.
తెర వెనుక విషాదం: రంగనాథ్ మరణం.. సినిమా ఇండస్ట్రీలోని కఠిన వాస్తవం!
తెలుగు సినిమా తెరపై ఒకప్పటి ‘హీరో’, అద్భుతమైన నటుడు, మృదుస్వభావి… రంగనాథ్. ఆయన లేని లోటు ఇండస్ట్రీకి ఎప్పటికీ తీరనిది. నటుడిగా, దర్శకుడిగా ఆయన ప్రస్థానం ఒక ఎత్తు అయితే, ఆయన వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలు మరో ఎత్తు. అయితే, రంగనాథ్ మరణం తర్వాత జరిగిన ఒక ఘటన, సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అమానవీయ కోణాన్ని, మరోవైపు శివాజీ రాజా వంటి మనుషుల నిజాయితీని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఒకే మనస్తత్వం.. బలమైన అనుబంధం… శివాజీ రాజా హీరోగా నటించిన ‘మొగుడు పెళ్ళామ్స్’ సినిమాకు రంగనాథ్ దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి మొదలైన వారి స్నేహం, తండ్రీ కొడుకుల మధ్య ఉండేంత బలమైన అనుబంధంగా మారింది. రంగనాథ్ తనను ఎంతగానో ప్రేమించేవారని, “నేను శివాజీ రాజాను హీరోగా పెట్టి రెండు సినిమాలు తీయాలి” అని ఆయన పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారని శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు. కేవలం వృత్తిపరమైన గౌరవమే కాదు, వారి మధ్య ఒక ఆత్మీయమైన బంధం ఉండేది.
Ads
ఉదయ్ కిరణ్ మరణం.. ఆయనలో మొదలైన నిరాశ… రంగనాథ్ మరణం వెనుక ఉన్న ఒక చేదు నిజం.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య. ఉదయ్ కిరణ్ మరణ వార్త ఆయనను తీవ్రంగా కలచివేసింది. “ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నాకు ఒక్క ఫోన్ చేసి ఉంటే.. నేను అతన్ని ఆపగలిగేవాడిని, ప్రాణం తీసుకోకుండా మార్చగలిగేవాడిని” అని రంగనాథ్ శివాజీ రాజాతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారట. ఆ ఘటన తర్వాత రంగనాథ్ చాలా రోజులు కోలుకోలేకపోయారు.
భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఆమెకు సేవలు చేస్తూ, ఆమెకు వీల్ చైర్‌లో తోడుగా నిలిచిన రంగనాథ్ గారి గొప్ప మనసు, చివరికి ఆయన్నే ఆత్మహత్య చేసుకునేలా మార్చడం విధి చేసిన విడ్డూరం. తన ఆస్తిపాస్తులను కూడా ఇంటి పనిమనిషికి రాసిచ్చేసిన మనసు రంగనాథ్‌ది… ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులు మరీ మరీ అరుదు…
ఆ ఒక్క మాట.. శివాజీ రాజా ఆగ్రహానికి కారణం… రంగనాథ్ మరణించినప్పుడు ఆయన భౌతికకాయాన్ని అందరూ నివాళులు అర్పించేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) కార్యాలయానికి తీసుకొచ్చారు. కానీ అక్కడ జరిగిన ఘటన ఎవరూ ఊహించనిది. ఒక “పెద్ద వ్యక్తి” వచ్చి, “ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావ్? తీసేయ్” అని అడిగారు…
సహజంగానే సున్నిత మనస్కుడైన శివాజీ రాజా, ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. “చెంప పగిలిపోద్ది.. రేపు నువ్వు పోయినా ఇక్కడే పెడతారు గుర్తుపెట్టుకో” అని ఆ వ్యక్తికి మొహం మీదే చెప్పేశారాయన.
ఎందుకు అంత ఆగ్రహం? … శివాజీ రాజా చెబుతూ, “ఆ చెత్త నా కొడుక్కి ఏం తెలుసు? నాకన్నా గొప్ప నటుడు, నా కాలి గోటికి కూడా సరిపోడు ఆ వెధవ. ఎదురుగుండానే డెడ్ బాడీని పట్టుకొని ఇక్కడికెందుకు తీసుకొచ్చావ్ అంటాడా?” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాథ్ నివాసం దూరంగా ఉండటం వల్ల, సినీ పరిశ్రమలో ఆయనతో కలిసి పనిచేసిన వారు, అభిమానులు వచ్చి కడసారి చూపు చూసుకునేందుకు వీలుగానే ఆయన MAA కార్యాలయానికి తీసుకువచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో మనుషులా? లేక మనీ యంత్రాలా? … ఈ ఘటన సినీ పరిశ్రమలో ఉన్న కొందరి అమానవీయతను బయటపెట్టింది. నటుడిగా ఎంతో కష్టపడి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఒక వ్యక్తి మరణించినప్పుడు, కనీసం నివాళి అర్పించేందుకు కూడా చోటు ఇవ్వలేనంతగా మనుషులు ఎందుకు దిగజారారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
రంగనాథ్ మరణించినా, ఆయనతో ఉన్న ఆత్మీయతను, గౌరవాన్ని శివాజీ రాజా వంటి వారు కాపాడుకుంటున్నారు. కానీ, తెరపై నవ్వులు చిందించే ఇండస్ట్రీలో, తెర వెనుక ఇలాంటి కఠినమైన, చేదు, చీకటి అనుభవాలు మిగిలిపోవడం మాత్రం నిజంగా విషాదం…
Share this Article