.
Gottimukkala Kamalakar …. ఆయొక్క ప్రకారంగా నేను కూడా ఒక MB యూనివర్సిటీ పెట్టేసెయ్యాలని ఓ నిర్ణయానికి వచ్చేశాను.
MB అనగా మోహన్ బాబు కాదనీ; మనోభావాలు అని లెజండరీ కావల్సిన సెలబ్రిటీ గారి ఫ్యాన్సుకు విజ్ఞప్తి. అంచేత మీ మనోభావాలు దెబ్బతీసుకోవద్దని విన్నప రిక్వెస్టు..!
నా యూనివర్సిటీ లో ఓంప్రధమంగా PGDMB; BMB; MMB; PHDMB అనే నాలుగు కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నా..!
PGDMB అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మనోభావాలు అనీ; BMB అనగా బ్యాచిలర్స్ ఇన్ మనోభావాలు అనీ; MMB అనగా మాస్టర్స్ ఇన్ మనోభావాలు అనీ మరియూ PHDMB అనీ డాక్టర్స్ ఇన్ మనోభావాలు అని మనవి చేసుకుంటున్నా..!
Ads
ఓం ప్రధమంగా అక్షరదోషాలూ; అప్పుతచ్చులూ; అన్వయం లేని వాక్యాలూ; ఏకవచన సంబోధనలూ; మిక్కుటమైన బూతులు మాట్లాడుతున్న వాళ్లు PGDMB లో చేరవచ్చు.
గతంలో చెప్పుకోదగ్గ పనులేవీ లేనివాళ్లు; వర్తమానంలో భవిష్యత్తు గురించి చెప్పుకుతిరిగే పని మాత్రమే ఉన్నవాళ్లు ; భవిష్యత్తులో బతుగ్గురించి ఏం చెప్పుకోవాలో తెలియని అయోమయం ఉన్నవాళ్లు ప్రతి విషయాన్నీ తింగరిత్వంతో మాట్లాడేవాళ్లు ఈ కోర్సును అభ్యసించడానికి అర్హులు..!
PGDMB కోర్సులో చేరాలంటే రోజుకు కనీసం పది గంటలు మొబైల్ ఫోన్ లో తలదూర్చడం తప్పనిసరి. మెడ నిటారుగా ఓ నిమిషం పాటు ఉంచలేని స్థితిలో ఉండాలి. కోర్సు వ్యవధి నాలుగు నెలలు.
సెలవులు; కుటుంబం; స్నేహితులు; సోలోట్రిప్సూ ఉండవు. శాస్త్రీయ సంగీతం అంటే చిరాకు, సాహిత్యం అంటే విసుగూ ఉండాలి. ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకునే వాళ్లకి ప్రత్యేక రాయితీలు ఉంటాయి. టాయిలెట్లోకి ఫోన్ పట్టుకెళ్లే వాళ్లకి సీటు గ్యారంటీతో పాటుగా ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి.
ఈ కోర్సులో చేరిన వీళ్లకి సినిమా వాళ్ల గురించి బూతులు రాయడం; ఆడవాళ్లు హ్యుమిలియేట్ అయ్యేలా తిట్టడం; వేరే కులం హీరోలనూ, సాహిత్యకారులనూ, ప్రముఖులనూ ఏదో రకంగా విమర్శించడం; దొంగ ప్రొఫైళ్లు వాడుతూ దొరక్కుండా మేనేజ్ చేయటం వగైరాల్లో ప్రాధమిక స్థాయి నుండి మాధ్యమిక స్థాయికి చేరుకోవడం జరుగుతుంది.
ఈ స్థాయి దాటేసి PGDMB పట్టా పుచ్చుకున్నాక, అఖ్కర్లేని ఆసక్తి ఉండటం వలనా, పనికొచ్చే పనేదీ లేకపోవడం వలనా BMB కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ లాంఛనవిధివిధానాలను నాకేం పని లేకపోవడం వల్ల అతి త్వరలో ప్రకటిస్తాను..! …… to be contd… వేచి ఉండటానికీ, తరువాత జ్ఞానబోధకూ ఫీజేమీ లేదని గమనించగలరని ప్రార్థనావిజ్ఞప్తి…!! ఫేక్ పోస్టులుకూడా వచ్చే ప్రమాదముందని గమనించగలరు..!!
Share this Article