Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?

August 12, 2026 by M S R

.

Srini Journalist …. FCRA (ఫారిన్ కంట్రిబ్యూషన్ నియంత్రణ సవరణ బిల్లు) పై దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఎందుకు క్రైస్తవ సంఘాలు, ఎన్జీఓలు, ప్రతిపక్షాలు ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నాయి? ఒకసారి విశ్లేషణ చేద్దాం.

1976లో మొట్టమొదటిసారిగా అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ సార్వభౌమాధికార రక్షణే ధ్యేయంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆ కాలంలో అంతర్జాతీయంగా అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ పీక్ లెవెల్ లో ఉండేది. భారతదేశంలో కమ్యూనిస్టుల ప్రభావాన్ని అణచడానికి అమెరికా గూఢచార సంస్థ ‘సిఐఎ’ (CIA) ప్రయత్నిస్తే, దానికి ప్రతిగా రష్యా గూఢచార సంస్థ ‘కెజిబి’ (KGB) ఇక్కడి లెఫ్ట్ వింగ్ గ్రూపులు, పత్రికలకు భారీగా నిధులు పంపేది.

Ads

1967 సార్వత్రిక ఎన్నికలలో ఇరు దేశాలు తమకు అనుకూలమైన అభ్యర్థులకు విదేశీ డబ్బులు పంచాయనే సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో వద్ద ఉండేది. అప్పటి హోంమంత్రి వై.బి. చవాన్ పార్లమెంట్‌లో దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు.

ఆ తర్వాత 1974లో జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసిన చారిత్రాత్మక ‘రైల్వే సమ్మె’కు కూడా విదేశీ శక్తుల ఆర్థిక సహాయం అందిందనే నివేదికలు వచ్చాయి. దేశ అంతర్గత రాజకీయాలను విదేశీ డబ్బు శాసించకూడదనే ఉద్దేశంతో, ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ FCRA చట్టాన్ని తీసుకువచ్చింది.

ప్రారంభంలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు విదేశీ నిధులు తీసుకోకుండా నిషేధించిన ఈ చట్ట పరిధిలోకి, ఆ తర్వాత జరిగిన 1984 సవరణ ద్వారా స్వచ్ఛంద సంస్థలను కూడా తీసుకువచ్చారు. 1980ల ప్రారంభంలో పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాదం దేశ భద్రతకు పెద్ద సవాలుగా మారాయి.

సామాజిక సేవ ముసుగులో విదేశాల నుండి వచ్చే నిధులు separatist గ్రూపులకు, దేశంలో మతపరమైన అల్లర్లు, బలవంతపు మార్పిడులకు దారి మళ్లుతున్నాయని నిఘా సంస్థలు గుర్తించడంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎన్‌జీఓలను దీని పరిధిలోకి తెచ్చి, హోం శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది.

ఆ తర్వాత 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పాత చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, మరింత కఠినమైన ‘FCRA 2010’ చట్టాన్ని తెచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో రష్యా సహకారంతో నిర్మిస్తున్న ‘కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి’ వ్యతిరేకంగా జరిగిన భారీ స్థానిక నిరసనలకు, గ్రీన్ పీస్ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎన్‌జీఓలకు నిధులు అందాయని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి పి. చిదంబరం అధికారికంగా ప్రకటించారు. దేశ ప్రగతిని, ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ఎన్‌జీఓల లైసెన్స్‌కు ఐదేళ్ల గడువును, పరిపాలనా ఖర్చులపై పరిమితిని విధిస్తూ ఈ చట్టాన్ని తెచ్చారు.

ప్రస్తుత తాజా సవరణ బిల్లు ప్రకారం విదేశీ నిధులతో నడిచే ఎన్‌జీఓల లైసెన్స్ రద్దయినా, గడువు ముగిసినా, సదరు సంస్థలు విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుంది. నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ పునరుద్ధరించుకోకపోతే ఆ ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వ ఏజెన్సీలకు బదిలీ అవుతాయి లేదా వేలం వేయబడతాయి.

అయితే ఒకవేళ స్వాధీనం చేసుకున్న ఆస్తులలో ప్రార్థనా మందిరాలు, చర్చిలు, ఆరాధనా స్థలాలు ఉంటే, వాటి మతపరమైన స్వభావాన్ని మార్చకూడదని, లౌకిక ఆస్తిగా మార్చడానికి వీల్లేదని చట్టంలో ప్రత్యేక రక్షణ కల్పించారు.

దీనితో పాటు ఎన్‌జీఓల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోరే సంస్థలు గత రెండేళ్లలో కనీసం పది లక్షల రూపాయల విదేశీ నిధులను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించి ఉండాలనే నిబంధనను తెచ్చారు. మరోవైపు ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు గతంలో ఉన్న గరిష్ఠ ఐదేళ్ల జైలు శిక్షను ఒక సంవత్సరానికి తగ్గిస్తూ ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది.

అలాగే భారతీయ సంతతికి చెందిన వారు మినహా ఇతర విదేశీ పౌరులు ఎవరూ ఎన్‌జీఓలలో కీలక main position లో ఉండకూడదని, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సంస్థ సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేశారు.

ఏదైనా ఎన్‌జీఓపై విచారణ ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలు కేంద్ర హోం శాఖ ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు.
ఈ కొత్త నిబంధనల వల్ల తాము దశాబ్దాలుగా నిర్మించిన పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ఆస్తులను ప్రభుత్వం ఎక్కడ లాక్కుంటుందోనని మైనారిటీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల నుండి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఈ భయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ కీలకమైన హామీ ఇచ్చారు. ఈ చట్టాన్ని గత కాలానికి (Retrospectively) వర్తింపజేయబోమని, అంటే గతంలో జరిగిన వాటిని కాకుండా చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచే కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. దీనివల్ల పాత ఆస్తులకు ఎలాంటి ముప్పు ఉండదని భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించి, అందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (JPC) కి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది…. ఇదీ నేపథ్యం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!
  • ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!
  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…
  • నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!
  • Great Escape ! వ్యవస్థలన్నీ విఫలమైనవేళ – ఓ అరుదైన ఎయిర్ ఫీట్ !!
  • పోచారం గాచారమా..? పశ్చాత్తాపమా..? ఏమైంది వీళ్లందరికీ !!
  • సిగ్గుపడ్డ అరవింద్ స్వామి.. నవ్వుకుని దగ్గరికి రమ్మన్న నగ్మా !
  • గంగూలీ సౌరభం ! దాదాగిరీ ఇక బిగ్‌బాస్‌లో ! హోస్ట్‌గా ఫస్ట్ క్రికెటర్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions