.
యార్లగడ్డ సుమంత్..! అంగట్లో అన్నీ ఉన్నా… అనేది తనకు పక్కాగా వర్తిస్తుంది… బలమైన అక్కినేని కుటుంబ వారసత్వం… అందంగా ఉంటాడు, కాస్తోకూస్తో నటన కూడా తెలుసు… నిజానికి తను స్టార్ హీరోగా సెట్ కావల్సింది… కానీ ఏం ఫాయిదా..? ఇది నా సినిమా అని చెప్పగలిగేది ఒక్కటీ లేదు… చివరకు గోదావరి సినిమా కూడా శేఖర్ కమ్ముల సినిమా, కమలిని ముఖర్జీ సినిమా మాత్రమే…
వ్యక్తిగత జీవితమూ అంతే… నటి కీర్తిరెడ్డితో పెళ్లయింది… వాళ్లదీ బలమైన ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబమే… కానీ రెండేళ్లకే విడాకులు… ఆమె మరో పెళ్లి చేసుకుని, సింగపూర్‌లో ఉంటోంది, సుమంత్ మాత్రం అలాగే ఒంటరిగా మిగిలిపోయాడు… అక్కినేని కుటుంబంలో అంతుచిక్కని మరో కేరక్టర్ ఇది!
Ads
యాభై ఏళ్ల వయసు ఇండస్ట్రీలో మగాళ్లకు పెద్ద ఇష్యూ ఏమీ కాదు… నాగార్జున, చిరంజీవి, రజినీకాంత్, కమలహాసన్, వెంకటేశ్… ఇలా ఎందరు లేరు? కానీ సుమంత్ కెరీర్ అడపాదడపా ఒకటీరెండు వేషాలు వేయడం తప్ప ఎదుగూ లేదు, బొదుగూ లేదు…
తాజాగా న్యూటన్స్ థర్డ్ లా అనే సినిమా చేశాడు… అసలు టైటిలే పెద్ద క్యాచీ కాదు… సరే, ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్ తీసుకున్నారు… కర్మ థియరీని ఏదో కొత్తగా చెప్పడానికి దర్శకుడు రాజేష్ కర్ణ ప్రయత్నించాడు… జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్ తదితరులున్నా… కథ భిన్నంగా ఉన్నా… దర్శకుడు విపరీతమైన గందరగోళంలో తను పడిపోయి, ప్రేక్షకుడిని కూడా ఓ గజిబిజి మానసిక స్థితిలోకి నెట్టేస్తాడు… వెరసి సుమంత్ ఖాతాలో మరో ఫెయిల్యూర్… కర్మ థియరీ, సారీ, ఖర్మ థియరీ అంటే ఇదే…

అసలు కథ న్యూటన్స్ థర్డ్ లా అనే బుక్ చుట్టూ తిరుగుతుంది, వరుస మరణాలను సుమంత్ పరిశోధిస్తూ ఉంటాడు… ఎవరెవరినో విచారిస్తుంటాడు… ఆ పర్వం ఒడవదు, తెగదు… ఫస్టాఫ్, సెకండాఫ్, చివరకు క్లైమాక్స్ దాకా అదే కథ…
చర్యకు ప్రతిచర్య అనేది న్యూటన్స్ థర్డ్ లా… జీవితంలో కూడా మన కర్మను బట్టి ఫలితం, అంటే చర్యను బట్టి ప్రతిచర్య ఉంటుందని చెప్పాలనేది దర్శకుడి ఉద్దేశం… దానికి కాస్త సస్పెన్స్ ఎలిమెంట్స్ జోడించాలని అనుకున్నాడు… వంట కుదరలేదు… పైగా చివరలో సీక్వెన్స్ కూడా ఉంటుందని మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు… ఖర్మ…
కథాకాకరకాయ జోలికి పోకుండా… సుమంత్ తన పాత్రకు తగ్గట్టు చేశాడు, వంక పెట్టడానికి ఏమీ లేదు… జగపతిబాబు, అవసరాల తమ రొటీన్ శైలి దాటి వెళ్లరు… బీజీఎం వోకే… లిరిక్స్ కాస్త వినిపించేలా ఉన్నాయి, గుడ్… కథలో నీతి ఏమిటనే కదా మీ ప్రశ్న… ఇంట్లో పెద్దలు బాధ్యతాయుతంగా లేకపోతే పిల్లలు కూడా సరైన మార్గంలో ఉండరు… నిజమే, దాన్ని బలంగా చెప్పలేకపోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్… సారీ, సుమంత్!
Share this Article