Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కడ వేటూరి రాసింది తప్పే! అన్వయం కుదరని ఓ శబ్దగారడీ!

June 25, 2026 by M S R

.

Suresh Kolichala …. తెలుగు భాష సంస్కృతానికి చాలా దగ్గరైనదని, అందుకే తెలుగువారికి సంస్కృతం బాగానే అర్థమౌతుందని ఒక రకమైన అపోహ ఉంది. అందులో కొంత నిజం లేకపోలేదు. తెలుగు భాషలో సంస్కృత పదాల వాడకం చాలా ఎక్కువ. ఆ పదబంధాలతో ఉన్న నిరంతర పరిచయం వల్ల, సంస్కృత శ్లోకాలు వింటే అది ఏం చెబుతుందో తెలుగువాడు సులభంగానే ఊహించగలడు.

అయితే, ఈ స్థితిని దాటి, కొంతమంది కవులు, గంభీరమైన సంస్కృత పదాలు తెలుసు కాబట్టి, సంస్కృత వ్యాకరణ నియమాలతో పనేలేకుండా సునాయాసంగా దీర్ఘ సమాసాలు రాసేయవచ్చు అన్న అపోహ కూడా కవికులంలో విస్తృతంగా ప్రబలి ఉంది! ఈ అపోహకు మన ఉద్ధండ సినీకవులు కూడా అతీతులు కారు అనడానికి ఒక ప్రధాన ఉదాహరణ అత్యంత ప్రసిద్ధి చెందిన శంకరాభరణం సినిమాలోని “శంకరా! నాదశరీరా పరా” అన్న పాట.

Ads

శబ్దాలతో అద్భుతమైన మూడ్ సృష్టించి పాటను జనరంజకంగా మార్చడంలో దివంగత వేటూరి సుందరరామమూర్తి గారిది అనన్య సామాన్యమైన ప్రతిభ. కానీ, చాలాసార్లు ఆ శబ్దాల గారడీని వ్యాకరణపరంగా విప్పి చూస్తే, అన్వయం కుదరక పూర్తిగా వీగిపోతాయి.

ఈ పాటలో ఈ క్రింది పంక్తులను చూడండి:
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్రగానమిది అవధరించరా, విని తరించరా!

వినడానికి ఇది ఎంతో గొప్పగా ఉంటుంది. శివుణ్ని దీర్ఘసమాసంతో వర్ణించి, “నా గానాన్ని చిత్తగించు (అవ-ధరించు), విని తరించు” అన్న ఆ గాయకుడి దిషణాహంకారం ఇందులో ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. అయితే, తరచి చూస్తే అన్వయం ఎంతమాత్రం కుదరదు.

నిర్ణిద్ర గానం: ఇక్కడ ‘నిర్ణిద్ర’ అంటే కవి ఉద్దేశం “ఎడతెగనిది” అని కావచ్చు. కానీ, ఆ అర్థంలో సంస్కృత కావ్యాల్లో కానీ, తెలుగులో కానీ ప్రయోగాలు కనిపించవు. సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రకారం దీనికి ‘నిద్రలేనిది’, ‘జాగరూకమైనది’, ‘ముకుళితము కానిది’ లేదా ‘వికసించినది’ (పుష్పాది) అని అర్థాలు ఉన్నాయే తప్ప, ‘ఎడతెగని’ అన్న అర్థం లేదు.

రుద్రవీణ: ఈ పాట సందర్భానికి ‘రుద్రవీణ’కు కూడా ఎలాంటి సంబంధం లేదు. కేవలం క్షుద్ర- శబ్దానికి దగ్గరిగా వచ్చే లయబద్ధమైన మూడ్ సృష్టించడం కోసం రుద్ర(వీణ), నిర్ణిద్ర(గానం) అన్న పదాలను వాడేశారు. వినడానికి ఈ శబ్దాడంబరం బాగున్నా, ఇవి పెద్దగా అర్థవంతమైన సమాసాలు కావు.

ఇక అసలు వ్యాకరణ దోషానికి వద్దాం. ఇందులో మొదటి వాక్యాన్ని విశ్లేషిస్తే అసలు వ్యాకరణ దోషం స్పష్టమవుతుంది:
“దిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర సితకందరా నీలకందరా”

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాటలో ‘దిక్కరీంద్ర’ అని పాడాల్సిన చోట ‘ధిక్కరీంద్ర’ అని పాడారు. అది తన తప్పే అని ఆయన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పలుమార్లు నిజాయితీగా ఒప్పుకున్నారు. కాబట్టి ఆయన్ని క్షమించేయవచ్చు. కానీ, అన్వయమే కుదరని ఈ సంస్కృత సమాసాన్ని రాసిన వేటూరి గారిని ఏమనాలి?

దీనికి కవి ఉద్దేశించిన అర్థం: దిక్కులను మోసే కరీంద్రాలను (ఏనుగులను / వాటి తెలుపును) ఓడించేంతటి హిమగిరీంద్రపు తెల్లటి గుహ (సిత-కందరము) కలిగినవాడా, నీలకంఠుడా! (బహువ్రీహి).
కానీ, సంస్కృత వ్యాకరణం ప్రకారం ఇది నిజంగా ఆ అర్థాన్ని ఇస్తుందా?

‘జిత’ అనేది కర్మణి ప్రయోగం (Passive Voice): ‘జిత’ అనే పదం ‘జి’ (జయించుట) అనే ధాతువుకు భూతకాల కర్మణి కృదంతం. కాబట్టి, ‘జిత’ అంటే “జయించబడినది” అని అర్థం వస్తుంది తప్ప, “జయించినది” లేదా “జయించినవాడు” అని రాదు.

సంస్కృత సమాసాల్లో ‘జితేంద్రియుడు’, ‘జితక్రోధుడు’ అన్న పదాలు కనిపిస్తాయి కానీ, క్రోధజితుడు అని వాడితే అర్థం పూర్తిగా మారిపోతుంది. క్రోధజితః అంటే క్రోధేన జితః = క్రోధం చేత జయించబడినవాడు అని పూర్తిగా వ్యతిరేక అర్థం వస్తుంది.

వేటూరి చేసింది అదే తప్పు. ఇక్కడ ‘జిత-‘ అనేది కర్మణి ప్రయోగం కాబట్టి, ‘దిక్కరీంద్రజిత’ అంటే “దిక్కరీంద్రములచే ఓడింపబడిన” అని అర్థం వస్తుంది. దిక్కరీంద్రజిత అన్నది విడి సమాసంగా తీసుకొంటే, దిక్కరీంద్రములచే ఓడింపబడినవాడా అని శివుణ్ని అవమానం చేసినట్టుగా అవుతుంది. ఒకవేళ ఆ విశేషణాన్ని గుహకు ఆపాదిస్తే, “దిక్కరీంద్రములచే ఓడింపబడిన హిమగిరీంద్రము” లేదా “ఓడింపబడిన హిమగిరీంద్రపు సితకందరము (తెలుపు గుహ)” అవుతుంది.

వేటూరికి ఈ వ్యాకరణ సూక్ష్మం తెలియకపోవడం వల్ల, “దిగ్గజాలను జయించిన హిమగిరీంద్రపు గుహ” (అందులో ఉండే శివుడు) అనే అర్థం వస్తుందనుకుని ప్రయోగించేశారు. ఫలితంగా, శివుడి గుహను ప్రశంసించబోయి, అది దిగ్గజాల ముందు వీగిపోయిందని వ్యతిరేకంగా రాశారు.

బాలు గారు పాడిన ఉచ్చారణ దోషాన్ని ఎలాగైతే ఎవరూ సరిచేయలేదో, అలాగే వేటూరి గారు కర్మణి ప్రయోగాన్ని కర్తరిగా వాడి వ్యతిరేక అర్థం వచ్చేలా రాసిన ఈ సమాసాన్ని దర్శకుడు కె. విశ్వనాథ్ గారితో సహా అక్కడున్న వారెవరూ సరిచేసే సాహసం చేయలేదు.

అక్కడ కాస్తైనా సంస్కృత వ్యాకరణం తెలిసినవారు లేకపోవడమే కాక, తెలుగువారికి సంస్కృతం తెలుసునన్న అపోహ దీనికి కారణం. సంస్కృత పదజాలంతో ఉన్న పరిచయంతో, తెలుగువారు సంస్కృతంలో ఎటువంటి సమాసాలైనా చేసేయవచ్చు అనుకోడానికి ఈ పాటే అతిపెద్ద ఉదాహరణ.

ఇంతకంటే ఘోరమైన తప్పిదం వేటూరి చేసాడు. గోదావరి సినిమాలో “ఉప్పొంగెలే గోదావరి” పాటకు ముందు సంస్కృత శ్లోకంలా వినిపించే సాకీ, నా దృష్టిలో పూర్తిగా బట్లర్-సంస్కృత శ్లోకం. అది కూడా వేటూరి గారు రాసిందే. దాని గురించి వేరే పోస్టులో చెప్పుకుందాం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అక్కడ వేటూరి రాసింది తప్పే! అన్వయం కుదరని ఓ శబ్దగారడీ!
  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?
  • సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?
  • అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను – మనిషిగా కాదు, ఒక విత్తనంగా!
  • Emoji Mathematics – చాటుమాటు చాట్ మూటల మాటలు
  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి
  • తుంగభద్రపై ముగ్గురు ముఖ్యమంత్రులతో కేంద్రం కీలక భేటీ
  • బహుళ ప్రశంసల బడ్డీ మదర్ ! – ఎవరు ఈ IAS లక్ష్మీ ప్రియ?
  • పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions