.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, స్థానిక సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హక్కుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి భద్రత కల్పించేందుకు ఒక ఉన్నత స్థాయి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తూ ఆర్థిక శాఖ ఆదివారం జీవో నంబర్ 88ని జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 7న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.
Ads
అక్రమాలకు చెక్!
ప్రభుత్వ విభాగాల్లో పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నప్పటికీ, పలు ఏజెన్సీలు చట్టబద్ధమైన నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. లేబర్ లైసెన్సులు లేకపోవడం, ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ నిధులను సకాలంలో జమ చేయకపోవడం, యాజమాన్య వాటాలను ఎగనామం పెట్టడం వంటి అంశాలపై సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఇలాంటి అక్రమాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్ర స్థాయి కమిటీ: ఈ ప్రతిష్టాత్మక కమిటీకి చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యవహరించనున్నారు.
1. అహ్మద్ నదీమ్, IAS (ప్రిన్సిపల్ సెక్రటరీ, GAD) – చైర్మన్
2.డా.గౌరవ్ ఉప్పల్, IAS (సెక్రటరీ, ఆర్థిక & ప్రణాళిక శాఖ) – మెంబర్ కన్వీనర్
3. డి. హరిచందన, IAS (సెక్రటరీ, కార్మిక, ఉపాధి శాఖ) – మెంబర్
4.ఇ.వి.వి. నాగేశ్వరరావు (జాయింట్ సెక్రటరీ, ఆర్థిక శాఖ) – మెంబర్
5. ద్రాక్షామణి (డైరెక్టర్, స్టేట్ ఆడిట్) – మెంబర్
6. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (సర్వీసెస్ & HRM) ప్రతినిధి – మెంబర్.
కమిటీ ప్రధాన బాధ్యతలు ఇవే!
ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ నిర్వహించనుంది. ప్రధానంగా కింది అంశాలపై దృష్టి పెట్టనుంది.
చట్టబద్ధ నిబంధనల పరిశీలన: పీఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ టాక్స్, కనీస వేతనాల చట్టం, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ వంటి చట్టాలను ఏజెన్సీలు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయడం.
బ్యాంక్ ఖాతాల ద్వారానే వేతనాలు: ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు సకాలంలో మరియు నేరుగా డిజిటల్ బ్యాంకింగ్ విధానంలో అందుతున్నాయా లేదా అని చూడటం.
భౌతిక తనిఖీలు: సదరు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల అసలు ఉనికిని, వాటి కార్యాలయాలను భౌతికంగా తనిఖీ చేసి, అవి జెన్యూన్ సంస్థలేనా అని నిర్ధారించడం.
IFMIS పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్: భవిష్యత్తులో కేంద్రీకృత పర్యవేక్షణ కోసం ఆర్థిక శాఖకు చెందిన IFMIS పోర్టల్‌లో ఔట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ ఉద్యోగుల సమగ్ర వివరాలతో ఒక ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం.
45 రోజుల్లో నివేదిక సమర్పించాలి!
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు ఈ కమిటీకి పూర్తిగా సహకరించాలని, సమాచార మార్పిడి కోసం ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని (అడిషనల్/జాయింట్ సెక్రటరీ హోదా తగ్గకుండా) నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆధార్ అథెంటికేషన్, పీఎఫ్/ఈఎస్ఐ చెల్లింపులు, జీతాల వివరాలతో కూడిన ప్రామాణిక ప్రొఫార్మాను కమిటీ సిద్ధం చేస్తుంది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన 45 రోజుల్లోగా కమిటీ తన సమగ్ర నివేదికను, భవిష్యత్తులో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగులకు చేకూరే లబ్ధి ఇదే: ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల హక్కులకు భద్రత చేకూరనుంది. ప్రధానంగా ఏజెన్సీలు కట్ చేస్తున్న ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ నిధులతో పాటు యాజమాన్యాల మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కూడా సకాలంలో వారి ఖాతాల్లోనే జమవుతుంది.
> మధ్యవర్తుల ప్రమేయం, నగదు రూపంలో ఇచ్చి కమీషన్లు నొక్కేసే దోపిడీ విధానాలకు స్వస్తి పలికి, ప్రతి నెలా సకాలంలో నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారానే జీతాలు అందుతాయి.
> కనీస వేతనాల చట్టం, లేబర్ చట్టాల అమలుతో ఉద్యోగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన పూర్తి వేతనం అందుతుంది, దీనివల్ల ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.
> IFMIS పోర్టల్‌లో ఆధార్ అనుసంధానంతో కూడిన ప్రత్యేక మాడ్యూల్ ద్వారా నకిలీ నియామకాలకు చెక్ పడటమే కాకుండా, విధుల్లో ఉన్న అర్హులైన ప్రతి ఉద్యోగి వివరాలు డిజిటల్‌గా రికార్డు అయి వారి హక్కులకు పూర్తి భద్రత లభిస్తుంది. – మానేటి ప్రతాపరెడ్డి.
Share this Article