.
Prabhakar Jaini …. తీర్పు చెప్పే ముందు…
……..
సమయం ఉదయం ఆరున్నర.
నా ఇంటి బాల్కనీలో నిలబడి కాఫీ తాగుతున్నాను. రాత్రంతా కురిసిన వాన అప్పుడే ఆగింది. ఎదురుగా ఉన్న గుల్మొహర్ చెట్టు ఆకుల చివర్ల నుంచి నీటి బొట్లు ఒక్కొక్కటిగా జారిపడుతున్నాయి. రోడ్డుమీద తడిసిన మట్టి వాసన గాలితో కలిసి వీస్తు ముక్కుపుటాలకు కొత్త సువాసనలను పరిచయం చేస్తుంది.
అరవై రెండేళ్ళ జీవితంలో ఎన్నో వానలు చూసాను. కానీ కొన్ని వానలు ఆకాశం నుంచి కురవవు. మనిషి కళ్ళలో కురుస్తాయి. కొన్ని తుఫానులు సముద్రంలో పుట్టవు. మనిషి జీవితంలో పుడతాయి.
నా పేరు రాఘవేంద్ర. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ని. భార్య సుమతి. ఒక్కగానొక్క కూతురు శ్రావ్య. ఆమెకు పెళ్ళయి బెంగళూరులో ఉంటుంది.
మొత్తానికి నా జీవితం ప్రశాంతంగా సాగుతున్న నది అనుకుంటున్న సమయంలో, ఆ రోజు మా అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూపులో ఒక ఫొటో వచ్చింది.
Ads
ఫొటోలో మా అపార్ట్మెంట్లో పనిచేసే పనిమనిషి లక్ష్మి ఉంది.
ఆమె పక్కన ఓ పోలీసు కానిస్టేబుల్. కింద ఎవరో రాసారు.
‘దొంగతనం చేసిన లక్ష్మిని పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి, అందరూ జాగ్రత్త!’
నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను.
లక్ష్మి!
మా ఇంట్లో ఎనిమిదేళ్ళుగా పనిచేస్తుంది. ఉదయం ఏడింటికి వచ్చి, ఇల్లు ఊడ్చి, తుడిచి, అంట్లు తోమి వెళ్తుంది. ఒక్కరోజు కూడా మా ఇంట్లో రూపాయి పోలేదు.
అయినా, గ్రూపులో సందేశాలు వరదలా వచ్చిపడుతున్నాయి.
‘మొదటి నుంచీ నాకు అనుమానమే!’; ‘ఆమె చూపులే బాగుండవు.’; ‘పేదవాళ్ళను ఇంట్లోకి రానివ్వడమే తప్పు.’
‘మన ఫ్లాట్లలో ఏమైనా పోయాయేమో చూసుకోండి.’
నాకు ఒళ్ళు మండిపోయి, ఫోన్ పక్కన పడేసాను.
మనిషి మీద తీర్పు చెప్పడానికి మనకు ఎంత సమయం కావాలి?
ఒక్క నిమిషం!
కానీ ఆ మనిషి జీవితం తెలుసుకోవడానికి? కొన్నిసార్లు ఒక జీవితకాలం కూడా సరిపోదు
లక్ష్మి మొదటిసారి మా ఇంటికి వచ్చిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు ఆమె వయసు ముప్పై అయిదు ఉండవచ్చు.
చామనఛాయ. సన్నటి శరీరం. పాత చీర. నుదుట చిన్న బొట్టు. ముఖంలో అలసట కనిపించినా, కళ్ళలో మాత్రం విచిత్రమైన ధైర్యం ఉండేది. సుమతి ఆమెను,
“ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు?” అని అడిగింది రొటీన్ గా.
“నాలుగు ఇళ్ళలో చేస్తానమ్మా.”
“నీ భర్త ఏం చేస్తాడు?” అన్న ప్రశ్నకు లక్ష్మి ముఖం నల్లగా మాడిపోయింది.
“లేడమ్మా!” అన్నది ముభావంగా. అంతే చెప్పింది. ఆ తర్వాత మేము కూడా ఎప్పుడూ అడగలేదు.
నెలలు సంవత్సరాలయ్యాయి. లక్ష్మి మా కుటుంబంలో ఒక భాగమైపోయింది.

ఒకసారి నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. సుమతి ఒక్కతే ఇబ్బంది పడుతుంటే లక్ష్మి తన పనులన్నీ ముగించుకుని మధ్యాహ్నం మళ్ళీ వచ్చేది.
“నువ్వెందుకు మళ్ళీ వచ్చావు లక్ష్మీ?” అని అడిగితే
“అయ్యగారికి జ్వరం కదమ్మా! నీకు ఒక్కదానికీ కష్టమవుతుంది. మనిషికి మనిషే సాయం.” అని సమాధానం చెప్పింది.
