Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేతి బీరకాయలో నేయి… తమిళనాట తెలుగువారి ఆధిపత్యం…

April 29, 2026 by M S R

.

Bhavanarayana Thota …. జర్నలిస్ట్ మిత్రుడు బొల్లంరాజు చెబుతున్న చెన్నై తెలుగు వాళ్ళ కథలు చదవబోయే ముందు ఒక చిన్నమాట … తమిళ నాయకులు తెలుగువాళ్లకు చేసిందేమీ లేదు. ఆ మాటకొస్తే మన తెలుగు సంఘాలు కలిసికట్టుగా వెళ్లి అడిగిందీ లేదు. ఎవరి దుకాణం వాళ్లదే. ఒకసారి కరుణానిధి సీఎం అయ్యాక ఒక సంఘం వాళ్ళు ఆయనకు సన్మానం చేశారు. ఏవేవో కోరికలతో ఒక వినతి పత్రం ఇచ్చారు. చివర్లో ఆయన మాట్లాడుతూ ‘కరుణ’ ఎంత కావాలన్నా తీసుకోండి. కానీ ‘నిధి’ మాత్రం అడక్కండి అన్నారు. రచయితగా ఆయన చమత్కారం అర్థం చేసుకోవాలి. కానీ అందరు ముఖ్యమంత్రులదీ అదే ధోరణి.
ఇక చదవండి.



Annapragada Bollamraju …. నేతి బీరకాయలో నేయి చందంగా..
తమిళనాట తెలుగువారి ఆధిపత్యం…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అక్కడి రాజకీయాల్లో తెలుగువారి పాత్ర, వారి డామినేషన్ పై యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జనం కూడా వాటిని తెగ చూసేసి నిజమే అనుకుని ఆస్వాదిస్తున్నాను. తమిళనాడు పరిస్థితులు తెలిసిన వాడిగా నేను కొంత ఆలోచనలో పడిన మాట వాస్తవం.

Ads

నా మద్రాస్ డేస్ లో పరిచయస్తులైన గుడిమెట్ల చెన్నయ్య గారికి ఫోన్ చేసి.. అప్పటి తెలుగువారికి సంబంధించిన ఒక వివరం అడగడానికి ప్రయత్నించాను. నాకు కావాల్సిన సమాచారం అందించిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 77 ఏళ్ల గుడిమెట్ల చెన్నయ్య గారు ఈ వయసులో కూడా చెన్నై మహానగరంలో జనని సాంస్కృతిక సమితి అనే సంస్థను నడుపుతూ తెలుగు భాష, సంస్కృతిని అభివృద్ది చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

తమిళనాడులో తెలుగు నేతలు తమ వద్దకు వచ్చే తెలుగువారిని ఎలా అవమానించి పంపించేస్తారో ఆయన ఫోన్లోనే నాకు వివరిస్తూ… వైగో, కేఎన్ నెహ్రూ లాంటి వారి తీరును ఎండగట్టారు. జర్నలిస్టుగా నాకు కూడా అటువంటి అనుభవాలు ఉన్నందున ఫోన్లోనే తలూపాను అనుకోండి…

తెలుగువారు గొల్టీలట…
1980 ద్వితీయార్థం నుంచి 2000 సంవత్సరం ప్రథమార్థం వరకు నేను చెన్నై నగరంలో ఉండి… తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. అక్కడే చదువుకున్నాను. అక్కడే ఈనాడు, వార్త, తేజ న్యూస్ లో పనిచేశాను. తొలినాళ్లలో రెండు తెలుగు మాటలు వినిపిస్తే నేను అలాగే ఆగిపోయి వారితో పరిచయం పెంచుకునే వాడిని.. ఒక సందర్భంలో వింత అనుభవం ఎదురైంది.

1986 ప్రాంతంలో ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా మరో అతను వచ్చి మాట కలిపాడు. నేను యథాలాపంగా మీరు కూడా తెలుగువారే కదా అని అడిగాను. అందుకు ఆయన మేము ఇక్కడి వారమే తమిళులం.. మా పక్కింటి వాళ్లు తెలుగువారు కావడంతో నాలుగు తెలుగు మాటలు నేర్చుకున్నానని చెప్పి చల్లగా జారుకున్నాడు.

అదేమిటి అలా మాట్లాడుతున్నారని ముందునుంచి మాట్లాడుతున్న ఆయన్ను అడిగితే.. వాండు అంతదా.. వాండు కూడా గొల్టీనే అని చెప్పేసి వెళ్లిపోయాడు. తర్వాత వాకబు చేస్తే తమిళనాడులో తెలుగు వారిని అప్పట్లో గొల్టీలని పిలిచేవారట. ఇంతకీ గొల్టీ అంటే ఏమిటంటే తెలుగును తిప్పి చదివితే గొల్డీ అని సమాధానం వచ్చింది. నన్ను కూడా చాలా మంది గొల్టీ అని సరదాగా అంటుంటేవారు.

తెలుగులో అడిగితే తమిళంలో సమాధానం
తెలుగు వారు తెగ చక్రం తిప్పుతున్నట్లుగా ఇప్పుడు ఎన్నికల వేళ సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి అంత సీన్ లేదు. తెలుగు నేతలు కూడా సంపూర్ణంగా తమిళ నాయకులుగానే అక్కడ చెలామణి అవుతారు. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటూనే ఉంటారు. బయటకు వచ్చినప్పుడు మాత్రం మన లాంటి కొత్తవారు ఎవరైనా తెలుగులో పలుకరించినా తమిళంలో సమాధానమిస్తారు..

అలాంటి ఒక అనుభవం ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వై.గోపాలస్వామి (వైగో) దగ్గర నాకు ఎదురైంది. ఒక ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఆయన భార్య ఫోన్ చేశారు. ఆమెతో వైగో తెలుగులో మాట్లాడుతున్నారు. దానితో నేను ఆవేశానికి లోనై.. తెలుగులో ప్రశ్న వేశారు. అందుకు వైగో ఎంతో నింపాదిగా.. అది సరీ.. అంటూ తమిళంలో సమాధానమిచ్చారు. పక్కనున్న వారంతా అప్పుడు నన్ను అదోలా చూశారు. కమ్మవారి నాయుడు సామాజికవర్గానికి చెందిన వైగో.. ఎన్నడు తెలుగు భాష, సంస్కృతి కోసం మాట్లాడలేదు. తెలుగువారిని కలుపుకుపోలేదు. ఆయన శ్రీలంక తమిళుల కోసం మాత్రమే జైలుకు వెళ్లారు. పార్టీ పెట్టి ఏమీ సాధించలేక మళ్లీ డీఎంకే పంచన చేరి స్టాలిన్ చేతి మీదుగా రాజ్యసభ టికెట్ తీసుకున్న ఘనత వైగోకే దక్కుతుంది…

ఆర్కాట్ వీరాస్వామితో చేదు అనుభవం
వార్త దినపత్రిక పెట్టినప్పుడు తోట భావనారాయణ గారు చీఫ్ రిపోర్టర్ గానూ, నేను రిపోర్టర్ గానూ చేరాం.మొదటి ఎడిషన్లో కరుణానిధి ఇంటర్వ్యూ వేద్దామని అనుకుంటే.. అప్పాయింట్మెంట్ దొరకలేదు. సరే మంత్రి, డీఎంకే కోశాధికారి అయిన తెలుగు వారు ఆర్కాట్ వీరాస్వామి ఇంటర్వ్యూ వేద్దామని ఇద్దరం డిసైడయ్యాం.

ఉదయమే ఆర్కాట్ ఇంటి దగ్గర ఇద్దరం నిలబడ్డాము. మంత్రి గారు బయటకు వస్తున్నారు కాస్త దూరం నిల్చుని మాట్లాడండి అని ఒక సెక్యూరిటీ ఆయన తెలుగులోనే సమాధానం ఇచ్చారు. ఆర్కాట్ వీరాస్వామి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని మేము పరిచయం చేసుకుని వెళ్లిన ఉద్దేశాన్ని వివరించాం.. మేము చాలా బిజీగా ఉంటాం కదా.. ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదు అని ఆయన మా మొహానే చెప్పేశారు. ఐదు నిమిషాలైనా టైమ్ ఇవ్వండని నేను ఆయన్ను అడిగినా ఒకప్పుకోలేదు. పోనీ మీరు బిజీగా లేనప్పుడే వస్తాం టైమ్ ఇవ్వండని అడిగినా కూడా ఆయన ఒకప్పుకోలేదు. కారెక్కి వెళ్లిపోయారు.

ఉడుకు రక్తంతో నేను కాస్త ఆవేశపడిన మాట వాస్తవం. అట్లా కాదులే అబ్బా వాళ్లకు ఏదో సమస్యలు ఉంటాయని భావనారాయణ గారు నన్ను చల్లబరిచారు. అసలు ఏమిటీ పరిస్తితి అని అక్కడే పుట్టి పెరిగిన ఒక తెలుగు మూలాలున్న జర్నలిస్టును నేను అడిగితే అసలు సంగతి తెలిసింది. తమిళ అభిమానం నరనరాల్లో జీర్ణించుకుపోయిన రాష్ట్రంలో తాము తెలుగువారమని గట్టిగా చెప్పుకునేందుకు కూడా నేతలు వెనుకాడతారట. తరతరాలుగా తమిళనాడులో సెటిలైన తర్వాత ఇంకా తెలుగుతో మనకు ఎందుకులే అన్నట్లుగా ప్రవర్తిస్తారట. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం తెలుగు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించి.. ఓట్లు దండుకుని చేతులు దులుపుకుంటారట.

నిజానికి ఆర్కాట్ వీరాస్వామి కంటే కరుణానిధి బెటర్ అని ఒక సందర్భంలో నిరూపితమైంది. కళైంజర్ పుట్టిన రోజు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే.. వార్త ప్రకటనల విభాగం సిబ్బంది ఒకాయన వెళ్లి మా పేపర్ ను ఆయన చేతిలో పెట్టారు. దాన్ని కరుణానిధి చాలా సేపు చూస్తూ అన్ని పేజీలు తిరగేశారు. ఎలాగైనా సాహిత్యాభిమాని కదా…

గెంగుస్వామి నాయుడు ఫెయిల్యూర్
తమిళనాడు తెలుగు ఫెడరేషన్ చైర్మన్ అయిన పారిశ్రామిక వేత్త గెంగుస్వామి నాయుడు గురించి తెలియని తెలుగువారు ఉండరు. ఆయన తెలుగు కోసం ఎంతో కృషి చేశారు. కోయంబత్తూరు నుంచి తిరుపతి దగ్గర ఉండే తిరుత్తణి వరకు 40కి పైగా తెలుగు స్కూల్స్ పెట్టారు. కమ్మవారి నాయుడు సామాజికవర్గాన్ని దివిటీ పట్టి నడిపించిన గెంగుస్వామి నాయుడు.. దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. రాజకీయ పలుకుబడి కూడా ఉంది. ఆయన రాజకీయ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. తెలుగువారి తరపున ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా 1990ల ప్రథమార్థంలో ఆయన చెన్నై కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. తర్వాత ఏం జరిగిందో ఆ ఐడియాను వదులుకున్నారు…

పార్టీ పెట్టి మూసేసిన కామాక్షి నాయుడు
మదురై ప్రాంతానికి చెందిన కామాక్షి నాయుడు అనే పెద్దాయన కూడా తెలుగువారి కోసమంటూ ఒక పార్టీ పెట్టి 1990 చివరి అంకంలో ఒక ప్రయత్నం చేశారు. ఆయనపై నమ్మకం ఉంచి మరో పెద్దాయన చెన్నై పోష్ లొకాలటీలో ఉన్న తన భవనాన్ని ఫ్రీగా ఇచ్చారు. కొంతకాలం తర్వాత కామాక్షి నాయుడు తన పార్టీని అన్నాడీఎంకేలో కలిపేసి జయలలితకు ఒక నమస్కారం పెట్టు తప్పుకున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ద్రవిడ దేశం హరికృష్ణ లాంటి వారిని కూడా గుర్తుచేసుకోవాలి. తమిళనాడు తెలుగు యువశక్తికి చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒకప్పుడు అన్నాడీఎంకేకు, ఇప్పుడు డీఎంకేకు సపోర్టు చేస్తున్నారు…

సీఎంకే రెడ్డి అంతంత మాత్రమే
చెన్నైలో సీఎంకే రెడ్డి అనే నెల్లూరు వైద్యుడు ఒకాయన ఉన్నారు. ఆయన ఆలిండియా తెలుగు ఫెడరేషన్ పేరుతో ఒక సంస్తను నడిపారు. 1990ల్లో జనాదరణ బాగానే కనిపించింది. తర్వాత ఆయన కూడా చేతులెత్తేశారు. ఇప్పుడు బీజేపీతో జతకట్టారని చెబుతున్నారు…

ఐక్యతే సమస్య…
అన్ని పార్టీల్లో తెలుగువారున్నారు. పార్టీల్లో తెలుగు నేతల పేర్లు చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడు అంత అవుతుంది. కాకపోతే వాళ్ల వల్ల తెలుగువారికి పెద్దగా ప్రయోజనం లేదు. 15వ తరం, 16వ తరం తెలుగు వారు కూడా తెలుగు నేతల నుంచి భాషపరంగా గానీ, ఆర్థికపరంగా గానీ ఆశించినదేమీ లేదు. తెలుగు పాఠశాలలు, పాఠశాలల్లో తెలుగును ఆపేస్తే ప్రక్రియ 1990ల్లో వేగం పుంజుకున్న నేపథ్యంలో అలాంటి చర్యలను అడ్డుకునేందుకు తెలుగు నేతలెవ్వరూ ప్రయత్నించలేదు.

తమిళనాట తెలుగు భాషను కాపాడేందుకు ఏమైనా చేయొచ్చు కదా అని ఒకప్పుడు నీలగిరి ఎంపీగా ఉన్న తెలుగు పారిశ్రామికవేత్త ఆర్. ప్రభును ( ఆయన కేసీపీ సిమెంట్స్ అధినేత, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడైన వెలగపూడి లక్ష్మణ దత్తుకు మేనల్లుడని చెబుతారు) నేను ప్రశ్నిస్తే.. అవును ఏదోటి చేయాలి .. ఫలానా తెలుగు పత్రికాధిపతిలో మాట్లాడాలి అని సమాధానమిచ్చారు.

నేను అడిగిందేమిటి. ఈయన చెబుతున్నదేమిటని అనుకుని.. తర్వాత రెండు మూడు సార్లు కలిసినా కూడా నేను మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఐక్యతే తెలుగువారికి పెద్ద సమస్య అన్న సంగతి మరిచిపోకుడదు. తెలుగు మైనార్టీ అన్న సంగతిని వాళ్లు మరిచిపోయి.. తామంటా తమిళులమే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. తెలుగువారికి ఆర్థిక సాయం చేసేందుకు కూడా వాళ్లు ముందుకు రావడం లేదు…

ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో తెలుగువారు ఎవరైనా రాణించారంటే అది వారి సొంత బలం మీదేనని గుర్తించాలి. తెలుగు కార్డ్ ఆడితే ఆ రోజు ఎండ్ కార్డ్ పడుతుందని వారికి తెలుసు. ఇంకా అక్కడ తెలుగు బతికుందంటే అది వ్యక్తిగతంగా కొందరు చేస్తున్న ప్రయత్నమే అని కూడా గ్రహించాలి.. అంతే…
ఏ.బొల్లంరాజు
సీనియర్ జర్నలిస్ట్
9985422214

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే ఈవీవీ కదా… అప్పట్లోనే జబర్దస్త్ మార్క్ మూవీ తీసి వదిలాడు…
  • నేతి బీరకాయలో నేయి… తమిళనాట తెలుగువారి ఆధిపత్యం…
  • సోయి లేని సాయిపల్లవి… స్వయంకృతం, అతి తెలివి… ఎందుకంటే..?
  • ‘హాట్ స్టార్’ ఐతేనేం..? మనస్సుండదా..? ఆ కళ్లల్లో నీళ్లుండవా..?
  • ఎవడు ఈ సలీం డోలా..? డ్రగ్స్ దందాకే కాదు, ఉగ్రనిధులకూ దెబ్బ..!!
  • సర్పంచ్ సాబ్‌కు తొలి దెబ్బ… ఛోటా భీమ్ నేల మీదకు దించేశాడు…
  • దుబయ్ సొంత పెట్రో గేమ్… ఒపెక్ జట్టు నుంచి బయటికి… ప్రభావం..?
  • ఆషురెడ్డి రివర్స్ కట్నం కేసులో తెరపైకి వేణుస్వామి పేరు..!
  • ఈ వ్యవస్థలో వాళ్లకు ఏ హక్కులూ సాయాలూ అక్కర్లేదా..? అవి అస్థిపంజరాలా..?!
  • సోనియా నారంగ్… సోషల్ ప్రచారంలో నిజాలెన్ని..? అతిశయోక్తులెన్ని..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions