.
అవును, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు… మూలిగే తెలంగాణ బీజేపీపై తేజస్వి పడ్డట్టు… ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విభజన చేసిన తీరును కర్నాటక ఎంపీ తేజస్వి సూర్య ఏకంగా ఇండియా- పాకిస్థాన్ విభజనతో పోల్చి, తెలంగాణ బీజేపీని ఓ పోటు పొడిచాడు…
నిజానికి తేజస్వి సూర్య సొంత వికారం ఏమీ కాదు ఇది… గతంలో మోడీ మహాశయుడు వెలిబుచ్చిన ‘తల్లిని చంపారు, బిడ్డను తీశారు’ బాపతు వ్యాఖ్యే… నిజానికి వాళ్ల ఉద్దేశం కాంగ్రెస్ రెండు రాష్ట్రాలను విడదీసిన విధానాన్ని విమర్శించడం…!
Ads
మేం మూడు రాష్ట్రాలను సామరస్యంగా, ఏ విద్వేషాలు ప్రబలకుండా సాఫీగా ఏర్పాటు చేశాం కానీ, కాంగ్రెస్ మాత్రం విద్వేషపు మంటల్ని రేపి మరీ విభజించింది అని చెప్పుకోవడం… కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే తీరు దారుణంగా ఉంది… ఒకరకంగా తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మారింది… వాడే భాష, సందర్భం ముఖ్యం… అది లోపించింది…
తేజస్వి సూర్య పైత్యం ఏమిటంటే..? పార్లమెంటులో జరిగే చర్చ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై… హఠాత్తుగా తను ఏపీ, తెలంగాణ విభజన గాయాన్ని మళ్లీ రేపడంతోపాటు… పాకిస్థాన్‌తో పోల్చి ఒక్కసారిగా తెలంగాణలో ఆత్మాభిమాన ఉద్వేగాన్ని రేపాడు… బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నించే బీఆర్ఎస్ కూడా గొంతువిప్పింది… కాంగ్రెస్ భగ్గుమంది… అందుకే ఉద్దేశం ఏదైనా సరే, తేజస్వి సూర్య భాష సరికాదు, పోలిక సరికాదు, సందర్భం సరికాదు… ఏదీ సరికాదు…
పోనీ, తన ఓ పొరుగు రాష్ట్ర ఎంపీ మాత్రమే… మంత్రి కాదు, కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కాదు, బీజేపీ ముఖ్యుడు కూడా కాదు… మరి తనకెందుకు ఈ తీట వ్యాఖ్యలు..? పైగా రాష్ట్ర విభజన జరిగి పుష్కరం కావొస్తోంది… మరెందుకు ఈ గోకుడు..?

అసలే తెలంగాణ బీజేపీలోనే అంతర్గతంగా అనేక పార్టీలు… అనగా గ్రూపుల తంపులాటలు… ఒకరంటే ఒకరికి పడదు… 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు… వెరసి 16 గ్రూపులు అన్నట్టుగా మారింది… మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు ఇచ్చిన నిధుల దుర్వినియోగం, స్వాహా ఆరోపణలు బీజేపీ ఇజ్జత్ తీశాయి ఇప్పటికే… అసలే మూలుగుతున్న తెలంగాణ బీజేపీకి ఈ తేజస్వి తెంపరివ్యాఖ్యలతో మరింత నష్టం వాటిల్లినట్టే…
తేజస్వి సూర్యను ఏమీ అనలేక నోళ్లు మూసుకున్నారు అందరూ… ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే… తేజస్వీ, మైండ్ యువర్ టంగ్ అనలేకపోయారా..? అంటే హైకమాండ్ ఏమైనా శిక్షిస్తుందా..? అంత భయం దేనికి..? నేను బండి సంజయ్ నుంచి స్పందన ఆశించాను… ప్చ్, పాపం…
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంచందర్‌రావు మాత్రం తేజస్వి వ్యాఖ్యల్ని భూతద్దంలో చూడకండి అని ఏదో అర్థంపర్థం లేని వివరణో, స్పందనో కనబరిచాడు… అసలే రాబోయేవి జెడ్పీటీసీ ఎన్నికలు, తరువాత హైదరాబాద్ మూడు కార్పొరేషన్ల ఎన్నికలు… ఈ నేపథ్యంలో తేజస్వి సూర్య తెలంగాణ బీజేపీని ఓ పోటు పొడిచాడు… అకారణంగా, అసందర్భంగా, అవివేకంగా..!!
.
దక్షిణాదికి అన్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ డీలిమిటేషన్ ఫార్ములాను కూడా… ఓ సౌత్ ఎంపీ అయి ఉండీ గేలి చేయడానికి ప్రయత్నించాడు తేజస్వి సూర్య… ఈయనకు హైదరాబాద్, తెలంగాణ బీజేపీ సానుభూతిపరుల్లో కాస్త ఇమేజ్ ఉండేది… ఈ దెబ్బకు అదీ కోల్పోయాడు..!
Share this Article