.
Bhavanarayana Thota …. సినిమా హక్కులు – టీవీ చానల్స్ మధ్య పోటీ …. 1999 డిసెంబర్ 31. కొత్త శతాబ్దానికి స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భానికి తగినట్టు పేరుమోసిన సినిమా వేయాలనుకోవటం శాటిలైట్ చానల్స్ కు సహజం. ఈటీవీ, జెమినీ మధ్య గట్టిపోటీ ఉన్న ఆ రోజుల్లో యూత్ ను ఆకట్టుకోవటానికి ‘ప్రేమికుడు’ సినిమా వేయాలని ఈటీవీ నిర్ణయించుకుంది. 10 రోజుల ముందు నుంచే ప్రోమో నడుపుతూ వచ్చింది. జెమినీ టీవీ గుంభనంగా ఉండిపోయింది.
తీరా 31 వతేదీ సాయంత్రం 5 గంటలకు స్టే తెచ్చింది. ఈటీవీ కి హక్కులు లేవంటూ కోర్టు చెప్పటంతో షాక్ తిన్నది. అదేదో పది రోజుల ముందు ప్రోమో వేసినప్పుడే చెప్పకుండా కావాలనే తమను అవమానించినట్టు ఈటీవీ నిర్థారించుకుంది. సన్ టీవీ చేసిన ఈ పనివల్ల అప్పటిదాకా ఈటీవీ యాజమాన్యానికీ, జెమినీ హైదరాబాద్ డైరెక్టర్లకూ మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి.
Ads
ఇంతకీ జరిగిందేంటంటే … కుంజుమోన్ అనే మలయాళ నిర్మాత ‘కాదలన్’ పేరుతో ప్రభుదేవా, నగ్మా హీరోహీరోయిన్లుగా సినిమా తీశాడు. నాలుగు భాషల్లో ఆ సినిమా డబ్ చేయించాడు. తెలుగు హక్కులు ఎ.ఎం. రత్నం కొనుక్కున్నాడు. ఆయన దగ్గర ఈటీవీ ఆ సినిమా శాటిలైట్ టీవీ ప్రసార హక్కులు కొనుక్కుంది.
కానీ అసలు విషయమేంటంటే తెలుగు హక్కులు అమ్మిన కుంజుమోన్.. టీవీ ప్రసార హక్కులు తన దగ్గరే ఉంచుకున్న సంగతి రత్నం గాని, ఈటీవీ గాని గ్రహించలేదు. నాలుగు దక్షిణాది భాషల టీవీ హక్కులు సన్ టీవీకి అమ్మటం వలన ఈ చిక్కొచ్చి పడింది. ఇలాంటి లిటిగేషన్లు వచ్చే కొద్దీ ఆ తరువాత కాలంలో అగ్రిమెంట్స్ లో జాగ్రత్తపడటం కూడా పెరిగింది.

****
ఒక చానల్ లో వచ్చిన సినిమా ఇంకో చానల్ లో రాదు. హక్కులు ఎవరికి ఉంటే వాళ్ళే ఆ సినిమా వేయాలి. గడువు పూర్తయ్యాక హక్కులు కొనుక్కుంటేనే మరో చానల్ లో ఆ సినిమా వస్తుంది. ఈ హక్కుల కోసం చానల్స్ పోటీ పడి ధరలు పెంచుతాయి. ఈ గొడవలు కోర్టు దాకా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ అమ్మకాలు, కొనుగోళ్లకు మధ్యవర్తులు కూడా ఉంటారు.
ఈ హక్కుల కొనుగోళ్ళు వ్యవహారంలో కాలక్రమంలో చాలా మార్పులొచ్చాయి. Theatrical rights తో మొదలై డబ్బింగ్, ఆడియో, డీవీడీ, శాటిలైట్, కేబుల్, డిజిటల్, ఓటీటీ దాకా రకరకాలుగా వాడుకోవటానికి అవకాశాలు పెరిగేకొద్దీ ఈ హక్కులు కూడా పుట్టుకొచ్చాయి.
స్థూలంగా చెప్పాలంటే మొదట్లో నిర్మాతలకు theatrical rights గురించి మాత్రమే తెలుసు. కొద్ది రోజులకే రీమేక్, డబ్బింగ్ హక్కులు అమ్మటం మొదలైంది. కాసెట్ల కాలంలో ఆడియో హక్కులు మొదలయ్యాయి. ఆ తరువాత టీవీల వాళ్ళకి టీవీ ప్రసార హక్కులు అమ్ముకోవచ్చునని అర్థమైంది.
ఈటీవీ మొదలుపెట్టటానికి ఏడాది ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఈ విషయం మీద దృష్టిపెట్టింది. ఆ రోజుల్లోనే దాదాపు 1500 సినిమాల హక్కులు సంపాదించింది. అదొక ఆదాయ వనరు అనే సంగతి నిర్మాతలకు తెలియని రోజులవి. ఒక్కో సినిమాకు కేవలం 5 వేలు ఇచ్చి రాయించుకున్న సందర్భాలు అనేకం.
- అలా నిర్మాతలు ఆటకెక్కించిన సినిమా రీళ్ళ డబ్బాలు తీసి ఇస్తే వాటిని చానల్స్ వాళ్ళు టెలీ-సినీ చేయించుకున్నారు. ( సినిమా రీలు సెకెనుకు 24 ఫ్రేములు, టీవీ అయితే సెకెనుకు 25 ఫ్రేములు ఉంటాయి కాబట్టి ఆ స్పీడ్ ను మార్చి కాసెట్ లోకి ఎక్కించటాన్ని టెలీ సినీ అంటారు. డిజిటల్ కాసెట్ లో ఉన్న కంటెంట్ ను సినిమా తెరకు అనుగుణంగా మార్చాలంటే రివర్స్ టెలీ సినీ చేయిస్తారు).
(telecine)
మొత్తానికి ఈటీవీ చాలా తెలివిగా తక్కువ మొత్తానికి ఎక్కువ సినిమాలు రాయించుకోగలిగింది. చాలా సినిమాలు 99 ఏళ్ళకు రాయించుకుంది. ఎవరైనా మరీ ఇదేంటని అడిగితే అసలు ఏళ్ల సంగతి ప్రస్తావించకుండా రాయించుకుందట. అలా చాలా పాత సినిమాలను ఈటీవీ దక్కించుకుంది. ఏదైనా సినిమా ఈటీవీ దగ్గర ఉందంటే అది 99 ఏళ్ళు అయి ఉంటుందని జెమినీ టీవీ సహా మార్కెట్ అంతా అనుకునేది. అప్పట్లో జెమినీ సినిమాలు ఐదారు వందలు దాటలేదు. సన్ టీవీ పరిధిలోకి వెళ్ళాక సినిమాల కొనుగోలు వేగం పుంజుకుంది.
ఇలా ఉండగా, కేబుల్ టీవీ వాళ్ళకు సినిమాలు అవసరమొచ్చాయి. అందుకే నిర్మాతల దగ్గర నుంచి కేబుల్ హక్కులు కొనుక్కోవటం మొదలుపెట్టారు. కేబుల్ టీవీల బలం తక్కువ కాబట్టి మధ్యవర్తులు నిర్మాతల దగ్గర కొనుక్కొని అడిగిన కేబుల్ చానల్స్ వాళ్ళందరికీ non-exclusive అంటూ ప్రసారహక్కులు రాసిచ్చేవారు.
- అలా కాకుండా కేబుల్ చానల్స్ యాజమాన్యాలు అన్నీ కలిసి కొనుక్కొని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలని, కేబుల్ కనెక్షన్ల సంఖ్యను బట్టి ఖర్చు అందరూ భరించాలని అప్పట్లో సిటీ కేబుల్ రామకృష్ణ అనుకున్నారు. అదెందుకో కార్యరూపం ధరించలేదు. అంతలోనే ఆయన హత్యకు గురయ్యారు.

అ తరువాత కేబుల్ వాళ్ళకు సినిమాలు అందకుండా చేయాలని, వాళ్ళకు అందితే తమకంటే ముందే టెలికాస్ట్ చేస్తారని శాటిలైట్ చానల్స్ ఆలోచించాయి. అందుకే శాటిలైట్ హక్కులతోబాటు కేబుల్ హక్కులు కూడా కలిపి కొనుక్కోవటం మొదలుపెట్టాయి.
- కాలం గడుస్తున్న కొద్దీ కొత్త టెక్నాలజీ రాకను పసిగట్టిన మధ్యవర్తులు సినీ నిర్మాతల దగ్గర కేబుల్, శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా రాయించుకొని డిజిటల్ హక్కులు తమ దగ్గరే ఉంచుకుంటూ వచ్చారు. కొంతమంది నేరుగా నిర్మాతల దగ్గర డిజిటల్ హక్కులు రాయించుకున్నారు. అలా లాభపడిన వాళ్ళలో మ్యాంగో రామ్, తెలుగు వన్ రవిశంకర్ లాంటి వాళ్ళున్నారు.
ఇప్పుడైతే శాటిలైట్ చానల్స్ వాళ్ళు శాటిలైట్, కేబుల్ తో బాటు డిజిటల్ హక్కులు, ఇంకా ఎక్కువ మొత్తం ఇచ్చి ఓటీటీ హక్కులు కూడా కొనుక్కుంటున్నారు.
టీవీ చానల్స్ కు సీరియల్స్ వలన loyal viewers (విధేయ ప్రేక్షకులు) దొరుకుతారు. Repeat audience తో రేటింగ్స్ పెరుగుతాయి. సినిమా అయితే ఎక్కువ సేపు చానల్ ముందర కూర్చోబెట్టుకోవచ్చు. పైగా సినిమాలో పాటలు, కామెడీ బిట్స్, ఫైట్స్, కొన్ని సీన్లు విడిగా కట్ చేసి కూడా వాడుకోవచ్చు. అందుకే సినిమాలకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది.

ఒకప్పుడు వేలల్లో ఉన్న సినిమా లక్షల్లోకొచ్చింది. 90 లలో సీతారామయ్యగారి మనవరాలు 10 లక్షలు, ఆ తరువాత వచ్చిన పెళ్ళి సందడి 20 లక్షలు పలకటం అప్పట్లో సంచలనాలు. కానీ ఇప్పుడు ఒక మోస్తరు సినిమా కూడా కోట్లలోనే. పెద్ద సినిమాలు 20 కోట్ల దాకా ఉన్నాయి. కొన్ని ఆ ధర కూడా మించిపోయాయి.
టెలికాస్ట్ చేసే విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు గాని, అవి పూర్తిగా అమలు కావటం లేదు. సినిమా విడుదలైన ఆరు నెలల్లోగా టీవీలో ప్రసారం చేయకూడదని తెలుగు నిర్మాతలు ఒక కండిషన్ పెట్టారు. తమిళంలో ఏడాదిపాటు అనే నిబంధన ఉంది. ఇదంతా థియేటర్ ప్రదర్శనలకు అడ్డంకి కాకూడదని.
- ఇక్కడో సంఘటన గుర్తు చేయాలి. రజనీకాంత్ సినిమా ‘బాబా’ తమిళ హక్కులు సన్ టీవీకి దక్కలేదు. సన్ టీవీతో విభేదించి సొంత చానల్స్ పెట్టుకున్న కరుణానిధి ఆధ్వర్యంలోని కలైంజ్ఞర్ టీవీ కొనుక్కుంది. తెలుగు హక్కులు జెమినీ కోసం సన్ టీవీ కొన్నది. తెలుగు నిబంధన ప్రకారం ఆరు నెలలు పూర్తికాగానే తెలుగు ‘బాబా’ టెలికాస్ట్ చేశారు. తమిళనాడులో బాగా ప్రచారం చేయటం వల్ల అక్కడి ప్రేక్షకులందరూ చూశారు. రజనీకాంత్ సినిమాకి భాషతో సంబంధమేముంది! అలా కలైంజ్ఞర్ టీవీని దెబ్బకొట్టారు.

ఒకరి దగ్గర ఉన్న సినిమా మరొకరు టెలికాస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి పోటీ మరో రకంగా ఉంటుంది. అవతలివాళ్ళు వేసే సినిమాకు దీటుగా వీళ్ళొక సినిమా వేస్తారు. ఇరవయ్యేళ్ళ కిందట ఈ పోటీ ఎంతగా ఉండేదంటే ఒకే హీరో సినిమాలు ఈటీవీ, జెమినీ పోటాపోటీగా టెలికాస్ట్ చేసేవి. పోటీ చానల్ ఏ సినిమా ఏ రోజుకు రెడీ చేసుకుంటున్నదో తెలుసుకోవటానికి వేగుల్ని పెట్టుకునేవారని కూడా గుసగుసలాడుకునేవాళ్ళు.
ఇది వాళ్ళ ఎత్తుగడల్లో భాగం.
- ఒక సినిమా మీద ఏ సినిమా వేయాలో నిర్ణయించుకోవటం ఆ చానల్ వ్యూహంలో భాగం. అవతలి వాళ్ళు ఒక భారీ సినిమా వేస్తుంటే మనం కూడా అందుకు తగ్గ సినిమా వేయటమా, మన పెద్ద సినిమా వృధా చేసుకోకుండా ఒక మామూలు సినిమా వేసి వదిలేయటమా అనేది చానల్ నిర్ణయించుకుంటుంది. ఇది పేకాట లాంటిదే. ఎదుటివాడికి పట్టని కార్డ్ వేయటమా, మనకు పనికిరాని కార్డ్ వేయటమా అని ఆలోచించినట్టే.
బాగా పేరొచ్చిన, థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు టీవీలో బాగా చూస్తారనే గ్యారెంటీ లేదు. అలా బోల్తా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా మొదటిసారి టీవీలో వేస్తే దాని ధరలో కనీసం 20 శాతం రాబట్టుకోగలిగితే గిట్టుబాటు అయినట్టు లెక్క. అయితే, కొన్ని సినిమాలు థియేటర్ ప్రేక్షకులకంటే టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

స్టార్ మా టీవీలో టెలికాస్ట్ అయిన ‘అతడు’, ‘మల్లీశ్వరి’ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణలు. థియేటర్ల సంగతెలా ఉన్నా, టీవీలో మాత్రం అవి శతదినోత్సవాలు జరుపుకున్నాయని సరదాగా అంటూ ఉంటారు. మల్లీశ్వరి ప్రోమో కనబడగానే ఇది మల్లీశ్వరి కాదు ‘మళ్ళీ’శ్వరి అనేంతగా పదే పదే టెలికాస్ట్ చేశారు.
మామూలుగా అయితే, ఏదైనా సినిమా వెంటవెంటనే వేస్తున్నారంటే దాని హక్కుల గడువు దగ్గర పడుతున్నదని, హక్కులు పొడిగించుకోవటం లేదని అర్థం. అందుకే అలా పీల్చి పిప్పి చేసి వదిలేస్తారు. కొత్తగా హక్కులు కొనుక్కునేవాళ్ళు కనీసం ఆరునెలల్లోపు టెలికాస్ట్ చేయటానికి వెనుకాడేంతగా వాడిపడేస్తారు. కానీ అతడు, మల్లీశ్వరి మాత్రం అందుకు మినహాయింపు.
హిందీలో అయితే సింగిల్ టెలికాస్ట్ కోసం కొనుక్కోవటం అలవాటే. అందుకే ఒకసారి ఒక చానల్ లో వస్తే ఇంకో నెలకే ఇంకో చానల్ లో ఆ సినిమా టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో అలా కాదు. అయితే, మా టీవీలో గణేశ్ అనే సినిమా మొదటిసారిగా అలా టెలికాస్ట్ అయింది. అప్పట్లో చానల్ పెట్టుకుందామనే ఆలోచనతో సురేశ్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు దాదాపు 70 సినిమాలు ఎవరికీ అమ్మలేదు.

అయితే, మా టీవీ కోరిక మీద ప్రయోగాత్మకంగా ‘గణేశ్’ హక్కులు సింగిల్ టెలికాస్ట్ కోసం ఇచ్చారు. ఆ ప్రసారానికి వచ్చే ఆదాయాన్ని చేరి సగం పంచుకోవటమన్నది ఆ ఒప్పందం సారాంశం. ఆ ప్రయోగం విజయవంతం అయింది గాని, ఆ తరువాత మొత్తం సినిమాలు మా టీవీ కొనుక్కుంది. ఈటీవీ ఆరేడేళ్ళ కిందట కొన్ని కొత్త సినిమాలకు అలాంటి సింగిల్ టెలికాస్ట్ అవకాశమిచ్చింది. థియేటర్లలో రిలీజ్ చేసుకునే స్తోమత లేనివాళ్ళు ఇలా ఈటీవీ వేదికగా రిలీజ్ చేసుకున్నారు. కానీ ఈ ప్రయోగం కూడా ఐదారు నెలలు మించి సాగలేదు.
సాధారణంగా సినిమా హక్కులు 5 లేదా 10 ఏళ్ళకు రాయించుకుంటారు. కానీ ఈటీవీ చాలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు 99 ఏళ్ళకు రాయించుకుంది. ఆ నంబర్ చూసి భయపడుతుంటే .. ఏళ్ల ప్రస్తావనే లేకుండా కొన్ని సినిమాలు రాయించుకుందని చెప్పానుగా. అయితే 10- 12 ఏళ్ల కిందట ఒక నిర్మాత ఈ హక్కుల గురించి ఆరా తీసి తన అగ్రిమెంట్ చదువుకుంటే.. అందులో ఎన్ని ఏళ్ళు అనే విషయం లేదని గ్రహించాడు. కోర్టుకెక్కాడు. ఏళ్ల ప్రస్తావన లేకపోతే పదేళ్ళుగా భావించాలని కోర్టు చెప్పింది.
- ఈటీవీ యాజమాన్యం ఆ సినిమాలు వదులుకుంది. ఇదే అదనుగా నార్నె శ్రీనివాసరావు అనే చానల్ యజమాని (చంద్రబాబు మేనల్లుడు, జూనియర్ ఎన్టీయార్ కు పిల్లనిచ్చిన మామ) అలాంటి నిర్మాతల దగ్గరికెళ్ళి కొత్తగా హక్కులు రాయించుకున్నారు. కోర్టు తీర్పు గురించి తెలియక “ఇంతకుముందే ఈటీవీకి ఇచ్చేశాం కదా?” అని అమాయకంగా అడిగినవాళ్ళున్నా, “అవన్నీ చూసుకుంటా”నని ఒప్పించి, కొంత డబ్బిచ్చి సంతకాలు పెట్టించుకున్నారు. అప్పట్లో ఆయన ‘స్టూడియో ఎన్’ అనే న్యూస్ చానల్, ‘స్టూడియో వన్’ అనే జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ నడిపేవారు. ఆ తరువాత న్యూస్ చానల్ ను కల్కి భగవాన్ కొడుకు కొనుక్కున్నాడు. ‘యువ’ పేరుతో ఎంటర్టైన్మెంట్ చానల్ మాత్రం నార్నె నడుపుతున్నారు.

ఏషియా నెట్ వాళ్ళు తెలుగులో సితార పేరుతో ఎంటర్టైన్మెంట్ చానల్ పెట్టాలని దాదాపు 300 సినిమాలు కొన్నారు గాని, ఏషియానెట్ ను స్టార్ కొనుక్కోవటంతో చానల్ ఆలోచన మానుకున్నారు. ఆ సినిమాల హక్కులు కాలగర్భంలో కలిసిపోయాయి. దాదాపు 70 కోట్లు వృధా అయినట్టు ఒక అంచనా.
సినిమాల హక్కుల విషయంలో అందరికంటే ముందున్న ఈటీవీ దాదాపు 2 వేల సినిమాలు తన దగ్గర ఉన్నప్పుడు కూడా మూవీ చానల్ పెట్టలేకపోవటం ఆశ్చర్యకరం. అందరికంటే చాలా ఆలస్యంగా మూవీ చానల్ పెట్టింది. అప్పటికే సగానికి పైగా సినిమాలకు హక్కుల గడువు తీరిపోయింది. కాకపోతే, ఇప్పుడు ఈటీవీ విన్ పేరుతో ఓటీటీలో కొంత హడావిడి చేస్తోంది.
(ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ‘టెలివిజన్ చరిత్ర-వ్యవస్థ-వ్యాపారం’ పేరుతో రాస్తున్న పుస్తకంలో సుమారు 30 పేజీల అధ్యాయంలోని కొన్ని సంగతులివి)… – తోట భావనారాయణ
Share this Article