Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…

October 11, 2026 by Rishi

.
నా కళ్ల ముందు జరిగిన చరిత్ర – ఆస శ్రీరాములు అన్న పోరాటం*

(ఇది ఆస శ్రీరాములు అన్న స్వగతం కింద చదువుకోండి.. ఇందులో నా పాత్ర చాలా తక్కువ… అప్పుడే మొదలైన రిపోర్టింగ్ లో big issue..తరువాత వీరే నన్ను ఎన్కౌంటర్ కాకుండా కాపాడారు…మేము కేవలం వారి కోసము ధర్నా లు చేశాము.. కానీ అప్పుడు తెలియదు నాకు ఇలాంటి ప్రాణాలు పోయే రోజులు వస్తాయని..అప్పట్లో రాజ్యము.. పోలీసులు వెరీ పవర్ ఫుల్..)
(ఈ కథ మీకు రాములన్న చెపుతున్నారు వినండి…చదవండి..)


దుబ్బాక ఉదయం విలేకరి సోలిపేట రామలింగారెడ్డిని, రెండు రోజుల క్రితం తన సొంత గ్రామం చిట్టాపూర్‌కు సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు జీపులో తీసుకెళ్లారు. అప్పటి నుండి ఇంటికి రాలేదని ఆ గ్రామ యువకులు నాకు సమాచారం అందించారు.
నేను వెంటనే దుబ్బాక పోలీసులను సంప్రదించాను. “మాకు సంబంధం లేదు, తెలియదు” అని చెప్పారు. మూడవ రోజు కూడా రామలింగారెడ్డి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన మొదలైంది.

Ads

నేను సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టు మిత్రులకు సమాచారం అందించాను. వారు అంతగా స్పందించలేదు. దానికి ఓ చిన్న కారణం ఉంది – రామలింగారెడ్డి గతంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ మెదక్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆ కారణంగా ఎక్కడికైనా వెళ్లి ఉంటారని అనుకున్నారు.

వెంటనే నేను సిద్దిపేట ఈనాడు ప్రతినిధి కె. అంజయ్య దగ్గరికి వెళ్లి విషయం చెప్పాను. ఆయన వెంటనే స్పందించి తన పరిధిలో పోలీసు అధికారులతో చర్చించారు. అయినా సరైన సమాధానం రాలేదు.

ఆనాటి రోజుల్లో రాష్ట్రమంతటా తీవ్రమైన నక్సల్ విప్లవ ఉద్యమం నడుస్తోంది. మూడు రోజులుగా ఉదయం విలేకరి సమాచారం బయటకు రాకపోవడంతో మేము ఆందోళనకు గురయ్యాము.

వెంటనే నేను మా ఆంధ్రభూమి దినపత్రిక మఫిషియల్ ఇంచార్జ్ రామచంద్రమూర్తి గారికి ఫోన్ చేసి చెప్పాను. ఆయన పెద్దలు సీనియర్ సబ్ ఎడిటర్ సుగం బాబు గారికి ఫోన్ ఇచ్చి వివరాలు చెప్పమన్నారు.

మరుసటి రోజు “దుబ్బాక ఉదయం విలేకరి ఎక్కడ?” అంటూ ఆంధ్రభూమి లో వార్త ప్రచురితమైంది.

ఆ తర్వాత సిద్దిపేట కేంద్రంగా మెదక్, సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్లను సంప్రదించాం. ఉదయం సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దేవరకొండ కాళిదాస్, ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ జె. చెన్నయ్యలకు సమాచారం అందించాము.

మరుసటి రోజు మెదక్‌లో అత్యవసరంగా ఆంధ్రభూమి విలేకరి దేవయ్య, ఈనాడు రిపోర్టర్ యాదగిరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాము. సమావేశానికి సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్లు కూడా హాజరయ్యారు. అప్పటికి ఐదు రోజులు గడిచింది, రామలింగారెడ్డి జాడ కనిపించలేదు.

సమావేశం జరుగుతున్న సమయంలోనే స్టాఫ్ రిపోర్టర్లకు పోలీసు శాఖ నుండి సమాచారం అందింది. సిద్దిపేట DSP ని కలవాలని సూచించారు. మేము మెదక్ నుండి హుటాహుటిన సిద్దిపేటకు వెళ్లాం. అక్కడ DSP, రామలింగారెడ్డి ఇంట్లో బాంబులు దొరికినందున అదుపులోకి తీసుకున్నామని, 31 జులై 1990న టాడా కేసు నమోదు చేశామని ప్రకటించారు.

ఇది భారతదేశ చరిత్రలో ఒక రిపోర్టర్‌పై టాడా కేసు నమోదు కావడం మొదటిసారి.

వెంటనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు నేటి ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్‌లకు తెలియజేశారు. వారు అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

మరోవైపు మెదక్ జిల్లా జర్నలిస్టులు అందరూ కూడా ఉమ్మడి మెదక్ జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చారు. జిల్లా ప్రతినిధులందరూ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సమావేశమై రాష్ట్ర DGP ని కలవాలని నిర్ణయించారు. DGP కార్యాలయానికి వెళితే అనుమతించకపోవడంతో రోడ్డుపై APWJ ఆధ్వర్యంలో ధర్నా చేశాము.

దీంతో దిగివచ్చిన పోలీసు శాఖ ముందుగా బెయిల్ మంజూరు చేస్తామని, తర్వాత కేసు ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది. అప్పటికే పది రోజులు గడిచిపోయింది.

మరుసటి రోజు సిద్దిపేట మున్సిఫ్ కోర్టులో సాయిబాబా అడ్వకేట్ ద్వారా బెయిల్ పిటిషన్ వేశాము. మధ్యాహ్నం తర్వాత బెయిల్ మంజూరు చేశారు. కానీ ముషీరాబాద్ జైల్లో ఉన్న రామలింగారెడ్డిని విడుదల చేయడానికి వెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు.

నేను మరియు రామలింగారెడ్డి గారి పెద్దన్న రామచంద్రారెడ్డి గారు కలిసి ముషీరాబాద్ జైలుకు సాయంత్రం వెళ్లి జైల్లో ఉన్న రామలింగారెడ్డి విడుదల కోసం వెళ్లాం. నేను APWJ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పడంతో ఆయన, ఉదయం పత్రిక ఫోటోగ్రాఫర్ టీం కూడా ముషీరాబాద్ జైలుకు వచ్చారు. విడుదల తర్వాత రామలింగారెడ్డితో పాటు మేము నేరుగా చిట్టాపూర్ ఇంటికి రాత్రి చేరుకున్నాం.

దుబ్బాక ప్రెస్ క్లబ్ ప్రారంభం

తర్వాత నా SC షాపింగ్ కాంప్లెక్స్‌లో నాకు కేటాయించిన షాపులో దుబ్బాక ప్రెస్ క్లబ్‌ను ఏర్పాటు చేశాం. హనుమయ్య అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా రామలింగారెడ్డి, కార్యదర్శిగా ఆస శ్రీరాములు, సహాయ కార్యదర్శిగా పల్లె నర్సింలు గౌడ్‌లుగా ఎన్నుకున్నాం.

రామలింగారెడ్డి విడుదల సందర్భంగా కృతజ్ఞత సభ నిర్వహించాము. దానికి కె. శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రభూమి రెసిడెంట్ ఎడిటర్ ఆర్.వి. రామారావు గారు హాజరై ప్రెస్ క్లబ్‌ను ప్రారంభించారు.

తర్వాత రామలింగారెడ్డి సిద్దిపేటకు వార్త రిపోర్టర్‌గా బదిలీ కావడం, KCR తో అనుబంధం ఏర్పడి TRS పార్టీ ప్రారంభం నుండి పనిచేసి, దుబ్బాక శాసనసభ్యులుగా 4 సార్లు గెలవడం జరిగింది.

1994లో టాడా కేసు రద్దు – 1994లో తెలుగుదేశం పార్టీ NTR నాయకత్వంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హోం మినిస్టర్ గా పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న టాడా కేసులన్నీ రద్దు చేశారు.

— మీ ఆస శ్రీరాములు….

.

ఇది నేను చూసిన, నా కళ్ల ముందు జరిగిన ఆస శ్రీరాములు అన్న పోరాటం. ఆ రోజు జర్నలిస్టు బతుకు నిత్య గండం. అలాంటి రోజుల్లో ఒక జర్నలిస్టు కోసం మరో జర్నలిస్టు చేసిన యుద్ధం ఇది.

– సాక్షి: ఆస శ్రీరాములు, సీనియర్ జర్నలిస్ట్, దుబ్బాక
కథనం: సత్యనారాయణ వేముల (మీ సత్తెన్న)
సెంటర్.. చందానగర్
*9701538700

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…
  • గాఢనిద్రలో ఉన్న చంద్రబోస్ తెలంగాణతనం సోయి తెచ్చుకుంది !!
  • మీరూ మాలాగే దారితప్పారా పుష్పా? హీరో అంటేనే అన్‌వాంటెడ్ ఎలిమెంటా?
  • గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!
  • సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!
  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !
  • ఈ అందాల జాస్మిన్ యువరాణి! మూలాలు వెతుక్కుంటూ ముంబైకి !!
  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 
  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions