.
Srini Journalist … యూరప్‌లో కాలుష్యం లేకపోవడమే వారికి శాపంగా మారిందా?
ప్రస్తుతం ఐరోపా ఖండం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఇప్పుడు హీట్‌వేవ్ పశ్చిమ, మధ్య యూరప్ దేశాలను నిప్పుల కొలిమిగా మార్చేసింది. జర్మనీలో రికార్డు స్థాయిలో 41.7°C ఉష్ణోగ్రత నమోదు కాగా, ఫ్రాన్స్‌లో పాదరసం 44.3°C కి చేరింది.
గడిచిన కొద్ది రోజుల్లోనే ఈ తీవ్రమైన వేడి కారణంగా యూరప్ వ్యాప్తంగా 1,350 మందికి పైగా మరణించడం, వందలాది పాఠశాలలు మూతపడటం ఆందోళన కలిగిస్తోంది.
అయితే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. భారతదేశంలో 40°C అనేది వేసవిలో అత్యంత సాధారణమైన ఉష్ణోగ్రత. 40 డిగ్రీల ఎండకు భారతీయులు పెద్దగా కంగారుపడరు, దైనందిన జీవితం ఎప్పటిలాగే సాగిపోతుంది.
Ads
కానీ, అదే 40°C ఉష్ణోగ్రతకు యూరప్ ఖండం ఎందుకు అతలాకుతలం అయిపోతోంది? ప్రపంచమే ఉడికిపోతున్నట్లు ఎందుకు అల్లాడుతోంది? దీని వెనుక ఉన్న భౌగోళిక స్థానం మరియు ‘కాలుష్యం’ అనే ఒక వింతైన లాజిక్‌ను మనం పరిశీలించాల్సి ఉంది.
1. గ్లోబల్ పొజిషన్ (భూగోళంపై ఉనికి) అడ్వాంటేజ్:
భారతదేశం భూమధ్యరేఖకు (Equator) సమీపంలో ఉండటం వల్ల ఇక్కడ పగలు- రాత్రి సమయాలు సమతుల్యంగా ఉంటాయి. సాయంత్రం త్వరగా చీకటి పడటం వల్ల వాతావరణం చల్లబడటానికి భూమికి తగినంత సమయం దొరుకుతుంది.
కానీ యూరప్ ఖండం ఉత్తర ధ్రువానికి (North) వైపుగా ఉండటం వల్ల, వేసవిలో అక్కడ పగటి కాలం సుమారు 16 నుండి 17 గంటల వరకు ఉంటుంది. సుదీర్ఘమైన పగటి సమయం కారణంగా అక్కడి భవనాలు, రోడ్లు రోజంతా వేడిని పీల్చుకుని, రాత్రి వేళల్లో కూడా ఆ వేడిని బయటకు వదులుతూ “thermal batteries” లా మారుతున్నాయి.
2. కాలుష్యం లేకపోవడం – ఒక వింతైన ప్రతికూలత?
వాతావరణ శాస్త్రం ప్రకారం.. భారతదేశంలోని గాల్లో ఉండే దుమ్ము, ధూళి కణాలు, సల్ఫేట్ ఏరోసోల్స్ (కాలుష్య కారకాలు) సూర్యుడి నుండి వచ్చే తీవ్రమైన కిరణాలను నేరుగా భూమిని తాకకుండా అడ్డుకుని, అంతరిక్షంలోకి చెల్లాచెదురు చేస్తాయి. సైన్స్ భాషలో దీనిని ‘గ్లోబల్ డిమ్మింగ్’ (Global Dimming) అంటారు. అంటే మన వాతావరణంలోని ఈ పొర సూర్యుడికి ఒక సహజమైన ‘ఫిల్టర్’ లా పనిచేస్తూ, ఎండ తీవ్రతను కొంతవరకు తగ్గిస్తుంది.
మరోవైపు, ఐరోపా దేశాలలో కాలుష్య నియంత్రణ చట్టాలు చాలా కఠినంగా ఉండటం వల్ల అక్కడి గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. అయితే, ఈ వాతావరణ స్వచ్ఛతే ఇప్పుడు వారికి శాపంగా మారుతోంది. వాతావరణంలో సూర్యకిరణాలను అడ్డుకునే ధూళి కణాలు లేకపోవడం వల్ల, సూర్యుడి వేడి ఎటువంటి ఫిల్టర్ లేకుండా “డైరెక్ట్ 4K క్వాలిటీ” లో వారి చర్మంపై పడుతోంది. దీంతో అక్కడి 40°C ఎండ సూదులతో గుచ్చినట్లు, చర్మం కాలిపోతున్నట్లు అత్యంత తీవ్రంగా అనిపిస్తోంది.
భారతదేశంలో 40 డిగ్రీల ఎండను తట్టుకునేలా ప్రజల శరీరాలు, ఇళ్ల నిర్మాణాలు (Ceiling Fans, Marble Floors) అలవాటు పడి ఉన్నాయి. కానీ, చలి వాతావరణానికి, భారీ ఇన్సులేషన్‌తో నిర్మించబడిన యూరప్ ఇళ్లలో ఏసీలు కూడా ఉండవు. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, సుదీర్ఘమైన పగటి కాలం తోడవడంతోనే యూరప్‌కు 40°C అనేది ఒక ఊహించని నరకంగా మారింది.
ప్రకృతి సమతుల్యత కాపాడుకుంటే వరం కూడా ఎలా శాపంగా (కౌంటర్ ప్రొడక్ట్) మారుతుందో చెప్పడానికి ప్రస్తుత యూరప్ వాతావరణ సంక్షోభమే ఒక స్పష్టమైన ఉదాహరణ….

( బెర్లిన్ వీథుల్లో ప్రభుత్వమే ఇలా రెయిన్ లాగా వాటర్ స్ప్రే చేస్తూ, ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను కాస్త చల్లబరుస్తోంది)
Share this Article