Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?

June 25, 2026 by M S R

.

నిన్న ఏపీ దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లెంపలేసుకున్నాడు… సారీ చెప్పాడు… డిఫెన్స్‌లో పడిపోయాడు. ఎందుకలా గడగడా వణికిపోయాడు… ఇంత రాజకీయ అనుభవం ఉండీ ఎందుకలా చేశాడు? ఇదీ అసలు ప్రశ్న. తన మాట మీద తను నిలబడటం కూడా చేతకాదా? వీర సనాతన ధర్మపరిరక్షకుడు పరోక్ష పాలన చేస్తున్న ఏపీలో ఆనం మరీ ఇంత బోరుమనాలా?

విషయం ఏమిటంటే..? ఈ వివాదానికి అసలు కారణమేంటి అంటే…? ఏదో విలేకరుల సమావేశంలో ఎవరో అడిగారు, టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ (SRIVANI Trust) నిధులను సాయిబాబా గుళ్లకు కేటాయింపుపై…

Ads

దీనికి ఆనం సరిగ్గానే సమాధానం చెప్పాడు… పురాణాల్లో సాయిబాబా ప్రస్తావన లేదు: వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం చూస్తే.. హిందూ పురాణ గ్రంథాలలో గానీ, సనాతన ధర్మ శాస్త్రాలలో గానీ షిరిడీ సాయిబాబా ప్రస్తావన లేదని వ్యాఖ్యానించారు. సాయిబాబా భక్తులలో అన్ని మతాల వారూ ఉన్నారని ఆయన పేర్కొన్నాడు.

శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇవ్వలేం…: దేవాదాయ శాఖ వైదిక, ఆగమ శాస్త్రాల ప్రకారమే పని చేస్తుందని.. టిటిడి శ్రీవాణి ట్రస్ట్ నిధులను కేవలం సంప్రదాయ హిందూ ఆలయాల (శివుడు, విష్ణువు, అమ్మవారు మొదలైన) నిర్మాణం, సనాతన ధర్మ ప్రచారం కోసమే కేటాయిస్తామని చెప్పాడు.

ఇక్కడివరకు తను పర్‌ఫెక్ట్… నిజం, సాయిబాబా ఆగమశాస్త్రాల పరిధిలోకి రాడు, తను సనాతన హిందూ దేవుడు కాదు, కొన్నాళ్లుగా ఈ వివాదం సాయి భక్తుల్లో ప్రబలుతోంది. మరి కేవలం సనాతన ధర్మపరిరక్షణ, ధర్మప్రచారం కోసం ఉద్దేశించిన శ్రీవాణి నిధులను సాయిబాబా గుళ్లకు ఎలా ఇస్తారు?

కాకపోతే ఈ వ్యాఖ్యల వల్ల సాయిబాబాను హిందూ దేవుడిగా ప్రభుత్వం అంగీకరించడం లేదనే భావన వ్యక్తమవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు కూడా వ్యక్తమయ్యాయి.

నిజానికి లాజికల్‌గా, సాంకేతికంగా చూస్తే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. టిటిడి లేదా దేవాదాయ శాఖ పరిధిలోని శ్రీవాణి ట్రస్ట్ బైలాస్ (నిబంధనల) ప్రకారం.. ఈ నిధులు కేవలం పురాతన ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్మించే సనాతన హిందూ దేవాలయాలకు మాత్రమే ఇస్తారు. కేవలం సాయిబాబా గుడులకే కాదు.. సంతోషీమాత, కన్యకాపరమేశ్వరి (వాసవి), లేదా ఇతర గ్రామ దేవతల గుడులకు కూడా ఈ ట్రస్ట్ నిధులు కేటాయించదు. ఇది ఆ ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఉన్న స్పష్టమైన రూల్.

మరెందుకు ఉలిక్కిపడ్డాడు మంత్రి, ఎందుకు వణికిపోయాడు… చంద్రబాబు కోపగిస్తాడని బయపడ్డాడా? యాక్టింగ్ సీఎం లోకేష్‌కు కోపమొస్తుందని వణికిపోయాడా? ఒక కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు తన మాట మీద తాను నిలబడే ధైర్యం లేదా..? ఎస్, శ్రీవాణి ట్రస్టుకు డబ్బులిచ్చే దాతల ఉద్దేశం వేరు అని స్థిరంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు?

లీడర్ మాట మీద నిలబడాలి. తప్పు చేయనప్పుడు, మాట్లాడనప్పుడు కూడా స్థిరంగా, నిటారుగా నిలబడే ధైర్యం లేకపోతే లీడర్ ఎలా అవుతాడు? ఎస్, శ్రీవాణి రూల్స్ ఒప్పుకోవు అనాలి కదా… అయ్యో, అయ్యో, నన్ను అపార్థం చేసుకున్నారు, పొద్దున లేవగానే సాయిబాబాకు దండం పెడతాను, నేను సాయి భక్తుడిని, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని పొర్లుదండాలు దేనికి?

గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న సంప్రదాయ ప్రాచీన హిందూ దేవాలయాలను పునరుద్ధరించడమే శ్రీవాణి ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని, ఈ పథకం కింద సాయి ఆలయాలకు నిధులు ఇవ్వకపోవడాన్ని బాబాను అవమానించినట్లుగా చూడవద్దని కోరాడు తను. ఇంత సుదీర్ఘ వివరణ దేనికి అనేదే ప్రశ్న…

వీర సనాతన ధర్మపరిరక్షణకు జీవితాన్ని ఆది నుంచీ అంకితం చేసిన శ్రీమాన్ పవన కల్యాణుడి పాలనలో తన అనుచర అమాత్యగణం ఇంత బేలగా దేబిరించడమా..? హవ్వ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?
  • సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?
  • అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను – మనిషిగా కాదు, ఒక విత్తనంగా!
  • Emoji Mathematics – చాటుమాటు చాట్ మూటల మాటలు
  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి
  • తుంగభద్రపై ముగ్గురు ముఖ్యమంత్రులతో కేంద్రం కీలక భేటీ
  • బహుళ ప్రశంసల బడ్డీ మదర్ ! – ఎవరు ఈ IAS లక్ష్మీ ప్రియ?
  • పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?
  • ఇళయరాజాతో ఏదో తేడా కొట్టింది! వంశీ హార్మోనియం అందుకున్నాడు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions