.
15 ఏళ్లకే వైస్ కెప్టెన్..! మరీ ఇంత తొందరేంటి? లేక సెలక్టర్లది మాస్టర్ ప్లానా? భారత క్రికెట్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక యువ ఆటగాడు రెండు మూడు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడితే చాలు… మరుసటి రోజు అతడిని “భవిష్యత్ సచిన్”, “నెక్స్ట్ కోహ్లీ”, “రాబోయే కెప్టెన్” అని బిరుదులు కట్టేయడం.
ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా అదే జరుగుతోందా? లేక సెలక్టర్లు నిజంగానే దూరదృష్టితో నిర్ణయం తీసుకున్నారా? దులిప్ ట్రోఫీకి ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా 15 ఏళ్ల వైభవ్‌ను ఎంపిక చేయగానే సీనియర్ కామెంటేటర్ హర్షా భోగ్లే ఒక ప్రశ్న వేశాడు. “రెడ్‌బాల్ క్రికెట్లో ఇంకా చెప్పుకోదగ్గ అనుభవమే లేని ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఎందుకు?” అని.
Ads
సెలక్టర్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. “అయ్యో… కెప్టెన్ చేయలేదు కదా! వైస్ కెప్టెన్ మాత్రమే చేశాం. ఇషాన్ కిషన్ పక్కన ఉంటూ నేర్చుకుంటాడు. తప్పేముంది? వైభవ్ రేపు టీమిండియా కెప్టెన్ కూడా కావచ్చు” అని సెలక్షన్ కమిటీలోని ప్రవంజన్ ములిక్ సమాధానం ఇచ్చాడు.
అక్కడితో చర్చ ఆగలేదు. ఈ లాజిక్ ప్రకారం… వైస్ కెప్టెన్ అంటే పెద్ద బాధ్యత ఏమీ ఉండదట. నేర్చుకోవడానికే ఆ హోదా ఇచ్చారట. అయితే ప్రశ్న ఒక్కటే… నేర్చుకోవాలంటే ఫీల్డులో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం సరిపోదా? “వైస్ కెప్టెన్” అనే బోర్డు కూడా మెడలో వేలాడాల్సిందేనా?
అయితే సెలక్టర్ల వాదనలోనూ కొంత లాజిక్ లేకపోలేదు. నాయకత్వం పుస్తకాలు చదివి రాదు. అనుభవంతోనే వస్తుంది. చిన్నప్పుడే బాధ్యతలు ఇస్తే భవిష్యత్తులో జట్టును నడిపించే ధైర్యం వస్తుంది.
కానీ మరో కోణం కూడా ఉంది… మన క్రికెట్లో ఒక ప్రమాదకరమైన అలవాటు పెరుగుతోంది. ఆటగాడు ఇంకా తన కెరీర్ మొదలుపెడుతుండగానే… అతడికి భారీ అంచనాలు కట్టేస్తాం. ఒక రోజు “ఫ్యూచర్ ఆఫ్ ఇండియా” అంటాం. రెండు మ్యాచ్‌లు ఫెయిల్ అయితే… “ఇంకా చాలా నేర్చుకోవాలి” అంటూ అదే వేగంతో కిందికి లాగేస్తాం.
హీరోని తయారు చేయడంలో ఎంత స్పీడ్ చూపిస్తామో… విలన్ని చేయడంలో కూడా అంతే వేగం చూపిస్తాం.
వైభవ్ విషయంలో జాగ్రత్త అవసరం… వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి సందేహం లేదు. 15 ఏళ్లకే దేశమంతా అతడి గురించి మాట్లాడుతోంది అంటే అందుకు కారణం ఉంది. కానీ ప్రతిభను పెంచడం ఒకటి… ప్రచారాన్ని పెంచడం మరోటి. ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతే అసలు సమస్య మొదలవుతుంది.
ప్రతి మ్యాచ్‌ను “కెప్టెన్ మెటీరియలా? కాదా?” అనే కోణంలో చూడటం మొదలైతే, అతడు బ్యాట్‌తో చేసే ప్రయాణం కంటే హోదాపైనే చర్చ ఎక్కువైపోతుంది. బరువు పెరిగితే అసలు ఒరిజినల్ ఆటకు గండం వాటిల్లుతుంది…
చివరికి… సెలక్టర్ల నిర్ణయం తప్పు అని ఇప్పుడే చెప్పలేం. హర్షా భోగ్లే సందేహం అనవసరం అని కూడా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం నిజం. మనం ఈ మధ్య యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కంటే… బిరుదులు ఇవ్వడంలోనే ఎక్కువ వేగం చూపిస్తున్నాం.
ఆడకముందే “భవిష్యత్ కెప్టెన్” అని ప్రకటించడం… ఆడిన తర్వాత “ఎందుకు ఆడలేదు?” అని ప్రశ్నించడం… ఈ రెండూ భారత క్రికెట్లో కొత్తేమీ కాదు.
వైభవ్‌కు ఇప్పుడు వైస్ కెప్టెన్సీ దక్కింది. అది అతడి అదృష్టమా… లేక అదనపు ఒత్తిడా? దానికి సమాధానం సెలక్టర్ల దగ్గర లేదు… వైభవ్ బ్యాట్ దగ్గర మాత్రమే ఉంది.
Share this Article