Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !

August 13, 2026 by M S R

.

ఒక నవలను సినిమాగా తీయడం చాలా పెద్ద టాస్క్… నవలలో విషయాన్ని ఎంత సుదీర్ఘంగానైనా ఎలాబరేట్ చేయొచ్చు… వెగటు మసాలాలు దట్టించకుండానే సబ్జెక్టును దాటిపోకుండా, దారి తప్పకుండా చూసుకోవచ్చు… కానీ సినిమాగా తీసినప్పుడు వేరు… పరిమిత సమయం, అందులోనూ కమర్షియల్ వాసనలు అనే ఓ దిక్కుమాలిన పోకడ ఉంటుంది… సో, ఒక నవలను మూవీకరించడం అనేది ఓ యజ్ఞం…

మనకు చంద్రముఖి సినిమా తెలుసు కదా… బ్లాక్ బస్టర్ మూవీ… ఐతే కాస్త నేపథ్యాన్ని, సినిమాలు కూడా భాష మారేకొద్దీ, హీరో మారేకొద్దీ ఎన్ని రకాల వంకరలు పోయిందో పరిశీలిస్తే జాలి, సానుభూతి, ఆశ్చర్యం ఒకేసారి ముప్పిరిగొంటాయి… అవును, హీరోలే కదా ఇండియన్ సినిమాకు సకల అవలక్షణ కారకులు…

Ads

అప్పుడెప్పుడో, అంటే 1985లో, మలయాళంలో కుంకుమం అనే పత్రికలో ‘అస్వాతి తిరునాళ్’ అనే కలం పేరుతో ప్రచురితమైన ‘విజనవీధి’ (Vijanaveedhi) (నిర్మానుష్యమైన వీథి) అని ఓ సీరియల్‌తో ఈ కథనం ఆరంభం… పాత కోట లేదా భవనం, కథానాయిక డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, దెయ్యం ఆవహించినట్టు జనం భ్రమపడటం, చివరకు ఓ మానసిక వైద్యుడు ఎలా చికిత్స చేస్తాడనేది మూలకథ… ఇందులోనే చారిత్రిక పాత్రలు…

చంద్రముఖి

దాని ఆధారంగానే 1993లో ‘మణిచిత్రతాళు’ అనే సినిమా రూపొందింది… కాకపోతే ఈ సినిమా కథను మేమే రాసుకున్నామని సీనిమా టీమ్ చెప్పుకుంది… కొన్నాళ్లు కాపీ వివాదం నడిచింది… ఫాజిల్ దర్శకత్వంలో మోహన్‌లాల్, శోభన, సురేష్ గోపి నటించిన ఈ ‘మణిచిత్రతాళు’ (Manichitrathazhu) చిత్రం భారతీయ సైకలాజికల్ హారర్ చిత్రాలలో ఒక మైలురాయి…

కేరళలోని ఒక పురాతన తరవాడు (ఉమ్మడి కుటుంబం ఇల్లు) నేపథ్యంలో సాగే కథ. అక్కడ దెయ్యం ఉందని నమ్మే ఆచారాలు, మానసిక సమస్య (డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్) కారణంగా ఒక పాత్ర ప్రవర్తించే తీరును శాస్త్రీయంగా, మానసిక వైద్యం కోణంలో ముగించిన విధానం దీని ప్రత్యేకత. ఇందులో శోభన అభినయం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.

ఇక 2005 లో తమిళంలో ఈ సినిమా ప్లాన్ చేశారు… రజినీకాంత్ హీరో… ఇక తను హీరో అనేసరికి రకరకాల వంకర్లు పోయింది కథ… అందులో అవీఇవీ కమర్షియల్ హంగులు వచ్చి చేరాయి… మరీ ప్రత్యేకంగా వడివేలుతో వెగటు- రోత కామెడీ ట్రాక్… ఫైట్లు, డాన్సులు, స్టెప్పులు, ఎలివేషన్లు, రజినీ మేనరిజమ్స్  ఎట్సెట్రా…

మలయాళంలో మానసిక వైద్యుడైన డాక్టర్ సన్నీ (మోహన్‌లాల్) పాత్ర పరిమితంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ తమిళంలో రజనీకాంత్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను చాలా పవర్ ఫుల్‌గా, మాస్ ఎలిమెంట్స్, ఫ్లాష్‌బ్యాక్ పోరాట ఘట్టాలతో భారీగా మార్చారు… తెలుగులో డబ్ చేశారు… మలయాళంలో  శోభన పోషించిన పాత్రలో తమిళంలో జ్యోతిక నటించింది… ప్రభు, నయనతార ఇతర ప్రధాన పాత్రలు…

కొన్ని అర్థరహిత, రొటీన్ పాటల్ని వదిలేస్తే రారా సరసకు రారా అనే పాట మాత్రం సూపర్ హిట్… ఇదే సినిమాను 2007 లో  హిందీలో రీమేక్ చేశారు… అక్షయ్ కుమార్ హీరో, ప్రియదర్శన్ దర్శకత్వం… ‘భూల్ భులయ్యా’ (Bhool Bhulaiyaa)… మళ్లీ నార్త్ ఇండియన్ ఆడియెన్స్ టేస్ట్ పేరిట కామెడీకి ఇంకాస్త పెద్దపీట వేశారు… అక్షయ్ కుమార్ పోషించిన డాక్టర్ పాత్రలోని పిచ్చి సరదాలు, రాజ్‌పాల్ యాదవ్ కామెడీ సినిమా వాతావరణాన్ని సీరియస్ టోన్ నుంచి ఓ లైటర్ వీన్ సబ్జెక్టుగా మార్చేశాయి…

చంద్రముఖి సీక్వెల్, నాగవల్లి, భూల్ భులయ్యా 2, 3 చిత్రాలు పూర్తిగా వేరే కథలతో వచ్చిన సీక్వెల్స్ కావడం గమనార్హం… వాటి గురించిన ప్రస్తావనే ఇక్కడ అనర్హం… మాతృక మణిచిత్రతాళు ఒక సహజమైన, కళాత్మకమైన సైకలాజికల్ థ్రిల్లర్ అయితే చంద్రముఖి, భూల్ భులయ్యాలు వంకర్లు పోయిన రీమేకులు… అసలు నవలతో పోలిస్తే, అసలు ఇవి ఆ కథతో రూపొందినవేనా అనే సందేహం ఆవరిస్తుంది మనలను..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!
  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!
  • ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!
  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!
  • ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!
  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…
  • నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions