.
Prasen Bellamkonda …. ఇది పాత పోస్ట్…. అక్షరం మార్చాల్సిన అవసరం లేకుండా అది ఈసారికి కూడా వర్తించడం విండీస్ దౌర్భాగ్యం…
.
వన్డే ప్రపంచ కప్ కు వెస్టిండీస్ క్వాలిఫై కాలేదన్నది వార్త కాదు.. అదొక విషాదం…
అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా!
వెస్టిండీస్ ను చూస్తే మనసు చివుక్కుమనిపిస్తోంది..
నిజానికి వన్ డే క్రికెట్ వాళ్ళ ఓన్ సొంత కప్ ఆఫ్ టీ కదా… వాళ్లకు ఈ ఆట బాయే హాత్ క ఖేల్ కదా..
Ads
అసలు వాళ్ళు ప్రాక్టీస్ ఎలా చేస్తారో తెలుసా..
సముద్రపు ఒడ్డున అలల అంచున నిలబడి బంతిని సముద్రంలోకి కొడతారు…అలలతో బంతి తిరిగొచ్చే వ్యవధిని బట్టి అది వెళ్లిన దూరాన్ని కొలుస్తారు…. వన్ డే క్రికెట్ కి కావల్సింది అదేకదా…
అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా
గార్డన్ గ్రీనిడ్జ్ కవర్ డ్రయివ్ వేగానికి బంతి వెళ్లే దారిలో దాని కింది పచ్చిగడ్డి భగ్గున కాలిపోయేది.
రాయ్ ఫెడ్రిక్స్ ఫైన్‌లెగ్ మీంచి చేసే హుక్ సౌందర్యానికి బౌలర్ కూడా ముగ్దుడయేవాడు.
వివియన్ రిచర్డ్స్ మాన్లీగా కులుకుతూ స్టేడియంలోకి నడుస్తుంటే లెక్కలేనంత మంది నీనాగుప్తాలు
మసాబా గుప్తాలను కలకనేవారు.
మాల్కం మార్షల్ బంతి ముక్కు ముందు నుంచి జోరీగ శబ్దం చేసుకుంటూ మెరుపులా వెళ్లడం మాత్రమే చాలా మంది బ్యాట్స్మెన్ కు తెలుసు.
యాండీ రాబర్ట్స్ వేగం
బంతికీ తూటాకూ తేడా చెరిపేసేదట.
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు..
అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా
ఈ మధ్య కూడా విండిస్ తక్కువేమీ తినలేదు.
లారా కవర్ డ్రైవ్ మహా మహా బౌలర్లకూ సౌందర్యాత్మక హింస. గేల్ కొట్టుడు రాక్షసత్వానికి నకలే. బ్రావో బ్రేవోనే కదా. హోల్డర్ రికార్డ్ హోల్డరే గా. ఆంబ్రోస్ హూపర్ చంద్రపాల్ ఒక్కోడూ ఒక్కో మహా హంతకుడు.
అయినా.. అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా
ఏమైందా కసి…
క్లయివ్ లాయిడ్ చూపులకు శాంతానికి నిలువెత్తు రూపంగా ఉంటాడా…
అతని లోపలి స్పోర్టివ్ క్రూరత్వం ఎనభై మూడు ఫైనల్ లో ఓడిపోయిన తరవాత గానీ భళ్లున బయటపడలేదు.
ఈ క్లయివ్ ఫాదర్ థెరెసా అప్పటికే రెండుసార్లు ప్రపంచ కప్పు గెలిచేసుకుని ఉన్నాడు కనుక ముచ్చటగా మూడోసారి కూడా ప్రుడెన్షియల్ ను ఎత్తేసి రిటైరైపోదామనుకున్నాడు. ఆ ఓటమి అతని లోపలి క్రీడా రాక్షసుడిని నిద్రలేపింది. రిటైర్మెంట్ ఆలోచనను అటకెక్కించాడు. భారత్ టూర్ పెట్టుకున్నాడు. ఆరు టెస్టుల్లో మూడింట్లో ఇండియాను చావచితక్కొట్టాడు.
వన్డేల్లో కూడా అదే హింస. వరల్డ్ కప్ హీరో మొహిందర్ ను దాదాపుగా సున్నా దాటనివ్వలేదు. వాటిలో రెండో మూడో పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్.
అవమానం సహించలేక భారత క్రికెట్ మతస్థులు గవాస్కర్ మీద రాళ్ల వర్షం కురిపించినపుడు బహుశా
లాయిడ్ లోలోపల కసిగా నవ్వుకునే ఉంటాడు. ఒక భారత బాట్స్మన్ అప్పటికి అత్యధిక స్కోరు 236 ఈ సిరిస్ లోనే గవాస్కర్ చేసినా అభిమానులు క్షమించలేదు.
కపిల్ ఒక ఇన్నింగ్స్ లో 9 వికెట్లు తీసిన ఫీట్ కూడా సిరీస్ ఘోర ఓటమి కింద కప్పెట్టుకుపోయింది.
ప్రతీకారంలో పరాకాష్ట లాయిడ్.
ఇంత దుర్మార్గులు కూడా చిన్న కుడుముకే పండగనుకుంటారు. యే గెలుపు తరవాతయినా వాళ్ళు దిల్ ఖోల్కె చేసే వింత వింత అల్లరితాండవాలు నిజంగా నచ్ బలియే లే కదా.
అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్.. నిజమేనా?
నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరిపోతే నిభిడాశ్చర్యంతో వీరు…
నెత్తురు కక్కుతూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే … అనేది నిజమే కావచ్చుగానీ నేనైతే విండీస్ నెత్తురు కక్కుతూ నేలరాలడాన్ని నిర్దాక్షిణ్యంగా మాత్రం చూడలేకపోతున్నా.. నమ్మలేకపోతున్నా!
సారీ కరేబియన్స్…అయినా లవ్ యు…
వెస్ట్ ఇండీస్ జట్టు 2019, 2023, తాజాగా 2027 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా (డైరెక్ట్ ఎంట్రీ ద్వారా) అర్హత సాధించడంలో విఫలమైంది. (గమనిక: 2019 టోర్నమెంట్‌కు నేరుగా అర్హత రాకపోయినా, క్వాలిఫైయర్స్ ఆడి ప్రధాన టోర్నీకి వెళ్లగలిగింది).
మొదటి రెండు వన్డే ప్రపంచ కప్‌లను (1975, 1979) గెలుచుకుని, క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన వెస్ట్ ఇండీస్ జట్టు, గతంలో జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్‌కు మాత్రం క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో ఓడిపోయి చరిత్రలో మొదటిసారి ప్రధాన టోర్నమెంట్‌కే పూర్తిగా అర్హత సాధించలేకపోయింది.
ఇక రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ విషయానికి వస్తే, నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, వారు తదుపరి జరిగే క్వాలిఫైయర్ టోర్నమెంట్ ద్వారా ప్రధాన టోర్నీకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి…
Share this Article