.
ఆరు నెలల్లో 552 మంది మొగుళ్లు హతమారిపోయారు భార్యల ఘాతుకాలకు, అక్రమ సంబంధాలకు… పిల్లలున్నా సరే కడతేరుస్తున్నారు… కామం ముందు కన్నకడుపు కూడా నథింగ్… ఇక్కడ చెప్పుకోవల్సిన విశేషం ఏమిటంటే..? కొత్త కొత్త పద్ధతుల్లో క్రియేటివ్ ఐడియాలతో ఖతం చేస్తున్నారు మొగుళ్లను…
డ్రమ్ములు, ప్రెషర్ కుక్కర్లు పాత బడిపోయాయి… కొండల మీదకు తీసుకుపోయి కసకసా చేసి, లోయల్లోకి తోసేయడం కూడా పాతదైపోయింది… రక్తనాళాల్లోకి హార్పిక్ ఎక్కించడం కూడా చూశాం… ఇప్పుడు తాజా క్రియేటివ్ ఐడియా ఏమిటంటే..? ప్రియుడితో కలిసి భర్తను పాముతో కరిపించి చంపడం…
Ads
కిరాతకం, పైశాచికం, రాక్షసం, దారుణం అనకండి… ఇన్నేళ్లూ మొగుళ్లు పెళ్లాలను చంపలేదా? ఇప్పుడెందుకు గగ్గోలు అనే బ్యాచ్ రెడీగా ఉంది… పైగా పెళ్లాల క్రియేటివిటీని మెచ్చుకోరు ఈ మగాత్ములు అనీ ఆక్షేపిస్తారు…
తాజా వార్త ఏమిటంటే..? ఉత్తరప్రదేశ్ (UP) మీరట్ జిల్లా… అత్యంత కలకలం రేపిన ఒక భయంకరమైన హత్య ఉదంతం… అన్ని కేసుల్లోలాగే వివాహేతర సంబంధం, పైగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి … ఒక నిండు ప్రాణాన్ని అత్యంత క్రూరమైన పద్ధతిలో బలితీసుకునేలా చేశాయి. సినిమా స్టోరీని తలపించేలా భర్తను పాము కాటుతో చంపిన వికృత రూపం మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకుంది…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భందోరా గ్రామానికి చెందిన అతుల్ పన్వార్ (35), దామిని అనే దంపతులు హస్తినాపూర్‌లో ఒక ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే సదరు స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అనే యువకుడితో దామినికి వివాహేతర సంబంధం (ఎఫైర్) ఏర్పడింది. వీరిద్దరి వ్యవహారం కాస్తా అతుల్‌కు అడ్డుగా మారడంతో, అతడిని ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు…
రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం పాముతో స్కెచ్… కేవలం భర్తను చంపడమే కాకుండా, అతని పేరు మీద ఉన్న భారీ ఆర్థిక ప్రయోజనాన్ని కూడా దక్కించుకోవాలని ఆ కిరాతక జంట ప్లాన్ వేసింది. అతుల్ పేరిట ఉన్న రూ.20 లక్షల ఇన్సూరెన్స్ (బీమా) డబ్బులను క్లెయిమ్ చేసి కాజేయాలని పథకం రచించారు.
సాధారణంగా చంపితే పోలీసులకు దొరికిపోతామనే భయంతో, సహజ మరణంగా చిత్రీకరించేందుకు గురువారం రాత్రి దామిని తన ప్రియుడు తుషార్‌తో కలిసి బెడ్‌రూమ్‌లోకి ఒక విషపూరితమైన పామును తెచ్చింది. నిద్రిస్తున్న భర్త అతుల్‌ను ఆ పాముతో కాటు వేయించి అత్యంత అమానుషంగా హత్య చేశారు.
విచారణలో తేలిన అసలు నిజం… అతుల్ అకస్మాత్తుగా మరణించడంతో మొదట దానిని పాము కాటు వల్ల జరిగిన ప్రమాదంగా భావించారు. అయితే, ఈ ఘటనపై అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో నిశితంగా విచారణ చేపట్టారు. దామిని, తుషార్ కాల్ డేటా, ప్రవర్తనలపై నిఘా ఉంచిన పోలీసులకు అసలు నిజం తేటతెల్లమైంది.
అదుపులోకి తీసుకుని, తమదైన పోలీసు భాషలో ‘మర్యాద’ చూపించడంతో ఇన్సూరెన్స్ డబ్బులు, వివాహేతర సంబంధం కోసమే ఈ ప్లాన్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు… ఇదీ కేసు… మొగుళ్లూ బహుపరాక్… పెళ్లాలు ఏ కొత్త ప్లానుతో ఖతమారుస్తారో మీరు ఊహించలేరు!!
Share this Article