.
వుమెన్ రిజర్వేషన్ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల గోలలో పడి… ఓ ముఖ్యమైన వార్తపై పెద్దగా చర్చ జరగడం లేదు… అది రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం మీద కేసు… అలహాబాద్ హైకోర్టు ఈ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది… లిటిగెంటుగా ఢిల్లీ సర్కిళ్లలో చెప్పబడే సుబ్రహ్మణ్య స్వామి పట్టువదలని విక్రమార్కుడిలా ఈ కేసును వదలడం లేదు…
రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యస్వామి మొదటిసారి సెప్టెంబర్ 2015లో ప్రధాని కార్యాలయానికి, కేంద్ర హోం శాఖకు లేఖ రాశాడు… ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన కేంద్ర హోం శాఖ, 2019 ఏప్రిల్‌లో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది… ఇదే అంశంపై దాఖలైన ఒక పిటిషన్‌ను సుప్రీం కోర్టు 2019 మేలో కొట్టివేసింది…
Ads
సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో ఈ విచారణను వేగవంతం చేయాలని కోరుతూ మళ్ళీ పిటిషన్ దాఖలు చేశాడు… ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ పాత వివాదానికి కొనసాగింపుగానే వచ్చాయి…
కేసు నేపథ్యం… ఈ వివాదం ప్రధానంగా ‘బ్యాక్‌ఆప్స్’ (Backops Limited) అనే బ్రిటీష్ కంపెనీకి సంబంధించినది… రాహుల్ గాంధీ ఈ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, 2005, 2006 సంవత్సరాల్లో బ్రిటన్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించిన వార్షిక రిటర్న్స్‌లో తనను తాను ‘బ్రిటీష్ పౌరుడిగా’ పేర్కొన్నారనేది ఆరోపణ…
మన విదేశాంగ శాఖ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆధారాలు సేకరించింది… అవేమిటో మాత్రం చెప్పదు, కోర్టుకు ఇవ్వదు… నాన్చుతోంది… ఈ డిలేయింగ్ టాక్టిక్స్ మీద సుబ్రహ్మణ్యస్వామి కోర్టులోనే ప్రస్తావించాడు… ఒక వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేయడం అనేది అత్యంత కీలకమైన అంశం… 1) కేవలం ఒక కంపెనీ డాక్యుమెంట్‌లోని ఎంట్రీ ఆధారంగా, తగినన్ని బలమైన ఆధారాలు లేకపోతే అంతర్జాతీయంగా అది వివాదాస్పదమవుతుందని కేంద్రం భావన…
2) పౌరసత్వం రద్దయితే, ఇక రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీచేయలేడు… ఉన్న ఎంపీ పోస్టు రద్దు తప్పదు… రాహుల్ ప్రధాని గాకుండా, కావాలనే బీజేపీ ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ సానుభూతి గెయిన్ చేసుకునే అవకాశం కూడా ఉందనుకుని బీజేపీ దీన్ని చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టుంది… చెప్పుకోదగిన ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించి ఉంటుంది కదానేది పాయింట్…
మనకు ఓ ఉదాహరణ ఉంది కదా… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశమైన కేసు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ది… జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి, భారత పౌరసత్వం పొందే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించాడని కేంద్ర హోం శాఖ గతంలోనే స్పష్టం చేసింది… 2009 నుండి ఈ వివాదం కోర్టుల్లో నలుగుతూనే ఉంది… జర్మనీ పౌరసత్వాన్ని వదులుకోలేదని, తప్పుడు పద్ధతిలో భారత పౌరసత్వం పొందాడనే విషయం తెలిసీ గతంలో బీఆర్ఎస్ టికెట్లు కూడా ఇచ్చింది… అది ఆ పార్టీ అనైతికత…
రీసెంటుగా మరో కేసు… అస్సోం… కాంగ్రెస్ సీఎం అభ్యర్థి గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్ గురించి… ఆమె బ్రిటీష్ పౌరురాలని, పైగా పాకిస్థాన్‌లోని కొన్ని ‘యాంటీ ఇండియా’ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించాడు… వాళ్ల కోసమే గొగొయ్ ద్వారా పార్లమెంటులో ప్రశ్నలు వేయిస్తుందనీ అన్నాడు… తద్వారా ఇది పౌరసత్వ వివాదమే కాదు, ‘జాతీయ భద్రత’ అంశంగా మార్చాడు… ఇప్పటికీ ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉందనీ, పాకిస్థాన్‌లో బ్యాంకు ఖాతా కూడా ఉందనీ చెబుతున్నాడు…
దీనికి కౌంటర్‌గా… హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మకు మూడు దేశాల పౌరసత్వాలు (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఆంటిగ్వా & బార్బుడా) ఉన్నాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించాడు… ఏవో ఫోర్జరీ పత్రాలు చూపించాడు… ఇప్పుడు తీవ్ర చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు… సుప్రీంకోర్టు దాకా వెళ్లింది తన బెయిల్ ఇష్యూ…
ఇవేమో తెరపై కనిపించే నేతల యవ్వారాలు… కానీ లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి వస్తూనే ఉన్నారు… అస్సోం, బెంగాల్ రాష్ట్రాల్లోకి జొరబడి, స్థానికంగా టీఎంసీ వంటి పార్టీ వర్కర్ల మద్దతుతో ఇండియా పౌరసత్వాలు పొందుతూ… పలు జిల్లాల్లో వాళ్లే మెజారిటీగా మారి, మొత్తం డెమోగ్రఫిక్ బ్యాలెన్స్‌నే తల్లకిందులు చేస్తున్నారు… వోటు బ్యాంకుగా మారి రాజకీయాలను శాసిస్తున్నారు… సరే, అదంతా ఓ పెద్ద కథ…
ఇప్పటికే మూడు బిల్లులు పార్లమెంటులో వీగిపోయి, భంగపడిన బీజేపీ రాహుల్ పౌరసత్వ వివాదాన్ని రచ్చ చేసి, ఈ ఇష్యూస్ డైవర్ట్ చేసే అవకాశముందా..? చూడాలి..!!
Share this Article