.
Pardha Saradhi Upadrasta … ఒడిశాలో బీజేడీ ముగింపు దశలో ఉందా? బీజేపీలో విలీనమే చివరి మార్గమా?
ఒడిశా రాజకీయాలను దాదాపు పాతికేళ్లకు పైగా శాసించిన బిజు జనతా దళ్ (బీజేడీ) ఇప్పుడు తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు నవీన్ పట్నాయక్ అంటే ఒడిశా, ఒడిశా అంటే నవీన్ పట్నాయక్ అన్న స్థాయిలో ఉన్న పార్టీ నేడు తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం నాయకత్వ సంక్షోభం. నవీన్ పట్నాయక్‌కు స్పష్టమైన రాజకీయ వారసుడు లేడు. పార్టీ మొత్తం ఒకే వ్యక్తి చుట్టూ తిరిగింది. రెండో శ్రేణి నాయకత్వాన్ని ఎప్పుడూ బలంగా ఎదగనివ్వలేదు. ఇప్పుడు నవీన్ వయస్సు పెరగడం, ఆరోగ్య పరమైన పరిమితులు కనిపించడం వల్ల “నవీన్ తర్వాత ఎవరు?” అనే ప్రశ్నకు బీజేడీ వద్ద సమాధానం లేదు.
Ads
అధికారంలో ఉన్న చివరి సంవత్సరాల్లో నవీన్ కంటే ఒక మాజీ ఐఏఎస్ అధికారి పార్టీ, ప్రభుత్వం రెండింటిపైనా ఎక్కువ ప్రభావం చూపించాడనే విమర్శలు వచ్చాయి. బీజేడీ మళ్లీ గెలిస్తే నవీన్ పేరుకే ముఖ్యమంత్రి, అసలు అధికార కేంద్రం ఆ అధికారి అయ్యాడని ఒడిశా రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తరువాత తను పార్టీలో చేరాడు, కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఈ అంశం కూడా బీజేడీ ఓటమికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2024 ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయంతో ఒడిశాలో అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో బీజేడీ లోక్‌సభలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం బీజేడీకి లోక్‌సభలో ఒక్క ఎంపీ కూడా లేరు. రాజ్యసభలో మాత్రం 5 మంది సభ్యులు ఉన్నారు.
కానీ పరిస్థితి అక్కడ కూడా స్థిరంగా లేదు. గత రెండేళ్లలో బీజేడీకి చెందిన పలువురు కీలక నేతలు, రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బీజేపీలో చేరారు. కొందరు రాజ్యసభ సభ్యులు నేరుగానే బీజేపీకి రాజీనామా చేసి బీజేపీ టికెట్లపై తిరిగి ఎన్నికయ్యారు కూడా. దీనివల్ల పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు మరింత పెరిగాయి.
ఇప్పుడు ఒడిశా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ ఏమిటంటే – బీజేడీ ఎమ్మెల్యేలలో (50) గణనీయమైన సంఖ్య , లేదా మొత్తం బీజేపీలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అనే విషయం.
ఒకవేళ అసెంబ్లీలో బీజేడీ శాసనసభాపక్షం చీలిపోతే, లేదా మొత్తం విలీనం చేస్తే మిగిలిన రాజ్యసభ సభ్యులపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిలో వారు రాజీనామా చేయడం లేదా బీజేపీకి దగ్గరవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇలా చేస్తే నవీన్ కు నితీష్ లాగానే కేంద్ర స్థాయిలో ఒక గౌరవ పదవి ద్వారా గౌరవ రాజకీయ నిష్క్రమణ కు ఉపయోగిస్తాం అని బీజేపీ చెప్పింది.
వయోభారం, అనారోగ్యం కారణంగా నవీన్ పట్నాయక్ కూడా మునుపటి వలె చురుకుగా లేడు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కూడా లేదని చెబుతారు. మహారాష్ట్రలో ఎన్సీపీ , ఉద్ధవ్ సేన, బెంగాల్ లో టిఎంసి, తమిళనాడు లో అన్నా డీఎంకే, ఇలా ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొన్న సంక్షోభాల మాదిరిగానే ఇప్పుడు బీజేడీ కూడా ఒక కీలక మలుపు వద్ద నిలిచినట్లు కనిపిస్తోంది.
పార్టీకి వారసత్వ నాయకత్వం లేకపోవడం, కేంద్ర రాజకీయాల్లో ప్రభావం తగ్గిపోవడం, వరుసగా నేతల వలసలు, అధికారాన్ని కోల్పోవడం వంటి అంశాలు బీజేడీని బలహీనపరుస్తున్నాయి.
అందుకే ఒడిశా రాజకీయాల భవిష్యత్తు గురించి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వినిపిస్తోంది:
– బీజేడీ స్వతంత్ర ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుందా?
– క్రమంగా బీజేపీలో కలిసిపోతుందా?
– కాంగ్రెస్ పునరుజ్జీవనంతో ఒడిశా రాజకీయాలు నేరుగా బీజేపీ vs కాంగ్రెస్ పోటీగా మారతాయా?
రాబోయే నాలుగేళ్లు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం… నవీన్ పట్నాయక్ తర్వాత బీజేడీకి ఎదురవుతున్న అతి పెద్ద సవాలు ఎన్నికల ఓటమి కాదు, పార్టీ మనుగడే.
ఒడిశా రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందా?
Share this Article