.
Srini Journalist …. నోటితో విద్వేషాలు చల్లడం ‘రావణ మైండ్ సెట్’.. చేతలతో లోకాన్ని కాపాడడం ‘భారతీయ సంకల్పం’ … ఆపరేషన్ అమిస్తాద్… బహుశా ఈ పేరును చాలా కొద్దిమంది మాత్రమే విని ఉంటారు!
ఎందుకంటే, మన దేశంలో ప్రతిరోజూ ప్రజలు సోషల్ మీడియాలో కేటాయించే మొత్తం సమయాన్ని 100 శాతంగా తీసుకుంటే… అందులో దాదాపు 45% సమయం రాజకీయ విమర్శల కి, మరో 30% సమయం మతపరమైన వివాదాలు, విద్వేషపూరితమైన ట్రోలింగ్స్ (Hate speech) కి, ఇంకొక 24% సమయం సినిమా గాసిప్స్, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకే సరిపోతోంది.
Ads
ఈ డిజిటల్ విద్వేషాల హోరు, వినోదాల రొంపి మధ్య… మన దేశం ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న అత్యున్నత మానవతా సేవల గురించి తెలుసుకోవడానికి మనకు దక్కిన సమయం కేవలం 1% కంటే తక్కువ మాత్రమే! ఆ ఒకే ఒక్క శాతం పరిధిలోకి వచ్చే అద్భుతమైన మిషనే ఈ ‘ఆపరేషన్ అమిస్తాద్’.స్పానిష్ భాషలో ‘Amistad’ (అమిస్తాద్) అంటే ‘స్నేహం’ అని అర్థం.
ఈ పేరుతోనే విపత్కర పరిస్థితుల్లో ఉన్న వెనిజులా దేశానికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన మానవతా మిషన్‌ను వెనిజులా భూకంప బాధితులకు ప్రారంభించింది.
మన కళ్ల ముందు జరుగుతున్న ఈ నిశ్శబ్ద ‘ఆపరేషన్ అమిస్తాద్’ దేశ ప్రగతికి, భారతదేశ సాఫ్ట్ పవర్‌కు ఒక నిదర్శనం. సోషల్ మీడియా విద్వేషాల మధ్య మనం మరుస్తున్న ఒక గొప్ప సత్యం ఇది.
ఇదేకాదు, మన శతృదేశమా, మిత్రదేశమా ఆలోచించదు మన దేశం… కేంద్రం ఆదేశించిందే తడవుగా సహాయ బలగాలు బయల్దేరిపోతాయి… వైద్యసాయమే కాదు, ఆహారం, మందులు, బట్టలు అన్నీ… కరోనా కాలంలో ఎన్నో దేశాలకు ఉచితంగా వేక్సిన్ సరఫరా చేశాం గుర్తుంది కదా…
వెనిజులాలో భారత ఆర్మీ వైద్య బృందాలు ఏర్పాటు చేసిన 24/7 ఉచిత ఫీల్డ్ హాస్పిటల్స్, ‘భీష్మ్ క్యూబ్’ (BHISHM Cube) వంటి ఆధునిక పోర్టబుల్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఒక విప్లవాన్నే సృష్టిస్తున్నాయి.

అక్కడి స్థానిక ప్రజలతో మనవాళ్లు మమేకమవుతున్న తీరు, చూపించే క్రమశిక్షణ, అహంకారం లేని వృత్తి నైపుణ్యం చూసి విదేశీ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. తమ వ్లాగ్స్ (Vlogs) ద్వారా భారతదేశం చేస్తున్న నిస్వార్థ సేవను, వసుధైక కుటుంబక భావనను ప్రపంచానికి చాటిచేబుతూ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మన దేశ మీడియా, సోషల్ మీడియా ప్రాధాన్యతలు ఇంతటి గొప్ప ఖ్యాతి అంతర్జాతీయంగా లభిస్తున్నా, మన దేశ ప్రజల్లో మెజారిటీ శాతానికి ఈ విషయాలు తెలియకపోవడానికి కారణం… ప్రధాన స్రవంతి వార్తా ఛానెళ్లు గానీ, లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న దేశీయ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు గానీ వ్యూస్ రావనే భయంతో ఇలాంటి ‘సంచలనం లేని’ పాజిటివ్ వార్తలను ప్రస్తావించకపోవడమే.
డిజిటల్ తెరలపై కనిపించే కృత్రిమ మతపరమైన, రాజకీయ వివాదాల బురదలో మునిగిపోయి, మన దేశం ప్రపంచవ్యాప్తంగా సంపాదిస్తున్న అపారమైన గౌరవాన్ని విస్మరించకండి. విదేశీయులు సైతం భారతీయుల మనస్తత్వానికి చేతులెత్తి మొక్కుతున్న తరుణంలో, మన దేశం చేస్తున్న ఈ “ఆపరేషన్ అమిస్తాద్” (స్నేహ హస్తం) గురించి ప్రతి భారతీయుడూ తెలుసుకోవాలి, గర్వపడాలి…
Share this Article