.
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హఠాత్తుగా తుంగభద్ర నదికి సంబంధించిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్)తో పాటు ఇతర అంతర్రాష్ట్ర సాగునీటి సమస్యలపై ఈరోజు సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే… తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి రేపు (జూన్ 25న) ఒక కీలక భేటీ జరగనుండటమే. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ ఉన్నత స్థాయి భేటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, మూడు రాష్ట్రాల మధ్య నలుగుతున్న కీలకమైన అంతర్రాష్ట్ర జల వివాదాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే, రేపటి సమావేశంలో తెలంగాణ తరఫున వినిపించాల్సిన డిమాండ్లు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ ముందస్తు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Ads
జాతీయ రికార్డు సృష్టించిన తుంగభద్ర డ్యామ్ గేట్ల ఆధునీకరణ … ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి కలయిక వెనుక ఒక చారిత్రాత్మక సందర్భం ఉంది. అది నిజంగా చెప్పుకోదగిన విశేషమే. 2024 ఆగస్టు 10 అర్ధరాత్రి వేళ తుంగభద్ర డ్యామ్ 19వ నంబర్ క్రెస్ట్ గేట్ చైన్ లింక్ తెగిపోయి, వరద ఉధృతికి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తమై, సుప్రసిద్ధ జాతీయ నిపుణుడు కన్నయ్య నాయుడు బృందం పర్యవేక్షణలో తాత్కాలిక ‘స్టాప్-లాక్’ గేటును అమర్చి జలాశయం నుంచి నీరు వృథా కాకుండా కాపాడారు.
అయితే, 1953లో పూర్తయిన ఈ డ్యామ్ గేట్ల జీవితకాలం (50 ఏళ్లు) ఎప్పుడో ముగిసిపోవడంతో, నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మొత్తం 33 గేట్లను, వాటి చైన్ లైన్లను పూర్తిగా మార్చాలని సూచించింది. దాదాపు రూ. 51.8 కోట్ల బడ్జెట్‌తో అహ్మదాబాద్‌కు చెందిన ‘హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషిన్ ప్రాజెక్ట్ లిమిటెడ్’ సంస్థకు ఈ కాంట్రాక్ట్ అప్పగించగా… ఆ సంస్థ నిర్ణీత గడువు కంటే ముందే పనులను పూర్తి చేసింది. తుంగభద్ర బోర్డు నిబంధనల ప్రకారం ఈ పనుల ఖర్చును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ఉమ్మడిగా భరించాయి.
జాతీయ ఇంజనీరింగ్ రికార్డులను తిరగరాస్తూ, కేవలం ఒకే ఒక్క ఆఫ్-సీజన్ (ఆరు నెలల) వ్యవధిలోనే డ్యామ్‌కు ఉన్న మొత్తం 33 క్రెస్ట్ గేట్లను విజయవంతంగా మార్చి సరికొత్త రికార్డు సృష్టించారు. గతేడాది డిసెంబర్ 24న పాత గేట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాగా… కేవలం 123 రోజుల రికార్డు కాలంలోనే, అంటే ఈ ఏడాది ఏప్రిల్ 25 నాటికే కొత్త గేట్ల అమరిక పూర్తయింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో 105 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకునేందుకు డ్యామ్ సిద్ధమైంది.
పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవం.. ఆపై కీలక చర్చలు! … ఈ నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుక జూన్ 25న కర్ణాటకలోని కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద జరగనుంది. ఈ ఖరీఫ్‌కు ప్రాజెక్టు అన్ని రకాలుగా సిద్ధమైన నేపథ్యంలో, దీని ద్వారా సాగునీరు పొందే మూడు రాష్ట్రాల (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ముఖ్యమంత్రులను, కేంద్ర జలశక్తి మంత్రిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
అయితే, ఈ నూతన గేట్ల ప్రారంభోత్సవ వేడుక కేవలం ఒక ప్రాజెక్ట్ రీ-ఓపెనింగ్‌కు మాత్రమే పరిమితం కాబోవడం లేదు. మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రి ఒకే వేదికపైకి వస్తుండటంతో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, తుంగభద్ర జలాశయ నీటి భాగస్వామ్యం, అలాగే ఎగువన కర్ణాటక ప్రతిపాదిస్తున్న ‘నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’ ఏర్పాటు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Share this Article