.
“మౌనమె నీ భాష ఓ మూగ మనసా…
లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు
ఊహల ఉయ్యాలవే… మాయల దెయ్యానివే!”
…… 1979లో విడుదలైన ‘గుప్పెడు మనసు’ చిత్రంలోని అద్భుతమైన పాట! ప్రఖ్యాత గేయరచయిత ఆచార్య ఆత్రేయ మనసు స్వభావాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారో… ఈ పాటలో మనిషి మనసు లేనిదాని కోసం వెంపర్లాడుతూ, చేతిలో ఉన్నదాన్ని మర్చిపోయి, ఊహల ప్రపంచంలో ఎలా కొట్టుమిట్టాడుతుందో చాలా సున్నితంగా, లోతైన అర్థంతో చెప్పాడు…. ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడు ఎస్. బాలమురళీకృష్ణ పాడాడు…
Ads
ఒక వార్త చదువుతుంటే అనుకోకుంండా అదే పాట స్ఫురించింది… ఆప్ట్ కాకపోయినా సరే..! మనిషి శరీర నిర్మాణం, మనసు, ఉద్వేగాలు అన్నీ ప్రకృతి సృష్టించిన అద్భుతమే కదా… వైద్య శాస్త్రం కూడా నివ్వెరపోయే కొన్ని అబ్బురాలు చదువుతుంటాం కదా అప్పుడప్పుడు… ఇదీ అదే… సరే, వార్తలోకి వెళ్తే…
కోమా సృష్టించిన ‘కాల్పనిక’ మాతృత్వం: వైద్య లోకాన్ని విస్మయానికి గురిచేసిన క్లేలియా కథ!
మానవ మెదడు ఒక అనంతమైన రహస్యాల గిడ్డంగి… సైన్స్ ఎంత పురోగమించినా, ఇప్పటికీ మెదడు చేసే కొన్ని విన్యాసాలకు వైద్యులే చేతులెత్తేస్తుంటారు… సాధారణంగా కోమాలోకి వెళ్లిన వారు తిరిగి స్పృహలోకి వస్తే… “నేనెక్కడున్నాను? నాకేమైంది?” అని అడుగుతుంటారు… కానీ, ఫ్రాన్స్‌కు చెందిన 19 ఏళ్ల క్లేలియా వెర్డియర్ మాత్రం కళ్లు తెరవగానే అడిగిన ప్రశ్న ఆసుపత్రి సిబ్బంది గుండెల్ని పిండేసింది, అదే సమయంలో వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది…
“ప్లీజ్, నా కుమార్తెలను తీసుకురండి… నేను వాళ్లను చూడాలి!” కోమా నుంచి లేవగానే క్లేలియా నోటి వెంట వచ్చిన మొదటి మాట ఇది…
తన ముగ్గురు కుమార్తెలైన మిలా, మైల్స్, మైలీలను చూడాలంటూ ఆమె తల్లడిల్లిపోయింది… వారికిప్పుడు ఏడేళ్లు ఉంటాయని, ఒక కుమార్తె పుట్టిన కొద్దిసేపటికే చనిపోయిందని ఆమె ఏడుస్తుంటే అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు… కానీ ఇక్కడే ఒక విచిత్రం దాగుంది… వాస్తవానికి 19 ఏళ్ల క్లేలియాకు ఇంకా పెళ్లే కాలేదు, ఇక పిల్లలెక్కడి నుంచి వస్తారు..?
అసలు ఏం జరిగింది? జూన్ 2025లో క్లేలియా అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఆమె మూడు వారాల పాటు కోమాలోకి వెళ్లిపోయింది… ఈ మూడు వారాల కాలంలోనే ఆమె మెదడు ఒక అద్భుతమైన, అత్యంత స్పష్టమైన కాల్పనిక ప్రపంచాన్ని (False Memories/Vivid Dreams) సృష్టించుకుంది…
కోమా నుంచి మేల్కొనే సమయానికి క్లేలియాకు తన పేరు గానీ, కన్నవారి వివరాలు గానీ గుర్తులేవు… కానీ… తాను ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చానని, ప్రసవ వేదన అనుభవించానని, ఏడేళ్లుగా వారిని పెంచి పెద్ద చేశానని ఆమె బలంగా నమ్మింది… ఆ జ్ఞాపకాలు ఆమె మెదడులో ఎంత బలంగా ముద్రపడిపోయాయంటే, వైద్యులు ఎంత చెప్పినా ఆమె నమ్మలేదు…
పునర్జన్మ కాదు… మెదడు ఆడిన మాయాజాలం! …. మొదట ఈ కథ వినగానే చాలామందికి ‘పునర్జన్మ’ జ్ఞాపకాలేమో అనే అనుమానం రావడం సహజం…. కానీ, వైద్యులు దీనిని పూర్తిగా భిన్నమైన కోణంలో విశ్లేషించారు…
-
కాల్పనిక ప్రపంచం…: కోమాలో ఉన్నప్పుడు రోగుల ఉపచేతన మనస్సు (Subconscious mind) తీవ్రంగా శ్రమించి, కొన్ని స్పష్టమైన వివరాలతో కూడిన కథలను, ప్రపంచాలను సృష్టిస్తుంది…
-
నిజమనిపించే భ్రమ…: సాధారణ కలల లాగా కాకుండా, ఇవి వారికి నూటికి నూరు పాళ్లు నిజమైన జీవితంలాగే అనిపిస్తాయి….
-
భావోద్వేగాల ముద్ర…: క్లేలియా మెదడు సృష్టించిన ఆ ‘ఏడేళ్ల మాతృత్వ ప్రయాణం’ ఆమెకు ఎంత నిజంగా అనిపించిందంటే, తాను తల్లిని కాదనే వాస్తవాన్ని వైద్యులు నిరూపించినప్పుడు ఆమె తీవ్రమైన మానసిక దిగ్భ్రాంతికి (Trauma) లోనైంది…
ఆ తర్వాత వైద్యుల నిరంతర కౌన్సెలింగ్‌తో ఆమె నెమ్మదిగా తన గతాన్ని, తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోగలిగింది….
ఏడాది గడిచినా వీడని ‘కలల’ నీడ …ఈ వింత ఘటన జరిగి దాదాపు ఏడాది కావొస్తోంది… క్లేలియా ఇప్పుడు శారీరకంగా పూర్తి ఆరోగ్యంగానే ఉంది, తన పాత జీవితాన్ని జీవిస్తోంది… కానీ, ఇప్పటికీ ఆమె ఆ ‘కలల జీవితం’ నుంచి పూర్తిగా బయటపడలేకపోతోంది…
“నేను ఆ పిల్లలకు జన్మనివ్వలేదని నా బుద్ధికి తెలుసు, కానీ నా హృదయం మాత్రం ఇప్పటికీ నేను ముగ్గురు బిడ్డల తల్లిని అనే చెబుతోంది… ఆ ఏడేళ్ల జీవితం, నా పిల్లల నవ్వులు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి” అని క్లేలియా ఆవేదన వ్యక్తం చేస్తోంది…
సాధారణంగా కోమా నుంచి బయటపడిన వారు గతాన్ని మర్చిపోవడం (Amnesia) చూస్తుంటాం, కానీ ఇలా లేని గతాన్ని పూర్తిగా నిజమని నమ్ముతూ, సొంత గుర్తింపును సైతం మర్చిపోవడం వైద్య చరిత్రలోనే ఒక అత్యంత అరుదైన, ఇంట్రస్టింగ్ కేస్‌గా నిలిచింది… మానవ మనస్సు ఎంత శక్తివంతమైనదో, ఎంతటి మాయాజాలం చేయగలదో చెప్పడానికి క్లేలియా ఉదంతమే ఒక సజీవ సాక్ష్యం!
Share this Article