అలాంటి లక్ష్మి దొంగతనం చేసిందంటే నా మనసు నమ్మలేదు. సుమతి కూడా నమ్మలేదు. అందుకే,
“ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కోండి.” అని చెప్పింది.
కారు తీసాను.
—
పోలీస్ స్టేషన్ బయట లక్ష్మి కూర్చుని ఉంది. నన్ను చూడగానే తల వంచుకుంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో నాకు దొంగ కనిపించలేదు. అవమానం భారంతో చచ్చిపోతున్న ఒక మనిషి కనిపించింది.
“లక్ష్మీ!” అని దయగా పిలిచాను.
తలెత్తింది. ఆమె కళ్ళనిండా నీళ్ళు.
“ఏమైంది?” అన్నాను.
ఆమె పెదవులు వణికాయి.
“నేను దొంగతనం చెయ్యలేదు అయ్యగారూ!” అని అన్నది.
ఆ మాటతో కన్నీళ్ళు జారిపోయాయి. విషయం తెలుసుకున్నాను.
మా అపార్ట్మెంట్లోని 503 ఫ్లాట్లో ఉండే వనజ గారి బంగారు గొలుసు కనిపించలేదు. ఉదయం లక్ష్మి అక్కడ పని చేసి వెళ్ళింది. మధ్యాహ్నానికి గొలుసు కనిపించకపోవడంతో అనుమానం ఆమె మీదకు వెళ్ళింది.
పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఇన్స్పెక్టర్ నాకు పరిచయస్తుడే. అందుకే, “సార్, ఇంకా కేసు నమోదు చెయ్యలేదు. విచారణ చేస్తున్నాం.”
“ఏమైనా ఆధారం ఉందా?” అని అడిగాను.
“లేదు.” అన్నాడు
“అయితే ఈమె ఫొటో తీసి దొంగ అని వాట్సాప్ గ్రూపులో ఎవరు పెట్టారు సార్?” అన్నాను ఆవెేదనగా.
ఆయన మౌనంగా ఉండిపోయాడు. లక్ష్మిని చూశాను. నిండు కుండలా ఉంది. నేను ధైర్యంగా, ఇన్స్పెక్టర్ వైపు చూసి,
“లక్ష్మీ! నువ్వు ఇంటికి వెళ్ళు.” అన్నాను
ఆమె కదల్లేదు.
“అయ్యగారూ…”
“ఏమిటి?”
“ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి?”
నాకు అర్థం కాలేదు.
“అంటే?”
“నేను దొంగనని మా బస్తీ అంతా తెలిసిపోయింది. నా కొడుకును స్కూల్లో పిల్లలు ‘దొంగ కొడుకు’ అన్నారట.” అంటూ ఆమె ఏడుస్తూ చెప్పింది.
నా గుండెల్లో ఏదో గుచ్చుకుంది.
ఒక వాట్సాప్ సందేశం!
రాసినవాడికి పది సెకన్లు.
కానీ ఒక కుటుంబం పరువు పోవడానికి ఆ పది సెకన్లు చాలు.
—
లక్ష్మిని కారులో ఇంటికి తీసుకెళ్తానన్నాను. వద్దంటూ,
“ఒక చోటికి తీసుకెళ్తారా అయ్యగారూ?” అని అడిగింది.
“ఎక్కడికి?”
“హాస్పిటల్కి.”
ఆశ్చర్యపోయాను.
ఆమె చెప్పిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాను. మూడో అంతస్తులో జనరల్ వార్డు. ఒక మంచం మీద పద్దెనిమిదేళ్ళ బక్కచిక్కిపోయిన యువకుడు పడుకుని ఉన్నాడు. ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్ ఉంది. లక్ష్మి అతని దగ్గరకు వెళ్ళి తల నిమిరింది.
“నా పెద్ద కొడుకు రవి అయ్యగారూ!”
నేను నిశ్చేష్టుడినయ్యాను.
“ఏమైంది?”
“రెండు కిడ్నీలూ పాడయ్యాయి.”
నా చేతిలోని కారు తాళాలు ఒక్కసారిగా బరువెక్కినట్టనిపించాయి.
“ఎప్పటి నుంచి?”
“మూడేళ్ళ నుంచి.”
“మాకు ఎప్పుడూ చెప్పలేదే?”
ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఎంత బాధ ఉందో నాకు అప్పుడు తెలిసింది.
“నా కష్టం చెప్పుకుని మీ దగ్గర డబ్బులు తీసుకుంటే… నేను పని చెయ్యడానికి వచ్చినట్టా, అడుక్కోవడానికి వచ్చినట్టా అయ్యగారూ?” అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్నొక్కడినే కాదు. మొత్తం మా అపార్టుమెంట్ వాసులను, మొత్తం ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా నాకు అనిపించింది. నాకు నోట మాట రాలేదు. అయినా, కష్టంగా,
“మరి ఖర్చులు?”
“ఉదయం నాలుగు గంటలకు లేస్తాను. ఇడ్లీలు చేసి అమ్ముతాను. ఆరు నుంచి పదకొండు వరకు ఇళ్ళలో పని. మధ్యాహ్నం హాస్పిటల్. సాయంత్రం రెండు ఇళ్ళలో వంట. రాత్రి ఇంటికి వెళ్ళి చిన్నవాడికి అన్నం పెడతాను.”
నేను ఆమెనే చూస్తుండిపోయాను. ఎనిమిదేళ్ళుగా మా ఇంట్లో పనిచేస్తున్న మనిషి గురించి నాకు తెలిసింది ఎంత? ఆమె పేరు. ఆమె జీతం. అంతే!
కానీ ఆమె మోస్తున్న విషాదభరితమైన జీవితం గురించి
నాకు తెలియదు.
“నీ భర్త?”
ఆమె కళ్ళు కిటికీ బయటకు తిరిగాయి.
“తాగి కొట్టేవాడు అయ్యగారూ. ఒకరోజు పిల్లల్ని కూడా చంపేస్తానన్నాడు. వాళ్ళను తీసుకుని బయటకు వచ్చేసాను.”
“అప్పటి నుంచి ఒంటరిగానే?”
“ఒంటరిగా కాదు అయ్యగారూ!” అంటూ ఆమె రవి తల మీద చెయ్యి పెట్టి,
“వీళ్ళిద్దరూ ఉన్నారు కదా!” అన్నది
ఆ మాట విన్నాక నాకు కళ్ళు చెమ్మగిల్లాయి.
—
మరుసటి రోజు ఉదయం వనజగారి ఫ్లాట్ నుంచి సమాచారం వచ్చింది.
గొలుసు దొరికింది. ఆమె కూతురు జ్యువెలరీ షాపుకి తీసుకెళ్ళి పాలిష్ చేయించడానికి ఇచ్చిందట. తల్లికి చెప్పడం మర్చిపోయిందట.
అంతే! కేసు ముగిసింది. కానీ, లక్ష్మి మీద పడిన నింద ముగిసిందా? వాట్సాప్లో మరో సందేశం
‘Sorry. Chain found. Lakshmi is innocent.’ అని వచ్చింది.
నాకు కోపం వచ్చింది. నిన్న ‘దొంగ లక్ష్మి!’; ఈ రోజు, ‘Sorry!’
మనిషి గౌరవం, విలువ అంటే పెన్సిల్తో రాసిన అక్షరమా? రబ్బరుతో తుడిచేస్తే పోవడానికి! అందుకే, ఆ సాయంత్రం అపార్ట్మెంట్ అసోసియేషన్ సమావేశం పెట్టించాను.
అందరూ వచ్చారు. లక్ష్మిని కూడా పిలిచాను. ఆమె రానంది. బలవంతంగా తీసుకొచ్చాను.
అందరి ముందు నిలబడింది. తల వంచుకుని ఉంది. నేను లేచి నిలబడి,
“నిన్న మనం ఈమెను దొంగ అన్నాం. ఈ రోజు నిర్దోషి అంటున్నాం. కానీ ఈ రెండింటికీ మధ్య ఒక ప్రశ్న ఉంది. మీకు తెలుసా?” అని ప్రశ్నించాను.
అందరూ నా వైపు చూసారు.
“ఈమె గురించి మనకు ఏం తెలుసు?”
నిశ్శబ్దం.
“ఈమె రోజూ మన ఇళ్ళలోకి వస్తుంది. మన పిల్లల్ని చూస్తుంది. మనం తిన్న ప్లేట్లు కడుగుతుంది. మన ఇళ్ళలోని చెత్త తీసుకెళ్తుంది. కానీ ఈమె ఇంట్లో ఎంత చెత్త లాంటి బాధ పేరుకుపోయిందో మనలో ఒక్కరికైనా తెలుసా?”
లక్ష్మి ఏడుస్తుంది.
“ఈమె కొడుకు మూడు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో పోరాడుతున్నాడు. ఈమె ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేస్తుంది.”
వనజ తల వంచుకుంది.
నేను ఆమెను కూడా తప్పుపట్టలేదు. ఎందుకంటే ఆ రోజు నేను ఒక విషయం నేర్చుకున్నాను. తప్పు చేసిన మనిషిని సరిదిద్దడం కన్నా, తీర్పు చెప్పే మనస్తత్వాన్ని సరిదిద్దడం ముఖ్యం.
