.
కాంగ్రెస్ పార్టీతో డీఎంకే కటీఫ్… ఇండి కూటమి చెల్లాచెదురు… కాంగ్రెసోళ్ల పక్కన కూర్చోలేం, మా సీటింగ్ మార్చండి అని కనిమొళి విజ్ఞప్తి… ఇవన్నీ నమ్ముతున్నారా..? అన్నీ పైపైన వ్యవహారాలే… సింపుల్‌గా విజయ్ అసహాయతను వాడుకుని, పరిస్థితిని వెరీ ముదుర్ స్టాలిన్ తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్న అధ్యాయంలో ఇవన్నీ జస్ట్, పైపైన కనిపించేవే… ఎవరూ ఎవరినీ వీడిపోలేదు, వీడిపోరు కూడా…
స్టాలిన్ కూటమి చాలా తెలివిగా విజయ్‌ను ఒత్తిడికి గురిచేసి, తాము లేనిదే ప్రభుత్వం లేదనే పరిస్థితిలోకి నెట్టేసి… అన్నాడీఎంకేకు ఏ అవకాశమూ లేకుండా చేసి… స్టాలిన్ పన్నిన ఎత్తుగడల్లో తమిళ రాజకీయం మళ్లీ తన చెప్పుచేతల్లోకి వచ్చింది… విజయ్‌కు ముందుంది…!!
Ads
మొదటి నుంచీ గమనించండి… ఓటమి తరువాత హుందాగా మేం విజయ్ అధికారంలోకి రాకుండా అడ్డుకోం, ఆరు నెలలు వేచిచూస్తాం, ప్రజాతీర్పును గౌరవిస్తాం అన్నాడు… హబ్బ, ఎంత రాజకీయ సంస్కారం, ఎంత పరిణతి అన్నారు విశ్లేషకులు అందరూ… కానీ తెర వెనుక తను చురుకుగా పావులు కదుపుతూనే ఉన్నాడు… పరిస్థితిని అంచనా వేయడంలో సిద్ధహస్తుడు…

అన్నాడీఎంకే నుంచి కొందరు జంప్ అయిపోయి విజయ్ వైపు వెళ్లే అవకాశం ఉందని గ్రహించాడు, సంకేతాలున్నాయి… అంతేకాదు, అన్నాడీఎంకే అధికారికంగానే విజయ్ వైపు వెళ్తే… అంటే బయటి నుంచి మద్దతు లేదా ప్రభుత్వంలో భాగం… తన పని ఇరకాటం… బద్ధ ప్రత్యర్థి అన్నాడీఎంకే, బీజేపీ చేతుల్లోకి తమిళనాడు వెళ్లడం తనకు ఇష్టం లేదు… అందుకని ఓ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశాడు… తన కూటమి సభ్య పార్టీలతో..!!

ఫస్ట్, కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమి నుంచి బయటికి వచ్చి విజయ్‌కు మద్దతు ప్రకటించింది… లోలోపల స్టాలిన్ నవ్వుకున్నాడు… ఇంకోవైపు, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనే అన్నాడీఎంకే సంకేతాలను తోసిపుచ్చకుండా, అవన్నీ ఒకవైపు లైవ్‌గా ఉంచేసి… తన కూటమిలో ఉండే వీసీకే, డీఎండీకే, సీపీఐ, సీపీఎంలను ‘మీ ఇష్టం, మేం అభ్యంతరపెట్టబోం’ అన్నాడు స్వేచ్ఛనిస్తూ… అంటే, పరోక్షంగా వెళ్లండి అని చెప్పాడు… తోడుగా ఐయూఎంఎల్ కూడా..!

(ఎప్పుడూ ఏదో జాతీయ పార్టీతో అంటకాగడమే డీఎంకే అలవాటు, ఆది నుంచీ పరిశీలించండి, తటస్థంగా ఉండదు, స్వతంత్రంగానూ ఉండదు… ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ను వదలదు… కాంగ్రెస్‌తో కటీఫ్ అనేది ఓ నాటకం మాత్రమే..)

ఈ దెబ్బకు విజయ్‌కు మెజారిటీ వచ్చింది… ఈరోజు ప్రమాణస్వీకారం… అంతా సుఖాంతం… మద్దతునిచ్చిన వారికి మంత్రి పదవులు కూడా ఇస్తాడు… ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఆడాలనుకున్న గేమ్ మొత్తాన్ని స్టాలిన్ బ్రేక్ చేశాడు… వెరసి పళనిస్వామి తెల్లమొహం వేశాడు… అయితే..? (నేను ముందే చెప్పాను అని అన్నామలై తెర వెనుక పకపకా నవ్వుతున్నాడు)…

విజయ్ ప్రభుత్వం పరిస్థితి దినదినగండమే… ప్రత్యేకించి ఉదయనిధి తెర వెనుక పెత్తనం భరించడం రాను రాను విజయ్‌కు ఓ నరకం చూపిస్తుంది… స్టాలిన్ ఎలాగూ ఎమ్మెల్యే కాదు, ప్రభుత్వంలో భాగస్వామీ కాడు… కానీ ఇక రాష్ట్రంలో పార్టీని ఎక్కడికక్కడ బలోపేతం చేయాలనే వ్యూహాలు రచించి… పక్కాగా ఓ బలమైన డీఎంకెేెను పునర్నిర్మించి, తన వారసుడు ఉదయనిధి చేతుల్లో పెడతాడు…

ఇప్పటికీ బీజేపీ కోణంలో చూస్తే… అన్నామలైను తప్పించడం ఓ బ్లండర్… పళనిస్వామి ఎదుట సాగిలబడటం మరో బ్లండర్… పదే పదే గవర్నర్ నిరాకరణ ఇంకో బ్లండర్… సొంత అస్థిత్వం కోసం పోరాడి ఉండాల్సింది… మహా అయితే పోయేదేముంది..? ఇప్పుడొచ్చిన ఆ ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప..! సో వాట్… ఇప్పుడైనా ఏం సాధించినట్టు..? మళ్లీ అదే డీఎంకే చేతుల్లోకి పరోక్షంగా పెత్తనాన్ని అప్పగించడం మినహా..!!
అవునూ, విజయ్ ఒక సీటు ఖాళీ చేయకతప్పదు కదా… అక్కడ తన ఇష్టసఖి త్రిష కృష్ణన్‌ను నెలబెట్టి, గెలిపించుకుని (వీలైతే డీఎంకే సహకారం కూడా తీసుకుని) కేబినెట్‌లోకి తీసుకుంటాడా..? సంకేతాలు అలాగే ఉన్నాయి..!!
ప్చ్, త్రిష వల్లే విజయ్‌కు ఇన్ని కష్టాలు... ఐనా ఏడాదిలోపు మళ్లీ ఎన్నికలు తప్పవు అంటున్నాడు వేణుస్వామి... చూడబోతే అదే జరిగేట్టుంది... ఆ చిన్న పార్టీలు విజయ్‌ను మూణ్నాలుగు రోజులుగా ఎలా ఏడిపిస్తున్నాయో చూశాం కదా... ఈ సర్కారు తుమ్మితే ఊడిబోయే ముక్కు కావద్దనే ఆశిద్దాం...
Share this Article