Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఉప్పొంగెలే గోదావరి- ఊగిందిలే చేలో వరి’ – వేటూరి మరో శబ్దగారడీ!

June 26, 2026 by M S R

.

Suresh Kolichala … గోదావరి సినిమాలో వేటూరి రాసిన పాటల్లో నా కిష్టమైన పాట “ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి”. గోదావరితో, భద్రాచలరామునితో తెలుగువారికున్న అనుబంధం అంతా ఒక్కపాటలో అత్యద్భుతంగా వివరించాడు.

అయితే, ఈ పాటముందు వచ్చే సాకీ సంస్కృతశ్లోకంలా వినిపిస్తుంది. ఇది కూడా ఆయన రాసిందేనని ఆయనకు సన్నిహితులైన స్నేహితుల నుండి ధ్రువీకరించుకొన్నాను. అది:

Ads

  • షడ్జమాం భవతి వేదం
    పంచమాం భవతి నాదం
    శ్రుతి శిఖరే
    నిగమఝరే
    స్వరలహరే

వినడానికి అత్యంత పవిత్రమైన పురాతన వేదమంత్రంలా, ఎంతో గంభీరంగా ధ్వనించే ఈ పంక్తులకు వేటూరి మీద పరిశోధనలు చేసి పట్టాలు పుచ్చుకొన్నవారిలో కొందరు చెప్పిన అర్థం:

  • “వేదం నుండి జన్మించినది షడ్జమం, నాదం నుండి జన్మించినది పంచమం. శ్రుతి శిఖరంలో పుట్టి నిగమ ఝరి నుండి ప్రభవించినదే ఈ స్వర లహరి.”

నిజంగా సంస్కృతంలో పై వాక్యాలు ఈ అర్థాన్నిస్తున్నాయా? “I will come yesterday” అని ఆంగ్లంలో రాస్తే, అది అర్థం కాని బట్లర్- ఇంగ్లీషు అయినట్టు, పై సాకీని వ్యాకరణపరంగా విడదీస్తే సంస్కృతంలో అడుగడుగునా అన్వయం చెప్పలేని వాక్యాలే అవుతాయి. కేవలం శబ్దాల గారడీతో తెలుగువారిని ఎలా మాయ చేయవచ్చో ఈ వాక్యాలు స్పష్టం చేస్తాయి.

1. సంస్కృతంలో ‘వేద’, ‘నాద’ అనేవి పుంలింగ పదాలు (వేదః, నాదః). వీటి పక్కన ‘భవతి’ (అవుతున్నది) అనే సంస్కృత క్రియను వాడినప్పుడు, విసర్గ సంధి నిబంధనల ప్రకారం అవి ‘వేదో భవతి’, ‘నాదో భవతి’ అని మారాలి. కానీ, తెలుగులో మనం సాధారణంగా వాడుకునే ‘వేదం’, ‘నాదం’ అనే పదాలను యథాతథంగా తీసుకుని, వాటికి ‘భవతి’ అనే సంస్కృత క్రియను తగిలించడం (వేదం భవతి) హాస్యాస్పదం. ఇదొక వింతైన తెలుగు- సంస్కృత సంకరం.

2. షడ్జమం అని తెలుగులో అంటారు, కానీ సంస్కృతంలో షడ్జ (షడ్జః) అన్నదే ప్రథమస్వరానికి పేరు.

3. తెలుగులో మనం ‘షడ్జం’ అని నపుంసకలింగంలా వాడతాము కానీ, సంస్కృతంలో సరిగమపదనిసలు (షడ్జ, ఋషభ, గాంధార..) అన్నీ పుంలింగాలు. కాబట్టి ప్రథమా విభక్తిలో దానిని ‘షడ్జః’ అని ప్రయోగించాలి.

4. ఒకవేళ ఆయన షడ్జం వేదం నుండి పుట్టింది అని చెప్పాలనుకుంటే, వేదాద్భవతి షడ్జః అని రాయాలి. లేదా, షడ్జో భవతి వేదాత్ అని రాయాలి.

5. నిజానికి, సంస్కృతంలో “పుట్టింది” అని చెప్పడానికి ‘భవతి’ కంటే ‘జాయతే’ (పుట్టుచున్నది) లేదా ‘ప్రభవతి’ (ఉద్భవిస్తున్నది) అనే క్రియలను వాడటం మరింత ప్రామాణికం. కాబట్టి, “వేదాజ్జాయతే షడ్జః” అని కానీ, “వేదాత్ ప్రభవతి షడ్జః” అనడం ఉత్తమం.

6. ఒకవేళ, “వేదం షడ్జంగా మారుతోంది” అని చెప్పాలనుకుంటే, ప్రథమా విభక్తి వాడాలి. అప్పుడు ‘షడ్జః భవతి’ అని ఉండాలి. కానీ, వినడానికి ఏదో సంస్కృత శ్లోకంలా గంభీరంగా అనిపించడం కోసం ‘షడ్జమాం’, ‘పంచమాం’ అంటూ దానికి లేనిపోని దీర్ఘాన్ని, అనవసరమైన ద్వితీయా విభక్తి (లేదా స్త్రీలింగ) రూపాన్ని తగిలించారు. సంస్కృత వ్యాకరణంలో ‘X becomes Y’ అని చెప్పడానికి ఈ ప్రయోగం పూర్తిగా విరుద్ధం.

7. ఇక చివరగా వచ్చే, “శ్రుతిశిఖరే, నిగమఝరే, స్వరలహరే” అన్నవి. “శ్రుతి శిఖరంలో పుట్టి నిగమ ఝరి నుండి ప్రభవించినదే ఈ స్వర లహరి” అన్న అర్థం అని ఆయన అభిమానులు వివరించినా ఆ అర్థం అంతగా పొసగదు. అన్నీ సప్తమీలో ఉన్నట్టు కనిపిస్తాయి: అంటే, శ్రుతిశిఖరమందు, నిగమఝరియందు, స్వరలహరియందు. కానీ, వ్యాకరణరీత్యా అవి కూడా సరికావు: శ్రుతిశిఖరే- లో శిఖరం నపుంసకం కాబట్టి, సప్తమీలో శిఖరే సరిపోతుంది.

శ్రుతి శిఖరమునందు; నిగమఝరే- అన్నప్పుడు ఝరీ- అన్నది స్త్రీలింగం అయితే, దానికి సప్తమీ ఝర్యామ్ (నదీ-కి నద్యామ్ అయినట్టుగానే). ఝరః అన్న పుంలింగశబ్దం ఉంది కాబట్టి, దాన్ని మన్నించినా, చివర లహరీ- అన్నది స్త్రీలింగమే కావాలి. అప్పుడు లహర్యామ్’ (లేదా లహరౌ) అని రాయకుండా స్వరలహరే అని రాసాడు.

ఇంకా రాయవచ్చు, ఈ గీతంలోని గీర్వాణహననం గురించి కానీ, ఇక్కడితో ఆపుతాను. చివరగా, నేను అమితంగా గౌరవించే ఒక సంస్కృత పండితునికి ఈ వాక్యాలు పంపించి ఆ సంస్కృతంలోని వ్యాకరణం గురించి వ్యాఖ్యానించమని చెప్పినప్పుడు ఆయన రాసిన సమాధానం యథాతథంగా ఇక్కడ ఉంచుతున్నాను:

  • “ఇక మీరు పేర్కొన్న పద గుంఫనము సంస్కృత భాషా నియమము ప్రకారము సరిగా లేదనిపిస్తున్నది. ఐనా వారి అభిప్రాయం ప్రకారం శ్రుతి శిఖరమునందు, నిగమ ప్రవాహమునందు , స్వర తరంగములందు షడ్జమము ( సప్త స్వరాల లోని స అనే స్వరము) వేదమౌతున్నది. పంచమనాదమౌతుంది అని మందబుద్ధియైన నాకు స్ఫురిస్తున్నది…

 

  • ఇందులో రచయితకు సంస్కృత విభక్తి జ్ఞానము లేదనేది స్పష్టము. అంతే కాక వేదము , శ్రుతి, నిగమము పదాలన్నీ ఒకే అర్థాన్నిచ్చే పర్యాయ పదాలు. ఆ పాట కూడా ఇలాగే ఏదో సంస్కృతంవలె ధ్వనించే శ్లోకం వ్రాయాలనే తపనతోనే వ్రాసిందే కాని సంస్కృత జ్ఞానమున్న వ్యక్తి వ్రాసినది కాదు.”

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేపర్ బాయ్ తలుపు తట్టిన చప్పుడు – నేనింకా బతికే ఉన్నాను…
  • మన్యం గర్భంలో మైనింగ్ మాఫియా – అల్లూరి చారిత్రక గుహలకే ఎసరు!
  • ‘ఉప్పొంగెలే గోదావరి- ఊగిందిలే చేలో వరి’ – వేటూరి మరో శబ్దగారడీ!
  • దయానాయక్ బయోపిక్! – వేలు పెట్టి వారం చెడగొట్టే రాంగోపాల్‌వర్మ!
  • Michael Jackson – రోజురోజుకీ నా పాలిటి ఓల్డ్ వైన్‌లా తయారయ్యాడు!
  • కొత్త FCRA రూల్స్ చూసి కొన్ని ఎన్జీఓలకు వణుకు- కేంద్రం కొరడా!
  • పెద్దరికానికి గౌరవం- అనుభవానికి గుర్తింపు- కావాలి, కానీ ఎలా?
  • పాస్‌పోర్టుకు అంత సీన్ లేకపోతే… కఠిన పోలీసు వెరిఫికేషన్లు దేనికి?
  • అదే జరిగితే… రేవంత్ రెడ్డి చెప్పినట్టు చరిత్రాత్మక ముందడుగే!
  • “తినేది మొగుడి సొమ్ము… పాడేది మిండెడి పాట” వీళ్లకు ఇది వర్తిస్తుందా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions