Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిగ్గుపడ్డ అరవింద్ స్వామి.. నవ్వుకుని దగ్గరికి రమ్మన్న నగ్మా !

August 12, 2026 by M S R

.

Mohan Goteti …. సిగ్గుపడ్డ అరవింద్ స్వామి.. నవ్వుకున్న నగ్మా!
అప్పటికింకా దివ్యభారతి తెలుగు సినిమా ఏదీ చేయలేదు.
అయితే, ఆ అమ్మాయి మంచి అందంగా వుందని.. ఫ్రెష్ ఫేస్ అనీ ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారికి తెలిసింది.
ఫొటోలు తెప్పించుకుని చూస్తే చాలా బాగుందనిపించింది.
అంతే.. వెంటనే తాను త్వరలో సుమన్ హీరోగా తీయబోయే చిత్రానికి హీరోయిన్ గా బుక్ చేసేశారు.
అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కూడా చేసేసుకున్నారు.
ఇక్కడే కథ మలుపు తిరిగింది!

ఈ లోగా దివ్యకు తెలుగులోనే బిగ్ ఆఫర్ ఒకటి వచ్చేసింది..
అదే వెంకటేశ్ హీరోగా రామానాయుడు గారు తీస్తున్న ‘బొబ్బిలి రాజా’ సినిమా.
సరిగ్గా కాట్రగడ్డ ప్రసాద్ గారు అడిగిన డేట్సే ‘బొబ్బిలిరాజా’కు కావలసి వచ్చింది.
దాంతో దివ్యభారతి ఓ రోజు ప్రసాద్ గారి వద్దకు వచ్చి తన డేట్స్ సమస్యను చెప్పి బ్రతిమాలుతూ కూర్చుంది.
ప్రసాద్ గారు ఇరకాటంలో పడ్డారు.

Ads

“ఇలా అయితే ఎలా అమ్మాయ్?” అంటూ ఆయన నిలదీశారు.
ఎందుకంటే సరిగ్గా అదే సమయానికి ఆయన సుమన్ తో సినిమా స్టార్ట్ చేసేయాలి..
లేకపోతే ఆయన డేట్స్ పోతాయి..
అంతేకాదు, సినిమాలో కీలక పాత్రధారి మోహన్ బాబు గారి డేట్స్ కూడా బ్లాక్ చేసి ఉంచడంతో అక్కడ కూడా సమస్యే!
దానికి పరిష్కారంగా ఒక విషయం చెప్పింది దివ్యభారతి.

“ఒకమ్మాయి వుంది సార్.. తను నా బెస్ట్ ఫ్రెండ్.. హిందీలో ఒక సినిమా చేసింది. తను చాలా బాగుంటుంది.. నా ప్లేస్ లో ఆమెను పెట్టుకోవచ్చు” అంటూ ఆ అమ్మాయి ఫొటోలు చూపించింది.
ఫొటోలలో అమ్మాయి బాగానే వుంది.. ఆల్టర్నేటివ్ గా బాగానే ఉంటుందనిపించింది..
తను కూడా తెలుగుకి ఫ్రెష్ గానే ఉంటుందనిపించింది ఆయనకు.
“ఆమెకిప్పుడు తెలుగులో మంచి ఇంట్రడక్షన్ కావాలి సార్.. మీ సినిమా అయితే ఆమెకు బాగుంటుంది. ఆమె కుటుంబ పరిస్థితులను బట్టి ఆమెకు మీరు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. తద్వారా నాకు కూడా హెల్ప్ చేసినట్టే” అంది దివ్య.
ప్రసాద్ గారు కాసేపు ఆలోచించి.. సరే ఆమెను పిలిపించమన్నారు..

