.
మీకు గుర్తుందా..? 2014… ఉత్తరప్రదేశ్‌ను అప్పుడు మేల్ మమత బెనర్జీగా పిలవబడే అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నాడు… అవును, మన కేటీయార్, హరీష్‌రావులకు సన్నిహితుడు… తను యూపీని ఉద్దరిస్తున్న కాలంలో… ఆజంఖాన్ అని ఓ మంత్రి… నిజానికి తనే డిఫాక్టో సీఎం… ఒక ఉదాహరణ చెబుతాను…
తనవి ఏడు గేదెలు తప్పిపోయాయి… ఇంకేం..? వందల పోలీసులు, డాగ్ స్క్వాడ్, పోరెన్సిక్ నిపుణులు, టాస్క్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగాయి… జల్లెడపట్టారు… అప్పటివరకు అఖిలేష్ ఆఫీసు నుంచి నిమిషనిమిషానికి ఫోన్లు… అదీ ఆజంఖాన్ అంటే… (పెద్ద దొర గడీభవన్‌లో ఓ పెంపుడు కుక్క మరణిస్తే, వైద్యం చేసిన ఓ సర్కారీ వెటర్నరీ వైద్యుడి మీద కేసులు పెట్టిన సంఘటన గుర్తొచ్చిందా..?)
Ads
ఆజంఖాన్ శుద్దపూస ఏమీ కాదు… దాదాపు 100 కేసులు, అన్నిరకాలు… పెద్ద క్రిమినల్… బహుశా ఈ రేంజ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్ గాకుండా తప్పించుకున్నది తనొక్కడేనేమో యోగీ పాలనలో! ప్రస్తుతం జైలులో ఉన్నాడు, అన్ని కేసుల్లో బెయిల్ రావాలంటే ఏళ్లు కావాలి…
తను ఎడాపెడా కబ్జాలు చేసేసి, ఓ పేద్ద ప్రైవేటు యూనివర్శిటీ కట్టేశాడు… రాష్ట్ర విద్యాశాఖ ఎలాగూ సాగిలబడటమే కదా… దాని పేరు మౌలానా మహమ్మద్ అలీ జౌహార్ యూనివర్శిటీ… 40 బిల్డింగులు కట్టాడు… (మన మల్లారెడ్డి యూనివర్శిటీకన్నా ఎక్కువ భవనాలేమో)… వాటిల్లో 38 భవనాలు అక్రమ నిర్మాణాలే…
మరి బుల్‌డోజర్ ప్రభుత్వం ఊరుకోదు కదా… అవన్నీ కూల్చేయాలని రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్డీఏ) ఆదేశాలు జారీ చేసింది… ఇది 2006 నుంచీ నడుస్తోంది… 2012లో పూర్తి స్థాయి యూనివర్శిటీ… దానికి యూపీఏ ప్రభుత్వం ఏకంగా యూజీసీ గుర్తింపునిచ్చింది…
మొత్తం 40 ప్రధాన భవనాల్లో మెడికల్ కాలేజ్, అకాడెమిక్ బ్లాక్ అనే రెండు భవనాలకు మాత్రమే అధికారిక నిర్మాణ అనుమతులు ఉన్నాయట… మిగిలిన 38 భవనాలకు ఆమోదిత నిర్మాణ ప్లాన్‌లు లేవు, అవసరమైన అనుమతులు లేవు…
మొత్తం వివరాలతో నివేదిక ప్రిపేర్ కాగానే యూనివర్సిటీ యాజమాన్యానికి 15 రోజుల గడువు ఇచ్చింది యోగీ ప్రభుత్వం… ఈ గడువులోగా అనధికార నిర్మాణాలను స్వయంగా తొలగించాలని సూచించారు అధికారులు… అలా చేయకపోతే, ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి చట్టాల ప్రకారం RDA స్వయంగా కూల్చివేత చర్యలు చేపడుతుందని ఓ నోటీసు జారీ అయ్యింది…
ఆ యూనివర్శిటీ వాదన ఏమిటో తెలుసా..? ఆ భవనాలు నిర్మించిన సమయంలో మా యూనివర్శటీ ఉన్న ప్రాంతం RDA పరిధిలో లేదు కాబట్టి RDA నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదట… బాగా చెప్పారు గానీ, అప్పట్లో కూడా సంబంధిత స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాల్సి ఉండేదని, రెండు భవనాలకు అనుమతులు తీసుకున్న దాఖలాలు ఉన్నందున, మిగిలిన వాటికీ అనుమతులు అవసరమేననీ, అవి లేవు కాబట్టి మీఅంతటమీరే కూల్చేయాలని సర్కారు జవాబు…
జౌహర్ యూనివర్సిటీ భూకేటాయింపులు, లీజ్, భూమి స్వాధీనం వంటి అంశాలపై గత కొన్నేళ్లుగా అనేక న్యాయపరమైన వివాదాలు ఎదుర్కొంటోంది… 2024లో విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి లీజ్ రద్దును సవాలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఉపశమనం ఇవ్వలేదు….
ప్రస్తుతం కూల్చివేత ఆదేశాలు మాత్రమే జారీ అయ్యాయి. యాజమాన్యానికి ఇచ్చిన 15 రోజుల గడువు పూర్తయ్యాక, వారు స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించకపోతే అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కూడా యాజమాన్యానికి ఉంటుంది…
Share this Article