.
రాజకీయాల్లో ఊరకే పొగ కనిపించదు… ఏదో మూలం ఉంటుంది… మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలోకి పోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వినిపిస్తోంది… అక్కడక్కడా వార్తాకథనాలు కూడా కనిపిస్తున్నాయి… ఐతే ఆ కథనాల్లోని అంశాలు కొన్ని ఆసక్తికరం… వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి తన కోడలికి మల్కాజిగిరి ఎంపీ టికెట్, తనకు, కొడుక్కి, అల్లుడికి, అంటే కుటుంబానికి 5 ఎమ్మెల్యే టికెట్లు కావాలని అడుగుతున్నాడట బీజేపీ హైకమాండ్‌ను….
అది బీజేపీ, ఇలా అడగ్గానే, సరేపో, తీసుకో అనేంత సీన్ ఉండదు గానీ… మల్లారెడ్డి కోరిక వింటుంటేనే హాశ్చర్యం… తాను అడిగినట్టు టికెట్లు ఇస్తే మొత్తం మల్కాజిగిరి ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల ఖర్చంతా నేనే భరిస్తాను అంటున్నాడట… టికెట్లన్నీ నీ కుటుంబానికే ఇచ్చాక, ఇంకెవరు ఆ ఖర్చు భరిస్తారు మల్లారెడ్డి సాబ్..? అదేదే బీజేపీకే తను ఫ్రీ ఆఫర్ ప్రకటిస్తున్నట్టు మాటలు దేనికి..?
Ads
పైకి తన మాటలు గానీ… పూలమ్మిన, పాలమ్మిన, కష్టపడి ఈ స్థాయికి వచ్చిన అంటూ ఏదేదో చెబుతాడు, కామెడీ మాటలు అనిపిస్తాయి గానీ… తను తెలివైన రాజకీయ వ్యాపారి… వందల ఎకరాలు, వేల కోట్లు, తామరతంపరగా కాలేజీలు, కబ్జాలు అనే ఆరోపణలు కోకొల్లలు… వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి, రక్షణకు రాజకీయాలు… ఇన్నేళ్లూ అన్నీ తను అనుకున్నట్టే సాగాయి… కానీ..?
గతంలో ఓసారి రేవంత్ రెడ్డీ సవాల్ అని తొడగొట్టాడు కదా… తేలికగా తీసిపారేశాడు కదా, ఆ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అయ్యేసరికి మల్లారెడ్డికి వెరపు స్టార్టయింది… అబ్బే, రేవంత్ రెడ్డి మావాడే అని కవరింగు ఇస్తూ… రేవంత్ రెడ్డితో సయోధ్యకు ప్రయత్నాలు చేసినా విఫలమైంది… ఇతర నగర నాయకుల్లాగా అర్జెంటుగా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయి మళ్లీ అధికారం, రక్షణ పొందుదాం అనుకుంటే రేవంత్ రెడ్డి తలుపులు మూసేశాడు, సహజం…

నానా ప్రయత్నాలు చేశాడు, డీకే శివకుమార్ ద్వారా ఏదో దౌత్యం నడిపాడు… ఏదీ కుదరలేదు… బీఆర్ఎస్ పార్టీకి ఇక మనుగడ లేదు, అందులో ఉన్నా వేస్ట్ అనుకున్నాడేమో… పాత టీడీపీ పగ్గాలు ఇవ్వండి, ఖర్చులు భరిస్తా, టీడీపీకి మళ్లీ ప్రాణం పోస్తా అని మరోరకం ప్రయత్నాలు కూడా చేసినట్టు వార్తలు కనిపించాయి… తెలంగాణలో మళ్లీ టీడీపీకి ప్రాణమా అని జనం కూడా హాశ్చర్యపోయారు, అది వేరే సంగతి…
ఇక మిగిలింది బీజేపీ… ఎలాంటివారికైనా తీర్థం ఇచ్చి, అర్జెంటుగా పవిత్రులను చేసే మహత్తు బీజేపీలో ఉంది కదా… అనేకులు అలా పవిత్రులైన ఉదాహరణలూ ఉన్నాయి కదా… ఇక అటువైపు నరుక్కొస్తున్నాడు మల్లారెడ్డి… 5 రాష్ట్రాల ఎన్నికల బిజీలో కూడా మోడీ మల్లారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చాడంటే విశేషమే… అంటే ఏదో లోలోపల పావులు కదులుతున్నాయి అని అర్థం…

అబ్బే, మా యూనివర్శిటీ ఎఐ క్యాంపస్ ప్రారంభానికి పిలవడానికి వెళ్లామని ఆయన కోడలు ప్రీతిరెడ్డి చెబుతున్నా సరే.,. అసలు మర్మం రాజకీయాలేనని అందరికీ అర్థమవుతూనే ఉన్నాయి… మోడీని కలిసొచ్చాక స్టేట్ బీజేపీ ఆఫీసు బాధ్యులను కూడా కలిసింది… నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో కేసీయార్ కూడా మల్లారెడ్డిని ‘ఏం జరుగుతోంది’ అని నిలదీసినట్టు, చురకలు కూడా పడ్డట్టు తెలుస్తోంది… మల్లారెడ్డి సమాధానం చెప్పుకోలేక సతమతం అయ్యాడట…

సో, బీఆర్ఎస్‌లో ఉండలేడు, కాంగ్రెస్‌లోకి సీఎం రానివ్వడు, టీడీపీకి సీన్ లేదు… అందుకే జై బీజేపీ… ఈటల రాజేందర్‌ను బీజేపీలోనే వ్యతిరేకించే వర్గమేదో మల్లారెడ్డికి సహకరిస్తోందనీ, మోడీ దాకా ఆ వర్గమే తీసుకుపోయిందని గుసగుస… అవును, ఎక్కడో కాలుతున్నట్టుంది… ఈ పొగలన్నీ అవే..!! ఒక్కసారి బీజేపీలో చేరితే ‘రక్షణ’తోపాటు మెడికల్ కాలేజీల్ని దేశవ్యాప్తంగా విస్తరించే బృహత్ ప్రణాళిక ఏదో ఉందట కూడా..!!

ప్రీతిరెడ్డి మల్లారెడ్డి రెండో కోడలు… విద్యావంతురాలు… మల్లారెడ్డి విద్యావ్యాపారాన్ని ఇప్పుడు ఆమే ఆర్గనైజ్ చేసుకుంటోంది… మాటలో క్లారిటీ ఉంటుంది, మల్లారెడ్డి రాజకీయ వారసురాలు ఆమే… అవునూ, ఈ కుటుంబానికే ఓ ఎంపీ టికెట్, 5 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే…. మరి హైదరాబాద్‌లో, శివార్లలో ఎన్నో ఏళ్లుగా అనేక కష్టనష్టాలకోర్చి కాషాయజెండా మోస్తున్న వాళ్లు ఏమైపోవాలి..? భలేవారే, మోడీషా బీజేపీ అవి పట్టించుకోదుగా..!!
Share this Article