.
పవర్ ఫుల్ ఫ్యామిలీ ఫార్ములా…: ఒకే కుటుంబం… మూడు పార్టీల్లో రాజకీయ పోటీ! బహుశా భారత దేశ రాజకీయ చరిత్రలో దీన్ని ఓ విశేషంగా చెప్పొచ్చునేమో… తమిళనాడు–పుదుచ్చేరి రాజకీయాల్లో ఈసారి ఈ ఆసక్తికరమైన రాజకీయం పెద్ద చర్చనీయాంశంగా మారింది… “లాటరీ కింగ్”గా ప్రసిద్ధి చెందిన Santiago Martin కుటుంబం ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతూ, ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు మూడు వేర్వేరు పార్టీల్లో పోటీ చేయడం విశేషంగా నిలిచింది…
ఈ కుటుంబంలో ముఖ్యంగా దృష్టి ఆకర్షిస్తున్న పేరు Jose Charles Martin… మార్టిన్ కుమారుడైన జోస్ చార్లెస్ పుదుచ్చేరి రాజకీయాల్లో తనదైన స్థానం ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు… ఆయన సొంతంగా పార్టీ ‘లక్ష్య జననాయక కచ్చి (LJK)’ను స్థాపించాడు.., NDA కూటమితో కలిసి ఎన్నికల రంగంలోకి దిగాడు… యువ నాయకుడిగా, తన తండ్రి వ్యాపార ప్రభావాన్ని రాజకీయాల్లోకి మలచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది…
Ads
సింపుల్‌గా చెప్పాలంటే, తండ్రి ఈసారి ప్రయోగిస్తున్న ఓ విచిత్ర ఎత్తుగడ… కొడుకు బీజేపీ కూటమిలో ఉన్నాడు కదా… ఇదే సమయంలో, ఆయన తల్లి, అనగా మార్టిన్ భార్య Leema Rose Martin తమిళనాడులో AIADMK తరఫున పోటీ చేస్తున్నది… ఆల్రెడీ ఈ లాటరీ కింగ్ కుటుంబానికి డీఎంకేతో మంచి సంబంధాలు ఉన్నాయి కూడా…
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు విశేషంగా వినిపిస్తున్న పేరు టీవీకే విజయ్ కదా… అందుకని ఆ పార్టీలో కూడా కర్చీఫ్ వేశాడు మార్టిన్ ఎప్పుడో… అల్లుడిని దింపాడు… అల్లుడి పేరు ఆధవ అర్జున… ప్రస్తుతం టీవీకేలో నెంబర్ టూ… తను కూడా టీవీకే నుంచి ఇప్పుడు పోటీలో ఉన్నాడు కూడా…
జాగ్రత్తగా గమనించండి… వాళ్ల లాటరీ వ్యాపారానికి తమిళనాడు అడ్డా… అక్కడ కీలకమైన పార్టీలు, ప్లస్ కేంద్రంలో కీలకమైన పార్టీ ఏమిటి..? అన్నాడీఎంకే, డీఎంకే, టీవీకే, బీజేపీ… ఇంతే కదా… సో మార్టిన్ భార్యను అన్నాడీఎంకే నుంచి పోటీకి దింపాడు… అల్లుడిని టీవీకే నుంచి పోటీచేయిస్తున్నాడు… కొడుకు బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నాడు పుదుచ్చేరిలో… డీఎంకేతో సత్సంబంధాలు సరేసరి…
ఇదేమీ యాదృచ్ఛికం కాదు… పక్కా ప్లానింగ్… ఎవరు అధికారంలోకి వచ్చినా సరే, తన మాట చెల్లుబాటు కోసం ఎత్తుగడ… ఎందుకు అంటారా..? లాటరీ మార్టిన్‌గా చెప్పబడే ఈ గ్రూపు వ్యాపారం లాటరీ టికెట్లు… అనేక అక్రమాల కేసులున్నాయి… అదీ విడిగా, వివరంగా చెప్పుకుందాం… ప్రతి పార్టీలో తన వాయిస్ ఉండాలనే మార్టిన్ వ్యూహం విశేషమే కదా మరి…
సాంప్రదాయ రాజకీయాల్లో ఒక కుటుంబం ఒకే పార్టీకి పరిమితం కావడం అత్యంత సాధారణం. అయితే మార్టిన్ కుటుంబం మాత్రం ఆ పరిమితిని దాటి, ఒకేసారి వేర్వేరు రాజకీయ వేదికలపై తమ ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నించడం గమనార్హం…

వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రభావం, భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ “పవర్ ఫుల్ ఫ్యామిలీ ఫార్ములా” ఇప్పుడు తమిళనాడు–పుదుచ్చేరి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది… ‘లాటరీ మామగారా … మజాకా…’’
Share this Article