.
… మన్యం గర్భంలో మైనింగ్ మాఫియా: అల్లూరి చారిత్రక గుహలకే ఎసరు! … రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు విస్తరించి ఉన్న ఏజెన్సీ ప్రాంతం అపారమైన లాటరైట్ ఖనిజ నిక్షేపాలకు నిలయం. పైకి కేవలం ఎర్ర గులకరాళ్ల వలె కనిపించే ఈ గుట్టల గర్భంలో అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజం దాగి ఉంది. ఇక్కడి లాటరైట్‌కు ఒక ప్రత్యేకత ఉంది—దీనిని ‘మెటలర్జికల్ గ్రేడ్’ అని పిలుస్తారు. ఇందులో ఇనుముతో పాటు అల్యూమినియం ధాతువు కూడా దండిగా లభిస్తుంది.
సాధారణంగా లాటరైట్‌ను సిమెంట్ పరిశ్రమలలో క్లింకర్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తారు. అయితే, అల్యూమినియం ధాతువు ఎక్కువగా ఉన్న లాటరైట్‌ను బాక్సైట్‌గా పరిగణించి, అల్యూమినియం పరిశ్రమల్లో ముడిపదార్థంగా వాడుతుంటారు. రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలపై అధికారికంగా నిషేధం ఉన్నప్పటికీ, లాటరైట్ పేరుతో ఈ విలువైన బాక్సైట్‌ను సైతం యథేచ్ఛగా తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Ads
రంగులు మారాయి… దోపిడీ మారలేదు! ఇప్పటివరకూ ఉన్న ఆరోపణలు ఏమిటంటే? గత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ లాటరైట్ గనుల దోపిడీకి తెరలేచింది. ఎర్ర మట్టి పేరుతో గనుల లీజులు తీసుకున్న అసలైన యజమానులను భయభ్రాంతులకు గురిచేసి, బాధించి ఇక్కడి నుంచి తరిమేశారు. నాటి ఏకఛత్రాధిపత్య నేతలు లక్షల టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తరలించారు. ఆ రోజుల్లో ఈ అక్రమాలను ప్రశ్నించడానికి ఏ ఒక్క మైనింగ్ అధికారి కూడా సాహసించలేదు.
గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వంటి అగ్రనేతలు ఈ మైనింగ్ దోపిడీపై ఆవేశపూరిత ఉపన్యాసాలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అక్రమార్కుల భరతం పడతామని ప్రజలకు శపథాలు చేశారు. అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు.
నిజం చెప్పాలంటే… మాఫియా ముఠాలు కేవలం ‘బులుగు’ రంగు తొలగించి ‘పసుపు’ రంగు పూసుకున్నాయే తప్ప, వారు చేసే దుష్కార్యాలు మాత్రం యథాతథంగా సాగుతున్నాయనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏ పాత గని యజమానినీ అనుమతించడం లేదు. కొత్తగా రంగ ప్రవేశం చేసిన ‘తెలుగు నేతల ముఠా’ అన్ని గనులను దౌర్జన్యంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకుందనీ. ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపిస్తూ, సిమెంట్ కంపెనీలకు, బాక్సైట్ పరిశ్రమలకు ఖనిజాన్ని తరలిస్తూ కోట్లు గడిస్తోందనీ తాజా ఆరోపణలు.
నిబంధనలు ఉల్లంఘించిన గని… అధికార అండతో క్లియర్! ఏజెన్సీ చట్టాల ప్రకారం ఇక్కడ మైదాన ప్రాంతాల వారికి మైనింగ్ లీజులు ఇవ్వరు. కేవలం గిరిజనులకు మాత్రమే అనుమతులు ఉంటాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో ఒక గిరిజన మహిళ పేరుతో ఒక గని మంజూరైంది. స్థానికులు కొందరు అందులో తవ్వకాలు జరిపారు. అయితే, ఆ తవ్వకాలలో తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్ బృందం నివేదిక ఇవ్వడంతో, ఆ గనిపై భారీ జరిమానా విధించి తవ్వకాలను నిలిపివేశారు.
కానీ తాజాగా, ఇద్దరు ప్రముఖ ‘తెలుగు నేతలు’ కలిసి ఈ గనిని నిర్బంధంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పోలీసులను కూడా ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకరిపై ఏకంగా పోక్సో (POCSO) కేసు పెట్టి జైలుకు పంపడంతో, భయపడిపోయిన సదరు యజమానులు గనిని ఆ నేతలకు అప్పగించక తప్పలేదుట. చిత్రం ఏమిటంటే… ఈ బడా నేతల చేతుల్లోకి గని వెళ్లగానే, అప్పటివరకు ఉన్న నిషేధం తొలగిపోయింది! విజిలెన్స్ విధించిన భారీ జరిమానా కాస్తా, తూతూమంత్రపు అపరాధ రుసుముగా మారిపోవడం గమనార్హం.
విప్లవ వీరుడు ‘అల్లూరి’ గుహలకే ఎసరు … ఈ అక్రమ మైనింగ్ దోపిడీ ఎంతటి పరాకాష్టకు చేరిందంటే… సాక్షాత్తూ మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు తన పోరాటాలకు వేదికగా ఉపయోగించిన చారిత్రక గుహలను సైతం ఆనవాళ్లు లేకుండా తవ్వి పారేసే ప్రయత్నం జరుగుతోంది.
బ్రిటిష్ సైనికుల కళ్లలో పడకుండా, మన్యం వీరులను యుద్ధ సన్నద్ధం చేయడానికి అల్లూరి ఈ లాటరైట్ గుహలలోనే రహస్య సమావేశాలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. చుట్టూ దట్టమైన అడవి, ఎర్రమట్టి గుట్టల మధ్య ఉండే ఈ గుహలను కనిపెట్టడం నాడు బ్రిటిష్ సైన్యానికి కూడా సాధ్యం కాలేదు. అటువంటి చారిత్రక ప్రశస్తి కలిగిన ప్రదేశాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు, మైనింగ్ అధికారుల కళ్లు మూసుకోవడం విచారకరం. పురావస్తు శాఖకు ఫిర్యాదులు వెళ్లినా వారిలో ఎలాంటి చలనం లేదు.
-
గతాన్ని మరిచారా?…: గతంలో ఇనుప ఖనిజం కోసం అనంతపురం గుట్టల్లో ఒక గ్రామ దేవత గుడిని నాశనం చేసిన గాలి జనార్దనరెడ్డి గతి ఏమైందో ఈ నేతలకు గుర్తున్నట్లు లేదు.
-
ప్రజల సెంటిమెంట్…: అల్లూరి సీతారామరాజు అంటే ఈ ప్రాంత ప్రజలకు దేవుడితో సమానం. ఆయన జీవితం తరతరాలుగా ఇక్కడి జనాన్ని స్ఫూర్తి రగిలిస్తోంది. కానీ ప్రభుత్వానికి ప్రజల మనోభావాల కంటే, మాఫియా ముఠాల కక్కుర్తి పనులే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. జస్ట్, అధికారంలో పార్టీ మారింది, పరిస్థితులు ఏమీ మారలేదని ఈ మొత్తం కథనం సారాంశం…
( సౌజన్యం :: నెల్లూరు డోలేంద్ర ప్రసాద్ – జమీన్ రైతు పత్రిక సంపాదకుడు )
Share this Article