Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Michael Jackson – రోజురోజుకీ నా పాలిటి ఓల్డ్ వైన్‌లా తయారయ్యాడు!

June 26, 2026 by M S R

.

Gottimukkala Kamalakar …. చిరంజీవి ఎర్ర ప్లాస్టిక్ ప్యాంటూ, ఎర్ర ప్లాస్టిక్ షర్టూ, తెల్ల బెల్టూ, ఎర్ర బూట్లూ వేసేసుకుని, నల్ల కళ్లద్దాలూ పెట్టేసుకుని, బోలెడు దయ్యాలను తోడేసుకుని, తెగ మెలికలు తిరుగుతూ “గోలీమార్..!” అంటూ పాపం రాధనేడిపిస్తున్నాడు. రాధేమో భయపడి అక్కడక్కడే తిరుగుతూ పారిపోతోంది. మిగిలిన దయ్యాలు మర్యాదగా దూరందూరంగా ఉన్నా, చిరంజీవి మాత్రం రాధ మీద పడిపోతున్నాడు..!

నల్లగొండలో నటరాజ్ టాకీస్ లో #దొంగ సినిమా బెంచీ మీద కూర్చుని చూస్తున్నా..! అప్పుడప్పుడు వెనక బాల్కనీ వాళ్లవైపు “పాపం వీళ్లకు చిరంజీవి చాలా దూరంగా కనిపిస్తాడంటూ” జాలిగా చూస్తున్నా..!

Ads

తీరా ఇంటికొచ్చాక మా రూమ్ ఓనర్ కూతురుకి చిరంజీవి డాన్సు గురించి గొప్పగా చెప్పబోతే ” ఆ చిరంజీవి గాడు కాపీ కొట్టేసాడు. అవన్నీ మైఖేల్ జాక్సన్ డాన్సులు..!” అంటూ నా గాలీ, మా చిరంజీవి గాలీ ఒకేసారి తీసి పంచర్ చేసేసింది. ఆడికి మా చిరంజీవిలా ఫైటింగ్ చేయడం వచ్చా అని బ్యాలన్స్ చేశాననుకోండి. కానీ యంజే, ద కింగ్ ఆఫ్ పాప్ గురించి తెలిసింది అప్పుడే..!

నారాయణగూడా శాంతి టాకీసు చౌరాస్తాలో గ్రీటింగ్ కార్డుల షాపులో, అమితాభ్ బచ్చన్ రంగేసిన జుట్టూ, రంగేయని గడ్డం పోస్టర్ని ఆర్కీవ్స్ వాడు “బ్లాక్ ఆర్ వైట్” శీర్షికన అమ్ముకుంటున్నప్పుడు కూడా #యంజే పరిమళం చుట్టూ ఊపిరి సలపనంత గాఢంగా అల్లుకున్న గుర్తుంది.

#యంజే…! అనబడే మైఖేల్ జాక్సన్..!!
దేవుడు దయామయుడు. వాడీ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నప్పుడు పాళ్ల బేధంతో ఐనాసరే, తన అంశని కొంతమందిలో చొప్పిస్తాడు. వాళ్లు కారణజన్ములు కావడానికి, వాళ్లను నాబోటి సామాన్యులు అబ్బురంగా చూడడానికి విపరీతమైన కష్టాలను వాళ్లకు ఇచ్చి, ఆనక గొప్పోళ్లను చేస్తాడు. ఆ మనిషి రాముడైనా, కృష్ణుడైనా, క్రీస్తు ఐనా, ఛాప్లినైనా…., మైఖేల్ జాక్సన్ ఐనా…!

దేవుడు కఠినాత్ముడు. వాడు మనుషులతో ఆడించే కపటనాటకంలో భాగంగా, మనుషుల్ని తాము కేవలం మనుషులమని మరిచిపోయేలా చేస్తాడు. క్షణభంగురమైన జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించకుండా బోలెడన్ని మాయల్ని మనచుట్టూ కమ్మేస్తాడు. ఈ పాడు లోకంలో మనం శాశ్వతంగా ఉండిపోతామన్న భ్రమలో పడేస్తాడు. మన సహజమైన రంగూ రుచీ చిక్కదనాల్ని వదులుకుని పక్కదిక్కుల్ని మోహించేలా చేస్తాడు.
యంజే అంతటి వరపుత్రుడు కూడా ఆత్మన్యూనతతో బ్రతికేలా చేస్తాడు…! నూటాయాభయ్యేళ్లు ఆరోగ్యంగా జీవించాలనే పిచ్చిప్రయత్నాల పాలు చేస్తాడు..!

****
ఆ సెన్సిటివిటీ మిగతా కళాకారులకు కష్టసాధ్యం. రాయడం, బాణీ కట్టడం, ఆలపించడం, నర్తించడం అన్నీ సులభసాధ్యం చేసుకున్న వాగ్గేయనృత్యసాహిత్యకారుడు యంజే..!
ఇంటర్నెట్టు పుణ్యాన ఆ పాటలూ అవీ చదవగలగడం, డిక్షనరీ మూలాన పదాలకు అర్ధం తెలుసుకోగలగడం, సన్మిత్రుల అనుగ్రహం వల్ల భావం తెలుసుకోగలగడం, వయసు పెరుగుతుంటే నా శైలిలో విశ్లేషించుకోగలగడం వల్ల యంజే రోజురోజుకీ నా పాలిటి ఓల్డ్ వైన్ లా తయారయ్యాడు.

  • జూనియర్ ఆర్టిస్టులనీ; ప్రకృతినీ ముందుంచి తనేం భంగిమ చూపబోతున్నాడో అంటూ మనం వెర్రి నాగన్నల్లా ఊగిపోయేట్టు చేసే మాంత్రికుడు యంజే..!
    వలస కూలీలను చూస్తే “they don’t care about us” గుర్తొస్తుంది.
    జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని వింటే “black or white” మెదులుతుంది.
    మన పరిమితులు కళ్లముందర మెదిలి నిస్తేజులం అవుతుంటే “jam” జ్ఞప్తికొస్తుంది.
    మదిలో మదనుడి ప్రభావంతో ముదిత మెదిలితే “in the closet” లో నయోమీ కదులుతుంది.
    కేదారనాధ్, కేరళ, చెన్నై లో వరదలూ, అమెజాన్ అగ్నికీలలూ, పంబాదుర్గంధం, కరోనాల తలపులకొస్తే “earth” ఆర్తగీతి ఆర్తిగా హత్తుకుంటుంది.

తను స్పృశించని జీవనకోణం లేదు. మిగతా గాయకులు “wasn’t me” అంటూ కమర్షియల్ గీతాలమ్ముకున్నా, కళను మాత్రమే నమ్ముకున్న పిచ్చి పసిబాలుడు యంజే..!
SET ME FREE అంటూనే బందీ బతుకు బతికిన మిడాస్ యంజే…!
యంజేని మించిన కమ్యూనిస్టు ఎవడూ లేడు..!

****
బాంబేలో తన కచ్చేరీకి వెళ్లి కూర్చుందామనుకున్నా, ఈ బడుగు జీవిని ఆ ఖర్చు వివరం ముచ్చెమటలు పోయించి మూసుక్కూర్చునేలా చేసింది.
నో ప్రాబ్లం డియర్…,
మనం కలుస్తాంగా…! మూన్ వాక్ చేసిన నీ పాదాలనూ, ఐకానిక్ గ్లోవ్ ధరించిన నీ హస్తాలనూ, సాహిత్యాన్ని సృజించిన నీ మస్తిష్కాన్నీ, రాసిన నీ చేతులనూ ఆర్తితో స్పృశిస్తాను, చుంబిస్తాను..!
లవ్యూ ఫరెవర్ యంజే..!
నువ్వు అమరుడివి.. చిరంజీవివి.

( వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారివారి సొంతం..!
పబ్లిక్ లోకి వస్తే వారి స్పెషాలిటీకే సాహో అంటాం..!)
Gottimukkala Kamalakar

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శతాబ్దపు దోపిడీ..! ఇంగ్లండ్- అర్జెంటీనా వైరం మొదలైన వేళ !
  • Destiny – మెస్సీ ముద్దాడే ఈ పసికందు..! ఈ ఫైనల్స్‌లో తనకే ‘పోటీదారు’ !!
  • శిశువులకు బంగారు ఉంగరాలు – విజయ్ వైఖరిపై సందేహాలు !
  • పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నయ్ ! అసలు గేమ్ షురూ !!
  • ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ఏమాత్రం సరిపోదు… అంతకుమించి..!!
  • మరీ గోకకు పవన్ !! నువ్వు వేళ్లు పెడితే… రేవంత్ కాళ్లు పెడతాడు !!
  • ఒక భూమనకూ- ఒక నాయుడికీ …. ఒక జగన్‌కూ ఒక బాబుకూ తేడా ఏమున్నట్టు..?!
  • ఏడుపుగొట్టు ట్రోలర్లు… చివరకు జానకమ్మ మనమరాలినీ వదల్లేదు !!
  • వనపర్తి ఆటో భరత్‌కు బండి సంజయ్ మాత్రమే ఎందుకు గుర్తొచ్చాడు..?!
  • మినిమం పీహెచ్‌డీ చేసినా… ఈ మార్పులు అర్థం కావడం కల్ల !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions