.
Subramanyam Dogiparthi …. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఈ ఆశయం సినిమాలో తీరింది కానీ నిజ జీవితంలో తీరలేదు . ముందుముందు ఏమయినా తీరుతుందేమో చూడాలి . విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక చాలామంది సినిమా నటులకు ఆశలు చిగురిస్తూ ఉన్నాయి కదా !!
ఫుల్ రాజకీయ విమర్శ సినిమా ఇది . సినిమాలు తీసేవాళ్ళు తీస్తూనే ఉంటారు . పాటలు వ్రాసే వాళ్ళు వ్రాస్తూనే ఉంటారు . ఫేస్ బుక్కులో పోస్టులు పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు . రాజకీయులు , పోలీసులు , అధికారులు , మీడియా , తెలివయిన వారు చక్కగా ఓ అపవిత్ర కూటమిగా ఏర్పడి తమ కార్యకలాపాలను నిర్విఘ్నంగా చేసుకుంటూ పోతూనే ఉంటారు . సిగ్గు , శరం , భయం ఏం ఉండవు .
Ads
పెద్దోళ్ళు తుపాకులతో కాల్చినా , గొడ్డళ్ళతో నరికినా , హోల్సేలుగా రేపులు చేసి శిక్షలు పడి హాయిహాయిగా పెరోల్స్ మీద సర్వ సుఖాలను అనుభవిస్తున్నా , పోక్సో కేసుల్లో కూడా తమకు మనసయినప్పుడు సరెండరయినా ఈ దేశంలో ఏం కాదు .
అది ఈ సినిమా వచ్చిన 1993 అయినా ప్రస్తుత 2026 అయినా సేం టు సేం . రెండు భారతాలు . ఒక భారతం పెద్దోళ్ళది . మరో భారతం నోరు లేని బడుగు జీవులది . 90% అంగ వైకల్యం ప్రొఫెసర్ సాయిబాబా , తెనాలి ఐతానగర్ గంజాయి కుర్రాళ్ళది . ప్రొఫెసర్ గారు కనీసం నిర్దోషి అని సుప్రీంకోర్టు తేల్చింది . ఐతానగర్ కుర్రాళ్ళ మీద కేసు కూడా కోర్టుకు వచ్చినట్లు లేదు .
ఒకప్పుడు అన్యాయాన్ని అన్యాయం అని గొంతు చించుకునే వాళ్ళు . ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు . టివిలు , పత్రికలు తరిమెల నాగిరెడ్డి గారు చెప్పినట్లు తాకట్టులో ఉన్నాయి . సోషల్ మీడియా రీచ్ ని కూడా పరోక్షంగా కంట్రోల్ చేస్తున్న స్వఛ్ఛ భారతం .
1992- 94 ప్రాంతంలో ఉన్న రాజకీయ నేపధ్యంలో వచ్చిన ఈ ఆశయం సినిమాలో కుటిల రాజకీయాలు సారా/లిక్కర్ కాంట్రాక్టర్లు ఎలా మిలాఖత్ అయి దేశాన్ని దోచుకుంటారో అద్భుతంగా చూపారు . అలాగే నీతిపరులయిన ఆఫీసర్లను ఎలా లేపేస్తారో చక్కగా చూపారు
ఓ సిన్సియర్ అధికారి కూతురు వ్యవస్థకు ఎదురీది గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగి ముఠా రాజకీయాల్లోకి లాగబడి. ముందు MLA అయి , తర్వాత మంత్రి అయి , ఎవరినీ స్పేర్ చేయకుండా ఆశయం కొరకు కష్టపడి ముఖ్యమంత్రి కావటంతో సినిమా ముగుస్తుంది .
ఈ సినిమా టైంకే విజయశాంతి షీరో అయిపోయింది . ఆమె చుట్టూ సినిమాలు తీయటం మొదలయింది . ఆ క్రమంలో వచ్చిన సినిమాయే ఇది . విజయశాంతి నట విజృంభణకు మరో సినిమా ఈ ఆశయం . ఈ సినిమా కధను నేసిన పరుచూరి బ్రదర్సుకు ఉత్తమ కధగా నంది అవార్డ్ కూడా లభించింది .
స్క్రీన్ ప్లే కొంత నిరాశాజనకంగా ఉంటుంది . వెనక్కూ ముందుకూ జర్కులిస్తూ సాగుతుంది . స్క్రీన్ ప్లేని , కధను తయారు చేసిన పరుచూరి బ్రదర్స్ తూటాల్లాంటి డైలాగులను కూడా వ్రాసారు . ఆనాటి సమకాలీన రాజకీయ నాయకుల మీద చురకలు గట్టిగానే వేసారు బ్రదర్స్ .
మనేకా గాంధీ క్లాప్ కొట్టింది ఈ సినిమాకు . సినిమా అంతా విజయశాంతే డామినేట్ చేసి పడేస్తుంది . ఆమె తర్వాత గుర్తుండే పాత్రల్లో ముఖ్యమయినది పరుచూరి వెంకటేశ్వరరావుదే . Best Supporting Actor గా నంది అవార్డు కూడా పొందారు .
ఇతర ప్రధాన పాత్రల్లో జగపతిబాబు , విజయకుమార్ , చరణ్ రాజ్ , నిర్మలమ్మ , దేవన్ , సుధాకర్ , బాబూమోహన్ , శ్రీకాంత్ , హరిబాబు , వంకాయల , పి జే శర్మ తదితరులు నటించారు .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పోరాటాలే సాగించాలి న్యాయం కోసం అనే పాట బాగుంటుంది . డిస్కో శాంతి మజాగా లబ్ లబ్ రే ఒక లాలి పాట హుషారుగా ఉంటుంది .
ప్రముఖ నిర్మాత A M రత్నం ఈ సినిమాకు నిర్మాత . మోహన్ గాంధీ దర్శకుడు . అప్పుడప్పుడు టివిలో వస్తుంటుంది . యూట్యూబులో కూడా ఉంది . విజయశాంతి అభిమానులు ట్రై చేయవచ్చు .
Share this Article