.
ఏడిస్తే చంపేస్తారు… అందుకే పసిపిల్లలకు నిద్ర గోళీలు ఇచ్చింది..! కానీ ఆమె చేసిన పని తెలిసాక ప్రపంచం ఆమెను దేవతగా పిలిచింది… 2500 మంది పసిపిల్లల ప్రాణాలు కాపాడింది, తన ప్రాణాలను పణంగా పెట్టి… అవును, దేవతలు అంటే వీళ్లే కదా…
“పసిపిల్లలకు నిద్ర మందులు ఇచ్చింది…” ఈ ఒక్క మాట వింటే ఎవరైనా ఆమెను క్రూరురాలే అనుకుంటారు. కానీ ఆ నిద్ర గోళీల వెనుక దాగి ఉన్న కథ వింటే… ఆమెకు నమస్కారం పెట్టకుండా ఉండలేరు.
Ads
1942… పోలాండ్‌లోని వార్సా ఘెట్టో. లక్షలాది మంది యూదులను నాజీలు ఒక గోడల మధ్య బంధించారు. బయటకు వస్తే కాల్చేస్తారు… లోపల ఉంటే ఆకలి, వ్యాధులతో చనిపోతారు. పెద్దల కంటే దారుణమైన పరిస్థితి పసిపిల్లలది.
అప్పుడే రంగంలోకి వచ్చింది ఒక సాధారణ మహిళ. ఆమె పేరు ఐరీనా సెండ్లర్. వృత్తిరీత్యా సోషల్ వర్కర్. కానీ చరిత్ర మాత్రం ఆమెను “పిల్లల ప్రాణాలు కాపాడిన దేవత”గా గుర్తుంచుకుంది.
ఆమె ప్రతిరోజూ వార్సా ఘెట్టోలోకి వెళ్లేది. మందులు తీసుకెళ్లే ఆరోగ్య సిబ్బంది పేరుతో లోపలికి వెళ్లడం పెద్ద కష్టం కాదు. అసలు సవాలు… బయటకు రావడమే. ఎందుకంటే ఆమె ఒంటరిగా బయటకు రాదు. తనతో పాటు ఒక చిన్నారిని కూడా తీసుకొచ్చేది.
అయితే సమస్య ఒక్కటే… పసిపిల్లలు ఏడుస్తారు. ఆ ఏడుపు వినిపిస్తే జర్మన్ సైనికులకు అనుమానం వస్తుంది. అనుమానం వస్తే… ఆ చిన్నారి చనిపోతాడు. ఆమె కూడా చనిపోతుంది.
అందుకే శిశువులకు వైద్యపరంగా సురక్షితమైన స్వల్ప మోతాదులో నిద్ర మందు ఇచ్చి, వారు ప్రయాణం మొత్తం నిద్రపోయేలా చూసేది.
ఆ తర్వాత…
ఎవరూ ఊహించని చోట్ల దాచేది. కొన్నిసార్లు అంబులెన్స్‌లో… కొన్నిసార్లు టూల్‌బాక్స్‌లో… మరికొన్నిసార్లు చెక్క పెట్టెల్లో… ఇంకొన్ని సందర్భాల్లో చెత్త బండ్లలో కూడా. బయటకు తీసుకొచ్చిన ప్రతి చిన్నారికి కొత్త పేరు పెట్టేది. నకిలీ పుట్టిన సర్టిఫికెట్ తయారు చేసేది.
క్రైస్తవ కుటుంబాలు, కాన్వెంట్లు, అనాథాశ్రమాల్లో సురక్షితంగా ఉంచేది. కానీ…
ఒక రోజు వారి అసలు తల్లిదండ్రులు బతికి వస్తే? అందుకే ప్రతి చిన్నారి అసలు పేరు… కొత్త పేరు… ఎక్కడ ఉంచిందో అన్న వివరాలన్నీ చిన్న కాగితాలపై రాసి గాజు సీసాల్లో పెట్టి నేలలో పాతిపెట్టింది. ఆ సీసాల్లో దాగి ఉన్నవి పేర్లు కాదు…
భవిష్యత్తులు. జాతకాలు
1943లో నాజీలు ఆమెను పట్టుకున్నారు. చిత్రహింసలు పెట్టారు. కాళ్లు విరగ్గొట్టారు. “పిల్లలు ఎక్కడ?” అని అడిగారు. ఆమె ఒక్క పేరు కూడా చెప్పలేదు. చివరకు మరణశిక్ష విధించారు. కానీ పోలిష్ ప్రతిఘటన ఉద్యమం రహస్యంగా ఆమెను తప్పించింది. అధికారిక రికార్డుల్లో మాత్రం… “ఐరీనా సెండ్లర్ చనిపోయింది.”
కానీ ఆమె బతికే ఉంది. మారుపేరుతో మళ్లీ అదే పని కొనసాగించింది. యుద్ధం ముగిసే సమయానికి… ఆమె, ఆమెతో కలిసి పనిచేసిన బృందం దాదాపు 2,500 మంది యూదు పిల్లలను మరణం నుంచి కాపాడింది.
ఆ పిల్లల్లో చాలామందికి తల్లిదండ్రులు తిరిగి దొరకలేదు. కానీ… వారి జీవితం మాత్రం దక్కింది. ఇంత గొప్ప పని చేసిన ఆమెను ఒకసారి అడిగారు… “మీ జీవితంలో చేసిన గొప్ప పని ఏది?”
ఆమె చెప్పిన సమాధానం ప్రపంచాన్ని కదిలించింది. “నేను చేసినది సరిపోలేదు… ఇంకా ఎక్కువ మంది పిల్లలను కాపాడలేకపోయాను… అదే నా జీవితంలో మిగిలిపోయిన బాధ.”
ఇదే నిజమైన మానవత్వం. హీరోలు సినిమాల్లో మాత్రమే ఉండరు. తమ పేరు చరిత్రలో నిలవాలని కాదు… ఎవరో ఒకరి జీవితం నిలవాలని ప్రాణాలను పణంగా పెట్టే వాళ్లే నిజమైన హీరోలు. అందుకే… ప్రపంచం ఐరీనా సెండ్లర్‌ను ఒక మహిళగా కాదు… “దేవత”గా గుర్తుంచుకుంది.
Share this Article