంతేనా ! కాలేజీ రోజుల్లో ఆయనకు ఇష్టమైన స్నేహితురాలి పేరు సత్యని శ్రీదేవి పాత్రకు పెట్టారు కూడా .

శివ సినిమా ఎలా అయితే సంచలనం సృష్టించిందో అంత cult classic cum crime thriller cum visual splendour గా మిగిలిపోయింది ఈ క్షణక్షణం . చాలా లిమిటెడ్ పాత్రలతో అద్భుతంగా తీసారు . హీరో హీరోయిన్లు , ఓ విలన్ అతని గ్యాంగ్ , ఓ ఫొటోగ్రాఫర్ , ఓ పోలీస్ ఇనస్పెక్టర్ . ఇవే ప్రధాన పాత్రలు .

Ads

ఓ క్రిమినల్ గ్యాంగ్ చేసిన బాంక్ దోపిడీకి సంబంధించిన కోటి రూపాయలు దాచిపెట్టబడిన లాకర్ వివరాలు అనుకోకుండా శ్రీదేవికి చేరటంతో క్రిమినల్ గ్యాంగ్ , ఫోటోగ్రాఫర్ ఆమె వెంటపడటం ; చిల్లర దొంగతనాలు చేసే వెంకటేష్ ఆమెతో అడవుల్లోకి ఉడాయించటం , పోలీసులు , క్రిమినల్స్ , ఫొటోగ్రాఫర్ వీరిద్దరి వెంట పడటం మెయిన్ కధ .

ఆ క్రమంలో ప్రేమికులు కావటం , గ్యాంగ్ లీడర్ పరేష్ రావల్ని , కోటి రూపాయల డబ్బును పోలీసులకు హేండోవర్ చేసి హీరో హీరోయిన్లు చెట్టాపట్టాలేసుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది . ఇంత సింపుల్గా ఏం ఉండదు సినిమా .

నల్లమల అడవులు , ప్రకృతి అందాలను అద్భుతంగా చూపారు ఫొటోగ్రఫీ డైరెక్టర్ గోపాలరెడ్డి . ఇంక ఈ సినిమా ఘన విజయానికి ముఖ్య కారణం కీరవాణి సంగీతం , సిరివెన్నెల & వెన్నెలకంటి పాటల సాహిత్యం , బాలసుబ్రమణ్యం , చిత్ర , మనో , శ్రీదేవి కంఠం … మించి ప్రభుదేవా నృత్య దర్శకత్వం .‌

ఒక్క జుంబారే జుంబారే పాటను మినహాయించి మిగిలిన పాటలనన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు . జాము రాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా అంటూ సాగే ఈ పాట ఓ దృశ్య కవితే . అద్భుతంగా ఉంటుంది . అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనింతే డ్యూయెట్ , అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం గ్రూప్ డాన్సుల చిత్రీకరణ బ్రహ్మాండంగా ఉంటుంది .

వెన్నెలకంటి వారు వ్రాసిన చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది అంటూ సాగే మరో గ్రూప్ డాన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది . సత్యానంద్ డైలాగులు ప్రేక్షకులు మరచిపోలేనివి . ముఖ్యంగా శ్రీదేవి దేవుడా దేవుడా దేవుడా గొణుగుడు . ఎంత అందంగా , ముద్దుముద్దుగా చెపుతుందో ! అలాగే వెంకటేష్ తాను ఎలా దొంగను కావలసి వచ్చిందో చెప్పే సిన్మా కధ ; ఇదేదో సినిమాలో చూసినట్లుగా ఉందే అనే శ్రీదేవి డైలాగ్ , పరేష్ రావల్ కామెడీ కం విలనీ డైలాగులు చాలా బాగా వ్రాయబడ్డాయి .

శ్రీదేవి

ఓ క్రైం థ్రిల్లర్లో అందమైన , అద్భుతమైన దృశ్యాలను , పాటలను , డాన్సులను వర్మ చాలా గొప్పగా జొప్పించారు . క్రైం సినిమా కావటంతో పోలీసులు , క్రిమినల్స్ చేజింగ్ సినిమాని పరుగెత్తేలా దర్శకత్వం వహించాడు వర్మ . గొప్ప స్క్రీన్ ప్లే .

క్లైమాక్స్ ఫైటింగ్ గూడ్స్ ట్రైన్లో నంద్యాల- గిద్దలూరు రైల్వే పరిధిలో షూట్ చేసారు . సినిమాంతంలో ఇంజన్ జనావాసంలోకి చొచ్చుకు పోవటం గమ్మత్తుగా ఉంటుంది . ప్రేక్షకులు అంతకుముందు చూసి ఉండరు .
నటనపరంగా శ్రీదేవి తన అమాయక అందాన్ని , భయాందోళనలను , డాన్సుల్లో తన నృత్య కౌశల్యాన్ని బ్రహ్మాండంగా చూపింది .

ఆమే ఈ సినిమాకు షీరో అన్నా తప్పు లేదేమో ! వెంకటేష్ . One of the committed professional actors of our Telugu Film Industry . వచ్చిన ఏ పాత్రకయినా పూర్తి న్యాయం చేస్తాడు . ఈ సినిమాలో కూడా అంతే . చిల్లర దొంగగా , ఆవారాగా , అనుకోకుండా ఎంటరయిన అమ్మాయి రక్షకుడిగా హీరోయిజాన్ని చక్కగా ప్రదర్శించారు .

ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది పరేష్ రావల్ని . గ్యాంగ్ లీడర్ నాయర్ గా ప్రత్యేక డైలాగ్ డెలివరీ , వికట నవ్వు బాగుంటాయి . రామిరెడ్డి సీరియస్ లుక్ , విగ్రహం బాగుంటాయి . కాసేపే కనిపించినా క్లాత్ షాప్ ఓనరుగా బ్రహ్మానందం , కొలీగ్గా హేమ , శ్రీదేవి నివసించే ఫ్లాట్సులో విసిగించే వృధ్ధ నేగింగ్ ఫెలో (పేరు తెలియదు) గుర్తుండిపోతారు .

వెరశి ఓ అద్భుతమైన దృశ్య కావ్యం అన్నా తప్పు లేదేమో ! క్రైం సినిమా కాబట్టి కాస్త తటపటాయించవలసి వస్తుంది . లేకపోతే నూటికి నూరు పాళ్ళు అనవచ్చు . సినిమా యూట్యూబులో ఉంది . శ్రీదేవి అభిమానులు ఎన్ని సార్లయినా చూడవచ్చు . అలాగే సినిమా ప్రేమికులు కూడా …!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దురంధరుడి అవార్డుల వేట షురూ… ‘బెస్ట్ ఫిలిమ్’ మాత్రం కాదట..!
  • నకిలీ చమురు కంచికి చేరలేదు… రామర్ పిళ్లై కథకు ముగింపు లేదు…
  • జామురాతిరి జాబిలమ్మా… అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా…
  • పింక్ దొర దాస్యం వదిలేస్తే… తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు…
  • చమురు మంటల నేపథ్యంలో… నాటి రామర్ పిళ్లై బాపతు ఓ జ్ఞాపకం…
  • యోగీ, హిమంత ‘బుల్‌డోజర్’ బాటలో… బెంగాలీ సువేందు అధికారి…
  • రాజకీయ విమర్శల్లో ఘాటు వోకే… కానీ జాతుల్ని కించపరచడం దేనికి..?
  • ప్రళయ్..! ఇక ప్రేక్షకులందరి చూపూ ఈ కొత్త సినిమాపైనే..!
  • ఇరాన్‌లో చిక్కుకున్న అమెరికన్ పైలట్‌ను కాపాడింది ఇదేనా..?!
  • ఏడేళ్ల ‘బాలీవుడ్ బాద్‌షా’ పీఠానికి ఎసరు..! తొలిసారి రణబీర్‌కు కిరీటం..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions