Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజీవ్ హంతకుడు ఇప్పుడు లాయర్ వృత్తిలోకి..! మళ్లీ ఓ చిక్కుముడి..!!

April 30, 2026 by M S R

.

పెరారివలన్… ఈయన పేరు విన్నట్టు గుర్తుందా..? రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయి… 31 ఏళ్లపాటు శిక్ష అనుభవించి, చివరకు 2022లో సుప్రీంకోర్టు ద్వారా విడుదలయ్యాడు… ‘జీవితాంతం జైలుశిక్ష’ అనుభవించే రాజీవ్ హత్య కేసు దోషులను జైలు నుంచి విడుదల చేయించడం అనేది సుదీర్ఘకాలంగా సాగిన ఓ న్యాయ పోరాటం… అక్షరబద్ధం చేస్తే అది ఓ ఉద్గ్రంథం…

రాజీవ్ గాంధీపై ఎల్‌టీటీఈ ప్రభాకరన్ ప్రయోగించిన మానవబాంబు పేలుడుకు ఈయన ఓ బ్యాటరీ సెల్ సప్లయ్ చేశాడనేది తనపైన కేసు… ప్రస్తుతం 54 ఏళ్లు… ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఈ దోషులను విడుదల చేసింది… అంటే అపెక్స్ కోర్టు తన అసాధారణమైన, అత్యున్నత అధికారాల్ని వినియోగించడం..!  ఇప్పుడు మళ్లీ ఈ పెరారివలన్ ఓ కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు… వివరాల్లోకి వెళ్తే…

Ads

జైలులోనే చదువు…: పెరారివలన్ తన జైలు శిక్షా కాలంలోనే విద్యపై దృష్టి పెట్టాడు… జైలులో ఉండగానే ప్లస్ టు, ఓపెన్ యూనివర్శిటీ ద్వారా ఎం.సి.ఏ (MCA) పూర్తి చేశాడు, ఏడు రకరకాల డిప్లొమా కోర్సులు చేశాడు… విడుదలయ్యాక లా (Law) డిగ్రీని కూడా పూర్తి చేశాడు… ఇక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్న తను తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు… ఏప్రిల్ 2026లో అధికారికంగా లాయర్‌గా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు…

అక్రమ నిర్బంధం, న్యాయం ఆలస్యం కావడం, విచారణలో ఉన్న ఖైదీల హక్కులకు సంబంధించిన కేసులపై పనిచేయాలని, తన వ్యక్తిగత అనుభవాన్ని న్యాయవాద నైపుణ్యంగా మార్చుకుంటానని చెబుతున్నాడు… ‘ఎలాంటి న్యాయ సహాయం అందక జైళ్లలో ఉన్న వేలాది మంది ఖైదీలకు గొంతుకగా మారడమే నా లక్ష్యం. ముఖ్యంగా, ముందస్తు విడుదల కోసం అంతులేకుండా ఎదురుచూస్తూ, సహాయం పొందలేని, స్తోమత లేక న్యాయం అందని నిరుపేద జీవిత ఖైదీల కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు…

అవును, తను జైలు నుంచి విడుదలయ్యాడు, లా చదువుకున్నాడు, న్యాయవాది వృత్తి తీసుకోవాలని అనుకున్నాడు… అందులో వివాదం ఏముంది..? తప్పేముంది..? కోర్టు వర్గాలు కూడా అనుమతించాయి కదా అంటారా..? కానీ..?

పెరారివలన్ లాయర్‌గా ఎన్‌రోల్ కావడాన్ని చాలామంది లాయర్లు వ్యతిరేకిస్తున్నారు… కాంగ్రెస్ ఎంపీ, అడ్వకేట్ ఆర్. సుధ ఈ ఎన్‌రోల్‌మెంట్ తక్షణం నిలిపివేయాలని కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI), తమిళనాడు బార్ కౌన్సిల్‌లతో పాటు రాష్ట్రపతికీ ఒక లేఖ రాసింది… శిక్షలకు గురైనవాళ్లు న్యాయవాద వృత్తుల్లోకి రాకుండా అడ్డుకునే అడ్వకేట్స్ యాక్ట్, 1961లోని సెక్షన్ 24A మాటేమిటని అడుగుతోంది…

పైగా పెరారివలన్ ఆర్టికల్ 142 ప్రకారం విడుదలయ్యాడే తనపై ఉన్న నేరారోపణలను కోర్టు కొట్టివేయలేదని (Acquittal కాదు) ఆమె గుర్తు చేస్తోంది… అంటే, దోషి… నిర్దోషిగా విడుదల కాలేదు అని… జైలు నుంచి విడుదల అనేది నేరాన్ని తుడిపివేయదు అంటోంది ఆమె… ఒక మాజీ ప్రధాని హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని, నైతిక  విలువలు అత్యున్నతంగా ఉండాల్సిన న్యాయవాద వృత్తిలోకి ఎలా అనుమతిస్తారు, పెరారివలన్ విషయంలో ఈ సడలింపులు ఏమిటని ఆ లేఖలో ప్రశ్నిస్తోంది ఆమె…

నో, నో, తను శిక్ష అనుభవించాడు, రాజ్యాంగబద్ధంగా విముక్తి లభించింది, ఇక నచ్చిన వృత్తిని చేసుకునే హక్కు పెరారివలన్‌కు ఎందుకు ఉండకూడదని తన మద్దతుదారులు వాదిస్తున్నారు… తనకూ కొన్ని రాజకీయ పార్టీల మద్దతు… మొత్తానికి, ఒక మాజీ ఖైదీ చట్టాన్ని అభ్యసించి, అదే చట్టం ద్వారా న్యాయం చేయాలనుకోవడం ఒక విశేషమైతే, ఆయన గతం, నైతిక విలువల ప్రాతిపదికన ఎంపీ సుధ లేవనెత్తిన ప్రశ్నలు ఈ వ్యవహారాన్ని ఒక చట్టపరమైన చిక్కుముడిగా మార్చాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తుమ్మిడిహట్టిపై రేవంత్‌రెడ్డి తెలివైన ‘ఎత్తు’గడ… బీజేపీని లాగాడు…
  • రాజీవ్ హంతకుడు ఇప్పుడు లాయర్ వృత్తిలోకి..! మళ్లీ ఓ చిక్కుముడి..!!
  • అంబానీ ఐపీఎల్ జట్టుకు ఇక సెలవు… కొత్త ఆటగాళ్లే శరణ్యం…
  • అనామకంగా ఆ భక్తిమాధుర్యం… అది అపురూప స్వరసంగమం…
  • 250 + 250 + టార్గెట్స్..? నో ప్రాబ్లం… సరదాగా కొట్టేద్దాం… ఇదేం ఆటరా బాబోయ్…
  • ఎగ్జిట్ పోల్స్ చెప్పే చేదు నిజాలు… ‘అన్‌వాంటెడ్’ కేరక్టర్ల భవిష్యత్తు..?!
  • మరపురాని కొన్ని ‘ఎన్‌కౌంటర్లు… ఓ జర్నలిస్టు జ్ఞాపకాలు…
  • కృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది ఆమె…
  • జాగ్రత్తగా, తాపీగా చదవండి… మమతా బెనర్జీ అనే ‘ద్రోహి’ గురించి…
  • “లండన్ బాబు & ది హనీ బీ… ఆర్జీవీ ఓ షార్ట్ ఫిలిమ్ తీస్తే…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions