Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భయంతో ఆడుకున్న ఈ నియంతను ఆ ‘భయమే’ బలిగొంది!!

June 29, 2026 by M S R

.

1953 ఫిబ్రవరి 28 రాత్రి… సోవియట్ యూనియన్‌ను గుప్పిట్లో పెట్టి పాలిస్తున్న జోసెఫ్ స్టాలిన్ తన అత్యంత రహస్య నివాసం కుంట్సేవో దాచాలో సన్నిహిత రాజకీయ సహచరులతో కలిసి విందు చేశాడు… ఆ తర్వాత సినిమా చూశాడు… అర్థరాత్రి దాటాక తన గదికి వెళ్లే ముందు, “ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు” అని రక్షణ సిబ్బందికి కఠిన ఆదేశాలు ఇచ్చాడు… తలుపులు మూసుకుని లోపలికి వెళ్లిపోయాడు… తన కాళ్లపై నడుచుకుంటూ కనిపించిన స్టాలిన్‌కు అదే చివరి రాత్రి…

మరుసటిరోజు తెల్లవారింది… కానీ స్టాలిన్ గది తలుపు మాత్రం తెరుచుకోలేదు… గంటలు గడుస్తున్నాయి… మధ్యాహ్నం అయింది… సాయంత్రం కూడా దాటిపోయింది… అయినా లోపలి నుంచి ఎలాంటి కదలిక లేదు… సాధారణంగా ఇది అనుమానం కలిగించే విషయమే… కానీ అక్కడి పరిస్థితి సాధారణం కాదు… స్టాలిన్ అనుమతి లేకుండా అతని గదిలోకి అడుగుపెట్టడం అంటే దాదాపు మరణశిక్షకు సంతకం చేసినట్టే… అందుకే గార్డులు ఏమీ చేయలేక బయటే ఆందోళనగా తిరుగుతూ ఉండిపోయారు…

Ads

రాత్రి దాదాపు పది గంటలు అయ్యాక, అంటే స్టాలిన్ గదిలోకి వెళ్లి దాదాపు 18 గంటలు గడిచిన తర్వాత, ఒక గార్డు ధైర్యం చేసి వెళ్లాడు… అదీ ఓ అధికారిక పోస్టు ఇవ్వాలనే కారణంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడిని షాక్‌కు గురి చేసింది.

73 ఏళ్ల స్టాలిన్ నేలపై పడిపోయి ఉన్నాడు… పైజామా, అండర్‌షర్ట్‌తోనే మూత్రంలో తడిసి పడి ఉన్నాడు… అతనికి తీవ్రమైన మెదడులో రక్తస్రావం (సెరిబ్రల్ స్ట్రోక్) వచ్చింది… శరీరం కుడి భాగం పూర్తిగా పనిచేయడం మానేసింది… మాట్లాడాలని ప్రయత్నించినా నోటి నుంచి అర్థం కాని మూలుగులు మాత్రమే వినిపించాయి…

ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా వెంటనే డాక్టర్లకు ఫోన్ చేస్తారు… కానీ స్టాలిన్ పాలనలో అది అంత సులభం కాదు…

గార్డులు ముందుగా దేశ అత్యున్నత నాయకత్వానికి సమాచారం ఇచ్చారు… కొద్దిసేపటికి రహస్య పోలీసు అధిపతి లావ్రెంటీ బెరియా, జార్జీ మాలెన్‌కోవ్ అక్కడికి చేరుకున్నారు… అయితే వారు డాక్టర్లను పిలవలేదు… “స్టాలిన్ మద్యం ఎక్కువై నిద్రపోతున్నాడు… ఎవరూ అతన్ని కదపొద్దు” అని బెరియా చెప్పడంతో అందరూ మౌనంగా నిలబడ్డారు… ఆ నిర్ణయం స్టాలిన్ ప్రాణాల మీద పడింది…

మరో పన్నెండు గంటల పాటు అతను ఎలాంటి వైద్య సహాయం లేకుండా అలాగే పడి ఉన్నాడు… ఇదే సమయంలో అతని చుట్టూ ఉన్న నాయకులు, అతను చనిపోతే తర్వాత అధికారాన్ని ఎలా పంచుకోవాలనే రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారని చరిత్రకారులు చెబుతారు…

చివరకు మరుసటి రోజు ఉదయం డాక్టర్లను పిలిపించారు… కానీ వాళ్ల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది… స్టాలిన్‌ను తాకడానికే వారు భయపడిపోయారు… ఎందుకంటే కొద్ది రోజుల ముందే “డాక్టర్స్ ప్లాట్” పేరుతో దేశంలోని ప్రముఖ వైద్యులను దేశద్రోహులంటూ అరెస్టు చేయించింది కూడా స్టాలినే… అందువల్ల అక్కడ మిగిలింది అనుభవం తక్కువ ఉన్న యువ వైద్యులే… ఒకవేళ స్టాలిన్ బతికి బయటపడి, చికిత్స నచ్చలేదని భావిస్తే తమ ప్రాణాలే పోతాయనే భయం వారిని వెంటాడుతోంది…

ఆ తర్వాత మూడు రోజుల పాటు స్టాలిన్ జీవితం- మరణం మధ్య పోరాడాడు… కొన్నిసార్లు కళ్లు తెరిచాడు… మళ్లీ స్పృహ కోల్పోయాడు… చివరికి అతని కుమార్తె స్వెత్లానా అల్లిలుయేవాను పిలిపించారు…

తన జ్ఞాపకాల పుస్తకంలో స్వెత్లానా ఒక భయానక దృశ్యాన్ని వివరించింది… 1953 మార్చి 5న చివరి క్షణాల్లో ఒక్కసారిగా స్టాలిన్ కళ్లు పెద్దవిగా తెరుచుకున్నాయి… గదిలో ఉన్న వారందరి వైపు అతను తీక్షణంగా చూశాడు… ఆ తర్వాత ఎడమ చేతిని పైకెత్తి, ఎవరికీ అర్థం కాని ఒక చివరి సైగ చేశాడు… కొన్ని క్షణాలకే అతని శ్వాస ఆగిపోయింది…

ప్రపంచాన్ని భయపెట్టి పాలించిన ఒక నియంత… చివరికి తన చుట్టూ ఉన్నవాళ్ల భయమే కారణంగా, గంటల తరబడి వైద్య సహాయం లేక ఒంటరిగా చనిపోవడం చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కథల్లో మిగిలిపోయింది…!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇడుపు కాయితం! రచ్చ లేపుతున్న టైటిల్ కొత్తదేమీ కాదు – పాతదే!
  • భయంతో ఆడుకున్న ఈ నియంతను ఆ ‘భయమే’ బలిగొంది!!
  • ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’… తడి తడిమే వేటూరి ఆర్తగీతిక !
  • అనామక ఐర్లాండ్ క్రికెట్ జట్టు మన తోపులకు నేర్పిన పాఠాలేమిటంటే.?
  • సాయిబాబా వివాదం నేపథ్యంలో గుర్తుకొస్తున్న ఓ పాత సినిమా పాట!
  • ఒకే రోజు ఇండియన్ క్రికెట్‌కు రెండు అవమానకర పరాభవాలు!!
  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • ఇడుపు కాయితం! తెలంగాణ సెంటిమెంట్ రాజేసే పొలిటికల్ కుట్రలు!?
  • ముఖ్యమంత్రి సినిమా నిర్మాత… ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అయిపోయాడు!
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ – ఒక థ్రిల్లింగ్ ‘మెగా’ సీరియల్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions