.
( మోహన్ గోటేటి ) ….. పదకవితా పితామహుడు ‘అన్నమయ్య’ సినిమా నాటి ఫ్లాష్ బ్యాక్ ఓసారి చెప్పుకోవాలి! ఒకసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) దగ్గర ‘అన్నమయ్య’ కథ వుందని తెలిసింది.
దాంతో భారవిని పిలిచి కథ చెప్పమన్నారు దర్శకేంద్రుడు.
ఆయన ఆ కథ అద్భుతంగా చెబుతుంటే.. కాసేపు విన్న తరువాత రాఘవేంద్రరావు గారు కుర్చీలోంచి లేచి వచ్చి.. కింద నేలపై కూర్చుని విన్నారు.
అది వినగానే తాదాత్మ్యం చెందారు!
కాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు..
వెంటనే లేచి వెళ్లి.. పదివేల రూపాయలు తెచ్చి భారవి చేతిలో పెట్టి..”ఇది మీకు అడ్వాన్స్.. ఈ సినిమాను తీస్తాను.. ఎప్పుడు తీస్తానో మాత్రం చెప్పలేను” అన్నారు.
Ads
ఆ తర్వాత ప్రముఖ పంపిణీదారు, నిర్మాత దొరస్వామి రాజు ‘ఈ కథను నేను తీస్తాను’ అంటూ ముందుకు రావడంతో ‘అన్నమయ్య’ సినిమాకు అక్కడ బీజం పడింది.
మరి.. అన్నమయ్య పాత్ర ఎవరు వేయాలి?
మల్లగుల్లాలు పడ్డారు రాఘవేంద్రరావు!
అలా ఆలోచించగా.. ఆలోచించగా నాగార్జున రూపం ఆయన కళ్ల ముందుకు వచ్చింది.
ఎస్.. ఎలా చూసినా అతనే కరెక్ట్ అనుకుని అడిగారు.
అది వినగానే నాగార్జున పెద్దగా నవ్వేశారు!
“నేనేమిటి? అన్నమయ్య ఏమిటి సార్? ఏవో డ్యూయెట్లు పాడుకుంటూ.. కమర్షియల్ సినిమాలు చేసుకుంటున్నాను.. ఈమధ్యే ‘నిన్నే పెళ్లాడతా’ కూడా చేశా.. నన్నొదిలేయండి” అన్నారు నాగార్జున.
ఊహూ.. ఆయన వదలలేదు..
“ఒక్కసారి కథ విను.. కమర్షియల్ గా సక్సెస్ అయినా అవ్వకపోయినా.. నీకు మాత్రం అవార్డు గ్యారెంటీ.. నా మీద నమ్మకం పెట్టు” అన్నారు దర్శకేంద్రుడు.
సరే అని అయిష్టంగానే.. కథ వినడానికి కూర్చున్నారు.
భారవి కథ చెబుతుంటే.. కాసేపటికి నాగార్జున లీనమైపోయారు.
అంతా అయ్యాక.. ఆయన ముఖం మారిపోయింది .. కళ్లు ఎర్రగా అయిపోయాయి.
“అవార్డు రావడమే కాదు.. కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతుంది సార్.. ఇది మనం చేస్తున్నాం” అంటూ నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఈ వార్త మీడియాలో రాగానే సంచలనం.. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే పెద్ద చర్చే!
రొమాంటిక్ ఇమేజ్ వున్న నాగార్జున ఏమిటి? భక్తిపరుడైన అన్నమయ్య ఏమిటి? అంటూ కామెంట్లు..
తెరపై హీరోయిన్ల అందాలను గుమ్మరించే రాఘవేంద్రరావు ఏమిటి? అన్నమయ్య తీయడం ఏమిటి? అంటూ వెటకారాలు..
ఇవన్నీ వీరి చెవిని పడినా.. నవ్వేసి ఊరుకున్నారు తప్పితే.. దేనికీ స్పందించలేదు.
అన్నపూర్ణా స్టూడియోలో తిరుమల దేవాలయం భారీ సెట్స్, ఇంటి సెట్స్.. వేసి షూటింగ్ చేశారు.. కొండలకు సంబందించిన సన్నివేశాలను కేరళలో చిత్రీకరించారు.
ఆ షూటింగ్ జరిగినన్ని రోజులూ నాగార్జున చాలా నిష్ఠతో, నియమాలతో.. ఆధ్యాత్మిక భావనతో వున్నారు.
ఆ సెట్స్ చూడడానికే మేం చాలాసార్లు ఆ షూటింగుకి వెళ్లేవాళ్లం.
అక్కడికి వెళ్లగానే ఎవరికైనా సరే ఆధ్యాత్మిక భావన వచ్చేసేది.
సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్పడానికి అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టేవారు.
బోలెడు మంది ఆర్టిస్టులతో.. ఆ షూటింగ్ ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది.
ఈ సినిమాకి మరో ప్రత్యేకమైన ఆకర్షణ ప్రముఖ నటుడు సుమన్ గారు!
వెంకటేశ్వరస్వామి నిజంగా మన కళ్ల ముందు ప్రత్యక్షమైతే.. అచ్చం అలాగే వుంటారేమో అన్నంతగా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ రూపం అంతలా ఆయనకి అతికినట్టు సరిపోయింది.
ఇక ఈ సినిమాకి మోహన్ బాబు, రమ్యకృష్ణ వంటి ఆర్టిస్టులు.. రచయిత భారవి.. సంగీత దర్శకుడు కీరవాణి.. గాయకుడు బాలసుబ్రహ్మణ్యం.. చాయాగ్రహకులుగా పనిచేసిన విన్సెంట్ గారు, వాళ్లబ్బాయి అజయ్ విన్సెంట్.. కళా దర్శకుడు భాస్కరరాజు.. ఇంకా మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు.. ఆయువుపట్టుగా నిలిచారు.
ఈ చిత్రంలో అన్నమయ్య కీర్తనలే ఎక్కువగా వినిపిస్తాయి. అయినా కూడా వాటిని కీరవాణి తన ప్రతిభతో కొత్తగా ప్రెజంట్ చేయడం వల్ల ఆడియో పెద్ద హిట్టయింది.
ఈ ఆడియోను హిందీ చిత్ర రంగానికి చెందిన ‘టీ సీరీస్’ కంపెనీ మార్కెట్ చేసింది. ఈ టీ సీరీస్ గురించి కూడా ఇక్కడ మనం కాస్త చెప్పుకోవాలి.
టీ సీరీస్ అధినేత గుల్షన్ కుమార్!
మొదట్లో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ పేరిట క్యాసెట్స్ కంపెనీని నెలకొల్పి ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యాక.. బాలీవుడ్ లోకి ప్రవేశించారు.
1990లో మహేశ్ భట్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఆషికి’ సినిమా సూపర్ హిట్!
ఆ చిత్రం ద్వారా గాయకులు కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
90లలో అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్ తో టీ సీరీస్ దూసుకుపోయింది.

హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆడియో రైట్స్ తీసుకుంటూ.. దేశ వ్యాప్తంగా వందలాది బ్రాంచీలు నెలకొల్పి.. వందలాది కోట్ల వ్యాపారాన్ని చేసి.. ఆడియో మార్కెట్ ను శాసించింది.
మన దేశ ఆడియో రంగంలో సుమారు అరవై శాతం మార్కెట్టును టీ సీరీస్ అప్పట్లో ఆక్రమించిందంటే ఎంతెలా అది దూసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ‘అన్నమయ్య’ సినిమా ఆడియో బాగా సక్సెస్ కావడంతో.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 1997 మొదట్లో హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్ లో ఓ వేడుక నిర్వహించారు.
ఈ చిత్రానికి మంచి ప్రచారం కల్పించినందుకు ఆ వేడుకలో సినీ పాత్రికేయులను అభినందిస్తూ, అందరికీ నిర్మాత చిన్న మెమొంటోను బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు.
- దురదృష్టం ఏమిటంటే, ఈ వేడుక జరిగిన కొన్ని నెలలకే గుల్షన్ కుమార్ ముంబైలో దారుణమైన హత్యకు గురయ్యారు.
మాఫియా ‘డీ కంపెనీ’ డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వలేదన్న కక్షతో.. అంధేరీలోని ఓ శివాలయం నుంచి బయటకు వస్తున్న గుల్షన్ కుమార్ ని దుండగులు కాల్చి చంపారు.
గుల్షన్ గొప్ప దైవభక్తుడు.. గాయకుడు కూడా.. ఆయన పాడిన పలు భక్తి ఆల్బమ్స్ విడుదలయ్యాయి.
ఇక ‘అన్నమయ్య’ రిలీజ్ అయ్యాక ఎంతటి సంచలన విజయాలు సాధించిందో.. ఎన్ని అవార్డులను కొల్లగొట్టిందో లెక్కేలేదు.
అప్పటివరకు ఫక్తు కమర్షియల్ రొమాంటిక్ మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన నాగార్జున అన్నమయ్యగా చూపిన అభినయం .. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో ఆయన అభినయించిన తీరు నభూతో నభవిష్యతి!
సినిమాలో ఎంతవెతికినా.. ఎక్కడా నాగార్జున కనపడలేదు..
కేవలం ‘అన్నమయ్య’ మాత్రమే కనిపించాడు..
అంతలా ప్రేక్షకులను ఆయన మంత్రముగ్ధులను చేశారు!
నాగార్జున గారి కెరీర్ లోనూ, రాఘవేంద్రరావు గారి కెరీర్లోనూ ‘ది బెస్ట్’’ ఫిలింగా నిలిచిపోయిందిది.
ఆత్రేయ గారు, జంధ్యాల గారు.. వంటి మహామహులు తీయాలని కలలుగని, విరమించుకున్న ఈ కథ రాఘవేంద్రరావు గారి చేతిలో పడడం ఓ విశేషమైతే.. ‘రాఘవేంద్రగారిలా దీనిని మరెవ్వరూ తీయలేరు’ అన్న ప్రశంస లభించడం మరో విశేషం.
అయితే, “ఇది నేను తీయలేదు.. ఆ వేంకటేశుడే తీయించాడు” అని రాఘవేంద్రరావు గారు ఇప్పటికీ చెప్పడం ఆయన వినమ్రత!
నాగార్జున ‘అన్నమయ్య’ ఏమిటి? అని వెక్కిరించిన నోళ్లు..
రాఘవేంద్రరావు భక్తిరస చిత్రం తీయడం ఏమిటి? అంటూ నవ్వుతూ వెటకారం చూపిన నోళ్లు..
‘అన్నమయ్య’ థియేటర్ల ముందు కనిపించిన ప్రేక్షకుల క్యూలను చూసి మూతబడ్డాయి!
#Annamayya
#nagarjunaakkineni
#KRaghavendraRao
#tseries
@Annapurna Studios
మొదట వెంకటేశ్వరుడి పాత్రకు శోభన్‌బాబును అనుకున్నారనీ, ఆయన అప్పటికే రిటైర్మెంట్ మూడ్‌లోకి వచ్చేసి, కాదనడంతో బాలకృష్ణను అడిగారనీ, తన లుక్కు పర్‌ఫెక్టుగా సూటవుతుందనీ భావించారట… ఎందుకో మళ్లీ ఈ ఫ్యాన్స్ ఇగోల పంచాయితీలు, సమస్యలు ఎందుకులే అనుకుని సుమన్‌ను తీసుకున్నారట…
Share this Article