.
బిల్లులు వీగిపోయాయి, ఎన్డీఏ ఓడిపోయింది, బీజేపీ చతికిలపడింది, విపక్షం గెలిచింది… వంటి ఎన్నో విశ్లేషణలు కనిపిస్తున్నాయి, కొన్నాళ్లు ఈ చర్చ సాగుతుంది… తమ కూటమికి టూథర్డ్ మెజారిటీ లేదని బీజేపీకి తెలియదా..? రాజ్యాంగ సవరణ బిల్లులు కాబట్టి స్పెషల్ మెజారిటీ తప్పదని తెలియదా..? తెలుసు, ఇదొక గేమ్… ఒక సమస్యకు పరిష్కారం ప్రయత్నం చేసింది… వైఫల్యాన్ని విపక్షం మీదకు నెట్టేస్తుంది… ‘మహిళ రిజర్వేషన్ల’ను విపక్షం వ్యతిరేకించింది అనే బ్లేమ్ గేమ్… ఆల్రెడీ స్టార్టయింది…
కానీ అసలు ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది… జనగణన తరువాత మళ్లీ ఆ ప్రశ్నే ఓ పెద్ద పీటముడిగా మారనుంది… ఇప్పుడు ఏ సమాధానం కోసం ప్రభుత్వం వెతికిందో… జనగణన తరువాత కూడా అదే ప్రశ్నకు ఇదే సమాధానం శరణ్యం… 800 దాకా సీట్ల పెంపూ తప్పదు, ఇదే 50 శాతం ప్రొరేటా కూడా తప్పదు… ఎలాగంటే..?
Ads
- జనగణన తరువాత డీలిమిటేషన్ ఎలాగూ తప్పదు… కమిషన్ వేయాల్సి ఉంటుంది… అది జనాభా ప్రాతిపదికన గనుక సీట్లను పెంచితే సౌత్ ఇండియాకు భారీ నష్టం తప్పదు… ఒకవేళ 543 సీట్ల సంఖ్యను అలాగే ఉంచి, రాష్ట్రాల నడుమ జనాభాను బట్టి సర్దుబాటు చేస్తే దక్షిణాదికి మరింత నష్టం, ఇప్పుడున్న సీట్ల సంఖ్యలోనే భారీగా కోత పడుతుంది… అప్పుడు సౌత్ ఇండియా తిరగబడుతుంది… దేశమంతా అశాంతి… మంటలు…
సో, సంఖ్య పెంచాల్సిందే… కానీ ఏ ప్రాతిపదిక..? అదే చిక్కుముడి…! 1971 జనాభా ఆధారంగా ఫ్రీజ్ చేయబడిన సీట్ల సంఖ్యను అలాగే ఉంచితే ‘జనాభాను బట్టి ప్రాతినిధ్యం’ ‘ఒక వ్యక్తి- ఒక వోటు- సమాన విలువ’ అనే స్పిరిట్ పోతుంది… కానీ జనాభాను బట్టి సీట్లు అంటే, దక్షాణాది ఊరుకోదు… అందుకని మధ్యేమార్గంగా కేంద్రం 50 శాతం ప్రొరేటాతో ప్రతి రాష్ట్రంలోనూ సీట్లను పెంచి, 816 దాకా తీసుకుపోతాం అని చెప్పింది… అంటే, జనాభా లెక్కల జోలికి పోకుండా, ప్రస్తుత ప్రాతినిధ్య శాతమే కొనసాగేలా చూస్తామంది… ఫలితంగా సౌత్ ఇండియాకు ఆందోళన అక్కర్లేదనేది కేంద్రం భావన…
- వుమెన్ రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది కాబట్టి 2023 నాటి వుమెన్ రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియం) అమలుకు సిద్ధంగా ఉన్నట్టే… డీలిమిటేషన్ తరువాత 33 శాతం మహిళలకు సీట్లు ఇచ్చేస్తే, పురుష ఎంపీల సీట్లకు ఎసరు తప్పదు… ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు మాత్రమే కాదు, ఇతర పార్టీలూ అంగీకరించవు… సో, సీట్ల సంఖ్య పెంచకతప్పదు…
మళ్లీ అదే ప్రశ్న… ఎంతకు పెంచాలి, ఎలా పెంచాలి..? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన హైబ్రీడ్ డీలిమిటేషన్ మోడల్… 50 శాతం పెంచాలి, కానీ 25 శాతం ప్రొరేటా ప్రకారం, మరో 25 శాతం జీఎస్డీపీ అంటే అభివృద్ధి ప్రాతిపదికన పెంచాలనేది తన ప్రతిపాదన… మంచి పనితీరుకు ప్రోత్సాహం అన్నమాట… ఇది రీజనబుల్… ఇలా చేస్తే దక్షిణాదికి అభివృద్ధి కోణంలో అదనపు సీట్లు కలిసొస్తాయి…
- పోనీ, ఈ స్టాలిన్లు, ఈ మమతలు మరేదైనా ఉత్తమ ప్రతిపాదనను తీసుకొస్తున్నారా..? లేదు, జీరో… మా రాష్ట్రంలో మేం శరణార్థులం కావాలా అని స్టాలిన్ (ఈ శరణార్థుల భాషేమిటో), వోటర్ల తొలగింపుకే ఈ డీలిమిటేషన్ అని మమత (ఈమెది పిచ్చి తర్కం) విమర్శలు చేస్తున్నారు, ఇండి కూటమి ఆ మాయలో పడిపోయింది గానీ… అసలు సీట్ల పెంపుకి భేషైన ప్రామాణికం, ప్రాతిపదిక ఏదనే ప్రశ్నకు సమాధానం ఏది..?
జనగణన తరువాత మరి డీలిమిటేషన్ సమస్యలకు సమాధానం..? కేంద్రం తప్పకుండా ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాల్సిందే… ఆచరణీయ ప్రతిపాదనలను అఖిలపక్షం ఎదుట ఉంచాల్సిందే… మరి ఇప్పుడు ఎందుకు ఆ ప్రయత్నాలు చేయలేదు, అసలు వుమెన్ బిల్లుకూ డీలిమిటేషన్‌కూ లంకె ఎందుకు పెట్టినట్టు అంటారా..? అదే బీజేపీ తాత్కాలిక ఫాయిదా కోసం, పబ్లిక్ నెరేటివ్ కోసం ఆడాలనుకున్న గేమ్… ఓడిందో గెలిచిందో కాలం చెబుతుంది..!!
“డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల లెక్కల ఆట కాదు…
ఇది భవిష్యత్ భారత రాజకీయ సమతుల్యతకు సంబంధించిన యుద్ధం…
కానీ ఆ యుద్ధానికి రూల్స్ ఎవరు రాస్తారు అనేదే అసలు ప్రశ్న”
Share this Article