.
Gottimukkala Kamalakar … చాటుమాటు చాట్ మూటల మాటలు…!
****
అటో దోసెడు, ఇటో దోసెడు నువ్వుల గింజల్ని పోసి ఓ ఫోటో లాగి “ఇవి మొత్తం ఎన్ని గింజలో చెప్పండి ఫ్రెండ్స్…!” అందో ప్రౌఢాంటీ.
“మొత్తం ఆరువేల ఏడువందల ఎనభై తొమ్మిది..! కావాలంటే లెక్కెట్టుకోండి..!” అంటూ వింకెమోజీ, లవ్వైమోజీ, చికిలింత లాఫెమోజీ పెట్టాడు అంకుల్పురుషుడు.
“ఆహా..! ఔనా..?” అంటూ ఓ బ్లష్షెమోజీ తో రిటార్టిచ్చింది ప్రౌఢాంటీ.
Ads
“కాదంటే మీరేదంటే అదే..!” అంటూ ఓ బ్రహ్మానందం వినయపు జీఅయ్యెఫ్ పెట్టాడు అంకుల్పురుషుడు.
మిమ్మల్ని లెక్క పెట్టమంటే నేనేమంటే అదే అంటారేంటీ..? అంటూ ఓ డౌటెమోజీ పెట్టింది ప్రౌఢాంటీ.
నా కళ్లు ఒఖ్క సెకన్ లోనే కావాలనుకున్నవాటిని లెక్కెట్టి పారేస్తాయండీ..! అంటూ ఓ కళ్లజోడెమోజీ పెట్టాడు అంకుల్పురుషుడు.
ఓ స్మైలైమోజీ పెట్టి ప్రౌఢాంటీ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే మెసెంజర్ ఇన్ బాక్స్ పాపిన్ అయ్యింది.
****
ప్రౌఢాంటీ మెసెంజర్ ఓపెన్ చేసింది. తను ఊహించిందే జరిగింది అక్కడ. అంకుల్పురుషుడు విరిగిపోయేంతలా చేయూపేస్తున్నాడు. ప్రౌఢాంటీ ప్రౌడ్ గా ఓ నాలుగున్నర సెకన్లు లోపల్లోపల నవ్వుకుంది. బైటికి మాత్రం లౌడ్ గా అసహనం వ్యక్తపరిచింది.
అక్కడ వాల్ మీదే కామెంట్ పెట్టొచ్చు కదండీ…? నా ఇన్ బాక్స్ లోపలికి రావడమెందుకూ…? నేనసలు మెసెంజర్ ఓపెన్ చేయను..! అంటూ ప్రౌఢాంటీ ఓ ఆంగ్రీ ఎమోజీ పెట్టింది.
అక్కడ ఓ పొరపాటు చేశానండీ..! నాకసలు లేడీస్ కి మెసేజ్ పెట్టే అలవాటే లేదు..; అందుకే ఇక్కడ వివరణ చెబుదామని వచ్చా..! అంటూ ఓ దండమెమోజీ పెట్టాడు అంకుల్పురుషుడు.
“ఏంటో చెప్పండంటూ” ప్రౌఢాంటీ ఓ క్వెశ్చన్ మార్క్ ఎమోజీ పెట్టింది.
ఆ నువ్వులు మొత్తం ఆరువేల ఏడువందల ఎనభై ఎనిమిదేనండీ..! ఇందాక ఆ కామెంట్ లో ఆరువేల ఏడువందల ఎనభై తొమ్మిది అని తప్పు చెప్పాను” అంటూ సాడెమోజీ పెట్టాడు అంకుల్పురుషుడు.
బదలుగా ఆమె ఇంకో స్మైలీ ఎమోజీ పెట్టింది.
వాడు వాడి మొబైల్ నంబర్ పెట్టాడు.
మొబైల్ నంబరెందుకండీ…? ఇక్కడ మెసెంజర్లో మాట్లాడుతున్నారుగా..! అంటూ తనకున్న జ్ఞానంతో అమాయకత్వాన్ని అభినయించింది ప్రౌఢాంటీ.
అంటే మాధమెటికల్ డౌట్సేమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటారని ఇచ్చానండీ..! అవసరమైతేనే ఫోన్ చేయండి. నేను తెలియని నంబర్ల నుండి ఫోన్లొస్తే ఆన్సర్ చేయను. మీరు కావాలనుకున్నప్పుడు ముందు మెసేజ్ పెట్టండి. తర్వాత కాల్ చేయండి..! అన్నాడా ముదురు అంకుల్పురుషుడు.
ఆ మాత్రం లెఖ్కలు మాకు రావా..? మాకు క్యాలిక్యులేటర్లు లేవా..? అంటూ బుసకొట్టే ఎమోజీ పెట్టింది ప్రౌఢాంటీ.
జీవితపు గణితం నేర్పుదామనుకున్నా.., మీకిష్టం లేకపోతే ఓకే..! అంటూ ష్రగ్గెమోజీ పెట్టాడు అంకుల్పురుషుడు.
జీవితపు గణితమేవిటీ…? అంటూ ఓ సర్ ప్రైజెమోజీ పెట్టేసింది ప్రౌఢాంటీ. మన అంకుల్పురుషుడికి లడ్డూ లాంటి ప్రైజు దొరికేసిందనుకుని మొదలెట్టాడు.
సంతోషాల సంకలనం; విషాదాల వ్యవకలనం; గుణాల గుణింతం; భావోద్వేగాల భాగహారమే జీవితం..! అంటూ బాషా గతంగతమెమోజీ పెట్టాడు.
ఇదేదో తెలుగు వ్యాకరణంలా ఉంది కానీ, గణితంలా లేదండీ..! అంటూ బుర్రగోకుడెమోజీ పెట్టింది ప్రౌఢాంటీ.
మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే ముందు మెసేజ్ చేసి కాల్ చేయండి. లేదంటే మానేయండి..! అంటూ ప్రెజర్ టాక్టిక్కెమోజీ పడేసి మెసెంజర్ ఆఫ్ చేశాడు అంకుల్పురుషుడు.
అంకుల్పురుషుడు తన ఫోను పక్కన పెట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ షుగర్ టాబ్లెట్టేసుకుని ఓ గ్లాసుడు నీళ్లు తాగుతుంటే వాట్సాప్ పాపిన్ అయ్యింది.
****
హాయ్..! అంటూ ఊహిస్తున్న అన్నోన్ నంబరు నుండి ఫోను. తనకున్న చావుతెలివితేటల్తో సన్నగా నాగభూషణం నవ్వు నవ్వుకుంటూ “హూ ఈజ్ దిస్..?” అంటూ ప్రశ్నించాడు అంకుల్పురుషుడు.
“నేనండీ..” అంటూ తన పేరు చెప్పింది ప్రౌఢాంటీ.
ఓహ్, మీరా…? ఇంత త్వరగా రెస్పాండ్ అవుతారనుకోలేదు. ఇది మీ నంబరేనా..? సేవ్ చేసుకోవచ్చా..? అంటూ జెంటిల్మెన్ ముసుగేసుకున్నాడు అంకుల్పురుషుడు.
నాదేనండీ..! నేను మీతో సోమవారం ఉదయం పదిగంటల నుండి శుక్రవారం సాయంత్రం ఐదుగంటల దాకా మాత్రమే మీతో మాట్లాడగలను..! అంటూ తన పరిమితులను వ్యక్తపరిచింది ప్రౌఢాంటీ.
ఏం..? శని, ఆదివారాలు ఎందుకు మాట్లాడరు..? అన్నాడు అంకుల్పురుషుడు.
మా ఆయనుంటారు. ఆయనకు ఈ సోషల్మీడియా స్నేహాలూ అవీ నచ్చవు..! “ఇదంతా పన్లేనివాళ్ల పని..!” అంటారాయన అంది ప్రౌఢాంటీ.
అంకుల్పురుషుడి ఆనందం ఆర్ణవమయ్యింది. వారాంతాల్లో ఫోన్ పట్టుకుంటే వారి గయ్యాళి పతివ్రత వీపు మీద వాతలు పెడుతుంది. వారందుకే ఆఫీస్లో పనికి మంగళం పాడి ఇలా పాముతుంటారు.
తరతరాలుగా, యుగయుగాలుగా స్త్రీ అణగదొక్కబడుతూనే ఉంది. ఈ మగపురుషాహంకారం నశించేదాకా స్త్రీ జాతికి విముక్తి లేదు. గుడిపాటి వెంకటాచలం నుండి నా దాకా మేమందరం మొత్తుకునేదదే..! అంటూ ఆయాసపడుతూ ఓ కేరెమోజీ పెట్టాడు అంకుల్పురుషుడు.
అందరు మగాళ్లూ మీలా అర్ధం చేసుకునేవాళ్లైతే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందండీ…! అంటూ సాడెమోజీ పెట్టింది ప్రౌఢాంటీ.
మీకు మానసిక స్వాంతన కలిగించడానికి నేనున్నాను. మీరు ఎప్పుడు ఒంటరిగా ఫీలైనా ఈ ఆత్మబంధువు ఉన్నాడన్న విషయం మరవకండి..! అంటూ భరోసా ప్రసాదిస్తూ హగ్గెమోజీ పెట్టాడు అంకుల్పురుషుడు.
థాంక్యూ అండీ..! అంటూ ఓ కళ్లల్లో లవ్వెమోజీ పెట్టింది ప్రౌఢాంటీ. #అలామొదలైంది
Share this Article