వనజ లేచి లక్ష్మి దగ్గరకు వెళ్ళింది.
చేతులు పట్టుకుని, “నన్ను క్షమించు లక్ష్మీ!” అంది.
లక్ష్మి వెంటనే చేతులు విడిపించుకుని,
“అయ్యో! మీరు పెద్దవాళ్ళమ్మా!” అంది.
“కాదు లక్ష్మీ. నిన్ను చిన్నదాన్ని చేసింది నీ పేదరికం కాదు. నా అనుమానం.”
హాలులో నిశ్శబ్దం.
—
మేమంతా కలిసి రవి వైద్యానికి సహాయం చేసాం. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఇంకొకటి. అపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన మొత్తం డబ్బు లక్ష్మి తీసుకోలేదు.
“ఎంత అవసరమో అంతే ఇవ్వండి. మిగతాది ఇంకెవరైనా కష్టంలో ఉన్నవాళ్ళకు ఇవ్వండి.” ఆ మాటతో ఆ రోజు ఆమె ముందు నేను నిజంగానే చిన్నవాడినైపోయాను. చదువు మనకు అక్షరాలు నేర్పుతుంది.
జీవితం మనకు మనుషుల్ని చదవడం నేర్పాలి. కానీ మనం చాలాసార్లు అక్షరాలు చదువుతాం. మనుషుల్ని చదవం.
—
ఆ సంఘటన జరిగి ఆరు నెలలైంది. రవి ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. లక్ష్మి ఇప్పటికీ మా ఇంటికి వస్తుంది.
ఒకరోజు బాల్కనీలో కాఫీ తాగుతూ ఆమెను,
“లక్ష్మీ! నీ మీద అంత పెద్ద నింద వేసినప్పుడు నీకు కోపం రాలేదా?”
ఆమె నవ్వి,
“కోపం ఎందుకు రాలేదు. వచ్చింది అయ్యగారూ.” అన్నది.
“మరి ఎందుకు ఎవరినీ ఏమీ అనలేదు?”
చీపురు గోడకు ఆనించి నా వైపు చూస్తూ,
“ఏం అనాలి అయ్యగారూ? నా చెప్పులు వేసుకుని వాళ్ళు ఒక్కరోజైనా నడిస్తే, నన్ను దొంగ అనలేరు.”
నా చేతిలోని కాఫీ కప్పు అలాగే ఆగిపోయింది. లక్ష్మి మళ్ళీ చీపురు తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది.
నేను మాత్రం బాల్కనీలో నిలబడిపోయాను.
ఎదురుగా రోడ్డుమీద మనుషులు వెళ్తున్నారు.
ఒక్కొక్కరికీ ఒక్కో ముఖం. ఒక్కొక్కరి వెనుక ఒక్కో కథ.
కనిపించే నవ్వు వెనుక కనిపించని కన్నీరు.
కనిపించే కోపం వెనుక కనిపించని గాయం.
కనిపించే తప్పు వెనుక మనకు తెలియని పరిస్థితి.
అప్పుడు నాకు అర్థమైంది.
ఈ ప్రపంచంలో మనం చాలా సులభంగా చేసే పని- ఇతరుల జీవితాల పై తీర్పు చెప్పడం.
కానీ అత్యంత కష్టమైన పని – వాళ్ళ చెప్పులు వేసుకుని వాళ్ళ దారిలో ఒక్క మైలు నడవడం.
ఆ రోజు నుంచి నేను ఒక అలవాటు చేసుకున్నాను.
ఎవరైనా ఒక మనిషి గురించి చెడ్డగా చెప్పినప్పుడు వెంటనే నమ్మను. ఎవరైనా తప్పు చేసినట్టు కనిపించినప్పుడు వెంటనే తీర్పు చెప్పను. ముందు ఒక్క ప్రశ్న వేసుకుంటాను.
‘ఆ మనిషి కథ నాకు పూర్తిగా తెలుసా?’
తెలియకపోతే, మౌనంగా ఉంటాను.
- ఎందుకంటే,ఒక మనిషి గతం తెలియకుండా ఆ వ్యక్తి వర్తమానాన్ని కొలవకూడదు.
ఆమె భయాలను అనుభవించకుండా ఆమె ధైర్యాన్ని పరీక్షించకూడదు.
ఆమె కన్నీళ్ళ రుచి తెలియకుండా ఆమె నవ్వును నాటకం అనకూడదు.
ఆమె నడిచిన ముళ్ళదారి తెలియకుండా-
ఆమె పాదాల మీదున్న గాయాల మచ్చల గురించి తీర్పు చెప్పకూడదు! …….. రచన :: ప్రభాకర్ జైనీ
Share this Article