మర్నాడే ముంబై నుంచి వచ్చింది తను..
చూడగానే ఆకట్టుకుంది.. వెంటనే ‘ఓకే’ చెప్పారు ప్రసాద్ గారు..
తనే అందాలతార నగ్మా..!
ఆ సినిమానే ‘పెద్దింటల్లుడు’!
అలా ఆ సినిమా నుంచి దివ్యభారతి ఎగ్జిట్ అయితే.. నగ్మా వచ్చి చేరింది.

nagma

ఇంకా చెప్పాలంటే, దివ్యభారతి రికమండేషన్ తో అలా నగ్మా తెలుగు సినిమా ఛాన్సుని కొట్టేసిందన్నమాట!
1990 చివర్లో అనుకుంటాను ఈ సినిమా ముహూర్తం మద్రాసు ఏవీఎం స్టూడియోలో జరిగింది.
ఆనాటి వేడుకలోనే నగ్మాను తొలిసారిగా చూశా.
టీనేజ్ అమ్మాయి.. మంచి కలర్.. మంచి పర్సనాలిటీ.. చూడగానే ఆకట్టుకునే అందం.. త్వరలోనే బిజీ హీరోయిన్ అవుతుందనిపించింది.

ఆ వెంటనే ఆమెకు నాగార్జున గారితో ‘కిల్లర్’ పడింది.
ఇక ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారితో ‘ఘరానా మొగుడు’!
ఇంకేం.. ఒక్కసారిగా నగ్మా రేంజ్ పెరిగిపోయింది..
మెగాస్టార్ తో అవకాశం ఎప్పుడొస్తుందా? అని అప్పట్లో హీరోయిన్లు ఎదురుచూసేవారు.
ఆ అవకాశం వస్తే ఇక సదరు హీరోయిన్ రేంజ్ ఇట్టే మారిపోతుంది..
పారితోషికం కూడా అమాంతం పెరిగిపోతుంది..
టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతారు.. ‘మెగా’ ఇమేజ్ మ్యాజిక్ అలాంటిది!

లక్కీగా నగ్మాకు మెగాస్టార్ పక్కన ఆ ఛాన్స్ అలా త్వరగానే వచ్చిందని చెప్పచ్చు.
అసలే నగ్మా అందగత్తె.. దానికి తోడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్..
ఇక చూసుకోండి.. ఎంత అందంగా చూపించాలో అంత అందంగానూ చూపిస్తూ .. తెరపై ఎన్ని అందాలు ఒలకబోయాలో అన్నీ ఆమె చేత ఒలకబోయించి.. ప్రేక్షకుల ముందు కొత్త అందాన్ని ఆవిష్కరించారాయన.
ఆ సినిమా సూపర్ హిట్టవడం.. పైగా అందులో ఆమెది సత్తా వున్న క్యారెక్టర్ కూడా కావడంతో నగ్మాకు మంచి పేరు కూడా వచ్చింది.
ఇక దాంతో ఆమె ఫుల్ బిజీ..

ముంబై మోడ్రన్ అమ్మాయి కావడంతో గ్లామర్ విరజిమ్మడానికి ఏమాత్రం సంకోచించేది కాదు..
ముంబై అమ్మాయిలకు అదో పెద్ద ప్లస్ పాయింట్!
మన దర్శక నిర్మాతలకు కూడా కావలసింది అదే కదా?
అవన్నీ నగ్మాలో పుష్కలంగా వున్నాయి.. అన్నీ శుభశకునాలే!
ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా..
అందులో మోహన్ బాబు గారి సరసన హీరోయిన్.. అది కూడా సూపర్ హిట్..
అలా .. అలా.. తెలుగులో నగ్మా నిలదోక్కేసుకుంది.

ఆ తర్వాత తమిళంలో చేసిన ‘కాదలన్’ (తెలుగులో ప్రేమికుడు) ఆమెకు మరో పెద్ద హిట్..
ఆ హిట్టుతో ఒక్కసారిగా సౌత్ మొత్తానికి ఆమె గ్లామర్ క్వీన్ అయిపోయింది.
‘కిల్లర్’ షూటింగులో రెండు మూడు సార్లు కలిసినప్పటికీ ‘ఘరానా మొగుడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాల షూటింగుల్లో ఆమెతో పరిచయం బాగా పెరిగింది.
సెట్లో చాలా డిగ్నిఫైడ్ గా వుండేది.
ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు.
మాట కూడా చాలా మెల్లిగా చెవిలో మాట్లాడినట్టు మాట్లాడేది.
‘రిక్షావోడు’ సినిమాప్పటికి తెలుగు బాగా మాట్లాడేయడం నేర్చేసుకుంది.

ఎవరినీ కేర్ చేయదనీ, చాలా డిమాండ్లు చేస్తుందనీ.. చాలా ఏటిట్యూడ్ చూపిస్తుందనీ.. ఆమెపై చాలా మంది కంప్లైంట్ చేస్తారు.
అయితే, ఎన్నోసార్లు నేను షూటింగులలో ఆమెను కలిశాను .. మాట్లాడాను కానీ, ఎప్పుడూ నాకలా అనిపించలేదు.
చాలా గౌరవంగా.. మర్యాదనిస్తూ మాట్లాడేది..
తను కూడా ఎదుటి వ్యక్తి నుంచి అంతే గౌరవాన్ని కోరుకునేది.. ఆది ఆమె వ్యక్తిత్వం!
ఆమె చెన్నై, ముంబైలలో వున్నప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడేవాడిని.. ఎప్పుడూ నవ్వుతూ సరదాగానే మాట్లాడేది.

ఒకసారి ‘మౌనం’ సినిమా షూటింగు అన్నపూర్ణా స్టూడియోలో సెట్స్ లో జరుగుతుండగా ఫొటో సెషన్ పెట్టాను.
హీరో అరవింద్ స్వామి కాంబోలో ‘సితార’ కవర్ పేజీ ఫొటో కోసం ఆ సెషన్ అన్నమాట.
కొంచం ఇంటిమేట్ గా పోజులు కావాలని చెప్పాను..
నగ్మా సరేనంది..
అరవింద్ స్వామి మాత్రం తటపటాయిస్తున్నాడు..
“నగ్మాని దగ్గరకి తీసుకోండి” అంటే అరవింద్ స్వామి సంకోచిస్తున్నాడు.. ఇబ్బంది పడుతున్నాడు.
పరిస్థితి అర్థం చేసుకున్న నగ్మా నవ్వుతూ తనే చొరవ తీసుకుంది.
దగ్గరకు రమ్మంటూ చేయిచాపింది..
అరవింద్ సిగ్గుపడుతూనే ఆమెను పట్టుకున్నాడు..
అలా వారిద్దరితోనూ రకరకాల పోజులు తీశాడు మా ఫొటోగ్రాఫర్ ఆ రోజు.

అలా అరవింద్ మొదట్లో కాస్త సిగ్గుపడినా.. మొత్తానికి మంచి ఫొటోలు తీశాం.
నగ్మా ఎన్ని సినిమాలు చేసినా ఇంచుమించు అన్నీ గ్లామరస్ పాత్రలే.. హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగే సినిమాలు మాత్రం లేవు.
ఓసారి ఇంటర్వ్యూలో ఆమెను ఇదే అడిగాను..
దానికి చాలా తెలివిగా సమాధానం చెప్పింది.
“నాకూ అలాంటివి చేయాలనే వుంది. కానీ.. ఇక్కడ అలాంటి క్యారెక్టర్స్ రావు కదండీ? సినిమా అనేదే హీరో ఇమేజ్ మీద ఆధారపడి బిజినెస్ అవుతుంది. అలాంటప్పుడు హీరో మీదే కథంతా నడుస్తుంది. మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ మాతో సినిమా తీసే రిస్క్ ఎవరు చేస్తారు చెప్పండి?” అంటూ తిరిగి నన్నే ప్రశ్నించింది.

1999లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన ‘చల్ మేరే భాయ్’ హిందీ సినిమాలో గెస్ట్ పాత్ర ఒకటి చేసింది తను.
ఆ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదు వచ్చినట్టు తెలిసి ఫోన్ చేశాను.
షూటింగుకి వెళుతున్నాననీ, లొకేషన్ కి రమ్మనీ చెప్పింది.
చాలా రోజుల తర్వాత కలవడంతో చాలా విషయాలు అడిగింది.
పనిలో పనిగా మా ఈటీవీకి ఒక ఇంటర్వ్యూ అడిగాను..
తను మామూలుగా ప్రింట్ మీడియాకే ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు.. తనకు బాగా క్లోజ్ అయిన వాళ్లకు మాత్రమే ఇచ్చేది.
టీవీలకు అయితే మరీ తక్కువనే చెప్పాలి..
అలాంటిది నేను అడగగానే కాదనలేక ఇచ్చింది ..
అచ్చ తెలుగులో చాలా సేపు మాట్లాడింది.

ఇక తెలుగులో సినిమాలు తగ్గుతున్నాయనగానే హిందీతో పాటు కన్నడ, మలయాళ, బెంగాలీ, భోజ్ పురి వంటి భాషల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.
మెల్లగా సినిమాల నుంచి తప్పుకుని రాజకీయాలలోకి వెళ్లిన నగ్మా గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.
తను ఎప్పుడూ ఒకటి చెబుతుంటుంది..

“మా నాన్న హిందూ (అరవింద్ మొరార్జీ) అమ్మ ముస్లిం (సీమా).. ఇక నేను పుట్టిందేమో డిసెంబర్ 25.. అంటే క్రిస్టియన్స్ కి ఎంతటి పవిత్రమైన రోజో తెలుసు కదా.. అలా మాలోనే అన్ని మతాలూ వున్నాయి.. అందుకే నేను అందర్నీ పూజిస్తాను” అంటుంది నగ్మా నవ్వుతూ.
51 ఏళ్ల నగ్మా ఇంతవరకు వివాహబంధంలోకి అడుగుపెట్టలేదు..
ఏమో.. ఎప్పుడైనా హఠాత్తుగా చేసుకోవచ్చేమో..!
అయినా, వివాహానికి, వయసుకి సంబంధం ఏముంది?
-మోహన్ గోటేటి

nagma

…. లావైంది… సడెన్‌గా చూస్తే నగ్మా అని గుర్తుపట్టడం కష్టమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోచారం గాచారమా..? పశ్చాత్తాపమా..? ఏమైంది వీళ్లందరికీ !!
  • సిగ్గుపడ్డ అరవింద్ స్వామి.. నవ్వుకుని దగ్గరికి రమ్మన్న నగ్మా !
  • గంగూలీ సౌరభం ! దాదాగిరీ ఇక బిగ్‌బాస్‌లో ! హోస్ట్‌గా ఫస్ట్ క్రికెటర్ !!
  • ఏజ్ బార్- ఇక డ్రామాలు చాలు ! విరక్తితో త్రిష తననే తిట్టుకుంటోందా ?!
  • 19 నిమిషాలు- 33 సార్లు ఆగిన గుండె… ఓ అసాధారణ వార్త !!
  • అసలు నిజాల లెక్కలు ఇవీ ! థియేటర్‌ దందా కంప్లీట్ పిక్చర్ ఇదిగో !!
  • Balochistan – భారత్ Vs చైనా Vs అమెరికా! జియోపాలిటిక్స్ !!
  • Balochistan – ఓ కొత్త దేశం పురుడు పోసుకుంది – కానీ..?
  • వావ్… బాబు గారు ఆల్రెడీ ఎల్‌నినో సంక్షోభాన్ని దాటేశారట..!
  • మధ్యవర్తిత్వం చేసిన- ఆ జర్నలిస్టులు, లాయర్లపైనా కేసు ?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions