.
Mohan Goteti …. ‘హిట్ పెయిర్’!
సినిమాలపరంగా ఈ మాట మీరు చాలా సార్లు వినే వుంటారు!
ఫలానా హీరో- ఫలానా హీరోయిన్ కలయికలో పలు హిట్ సినిమాలు వచ్చాయనుకోండి..
ఇక వారికి ‘హిట్ పెయిర్’ అనే బ్రాండ్ పడిపోతూ వుంటుంది.
దీనికి రకరకాల కారణాలుంటాయి..
వాళ్లిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా హిట్టయిందనుకోండి..
ఇక అదే కాంబినేషన్ కోసం నిర్మాతలు ఎగబడతారు.
ఇప్పుడంటే ఈ ధోరణి తక్కువే గానీ, రెండు మూడు దశాబ్దాల క్రితం బాగా వుండేది.
Ads
ఎందుకో.. ఒక్కోసారి.. ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంటుంది..
ఇద్దరి పాత్రలూ బాగుంటాయి..
జంట చూడ ముచ్చటగా వుంటుంది..
ఇద్దరూ పాటల్లో కూడా అదరగొడతారు..
ఇద్దరూ పోటీపడి మరీ నటిస్తారు..
కథ.. కథనం .. దర్శకత్వం.. అన్నీ సమకూరుతాయి..
సినిమా హిట్టవుతుంది.. అంతే.. ఇక అది హిట్ పెయిర్.
గతంలో అలా ‘ఏఎన్నార్-సావిత్రి’లది పెద్ద హిట్ పెయిర్..
ఇద్దరి కాంబోలోనూ బోలెడు సినిమాలు..
బోలెడు హిట్లు.. వరుసగా వచ్చేసేవి సినిమాలు.
ఆ తర్వాత ఏఎన్నార్- వాణిశ్రీలది మరో సూపర్ హిట్ కాంబో!
‘భలే రంగడు’ మొదలుకొని.. పలు సినిమాలు.. పలు హిట్లు!
ఏఎన్నార్ కి వాణిశ్రీ కరెక్టుగా సూటయ్యే హీరోయిన్..
ఆయన నటనకు తగ్గట్టుగా పోటీపడి నటించేవారు ఆమె.
అక్కినేనే పెద్ద స్టయిల్ అనుకుంటే.. ఆమెది మరో పెద్ద స్టయిల్!
ఏ హీరోయిన్నూ ఒలకబోయని స్టయిలూ, పోజులూ ఒలకబోసేది ఆవిడ!
ఇక చీరకట్టులో ఆమె స్టయిలే స్టయిలు..
డబ్బయిలలో ‘వాణిశ్రీ చీరలు’ అంటూ అదో పెద్ద ఫ్యాషన్!
‘వాణిశ్రీ ఆర్గంజ చీరలు.. వాయిల్ చీరలు’ అంటూ శారీ షాపుల వాళ్లు బోర్డులు పెట్టి మరీ అమ్మేవారు!
ఆవిడ హెయిర్ స్టయిల్ ‘కొప్పు’ మరో ఫ్యాషన్!
అప్పట్లో అమ్మాయిలంతా ఆమెను తెగ ఫాలో అయ్యేవారు.
స్క్రీన్ మీద ఇద్దరూ కనపడితే అదిరిపోయేది!
ఇద్దరికీ రచయితలూ పోటాపోటీగా డైలాగులు రాసేవారు.
ఆ సీన్లు.. ఆ డైలాగులు.. అబ్బో.. చూసితీరాలి!
ఇక ఈ జోడీ మోజు పాటల్లో అయితే చెప్పతరమా?
‘ఆత్మీయులు’ సినిమాలోని పాట ఓసారి గుర్తు చేసుకోండి..
‘కళ్లలో పెళ్లిపందిరి కనబడసాగే…’ అని ఏఎన్నార్ అనగానే..
కళ్లతో రకరకాలుగా వాణిశ్రీ ఒలికించిన వయ్యారం అంతా ఇంతానా?
వాట్ ఏన్ ఎక్స్ ప్రెసివ్ ఐస్..!
‘దసరాబుల్లోడు’లో ‘పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్..” అంటూ మన కొంటె అక్కినేని ఆటపట్టిస్తుంటే.. ఆ పడుచుపిల్ల వాణిశ్రీ శృంగారభరితమైన చిరుకోపం ప్రదర్శిస్తూ.. కళ్లతో పలికించిన హావభావాలు ఒకటా.. రెండా..?
ఇక ఈ జంట అసలైన పాటల గురించి చెప్పాలంటే ‘ప్రేమనగర్’ గురించి చెప్పి తీరాలి కదా?
“కడవెత్తు కొచ్చిందీ కన్నెపిల్లా..” అంటూ ఏఎన్నార్ తన బ్రాండ్ స్టెప్పులేస్తూ వస్తుంటే.. భుజం మీద కడవ పెట్టుకుని.. అజంతా శిల్పంలా.. వాణిశ్రీ అలా.. అలా.. వయ్యారంగా నడుస్తూ వస్తున్న దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి!
తన బ్రాండ్ లో కళ్లు రెపరెపలాడిస్తూ.. మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మరొకరికి సాధ్యమేనా?
‘దత్తపుత్రుడు’లో మరో కొంటె పాట!
‘పిల్లోయ్ జాగ్రత్త.. ఒళ్లు కాస్త.. జాగ్రత్త” అంటూ ఏఎన్నార్ మీద మీదకి వస్తుంటే.. ఆమె మాత్రం ఊరుకుంటుందా?
“పిల్లోడోయ్ జాగ్రత్త..” అంటూ వాణిశ్రీ కాలు దువ్వుతూ మీద మీదకి వెళ్లడం చూస్తే.. ఆమె అభినయంలో వున్న పొగరంతా ఒక్కసారిగా రంగరించిపోసినట్టు వుంటుంది కదూ!
కొడుకు కోడలు’ సినిమాలో “నువ్వూ, నేనూ ఏకమైనామూ..” అంటూ బైక్ మీద అక్కినేని, వాణిశ్రీ జంట వస్తుంటే.. వాళ్లిద్దరి స్టయిలూ చూడడానికి మనకి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది.
ఇక ‘విచిత్రబంధం’ సినిమా..
“వయసే ఒక పూలతోట..” పాటలో ఏఎన్నార్, వాణిశ్రీ ఇద్దరూ కాస్త మోడరన్ డ్రెస్సుల్లో కనిపిస్తూ చేసిన డ్యాన్సులు కనువించు చేస్తాయి.
వీరి మరో హిట్ సాంగ్ “చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’.
ఏం పాటండీ బాబూ..
రేడియోలో రోజూ ఇదే పాట ఎన్నిసార్లో వేసేవారో..
పాటలో ఇద్దరూ కలిసి కుమ్మేశారు..
కర్చీఫ్ లతో ఇద్దరూ ఆడేసుకున్నారు..
ముందు అక్కినేని తన కర్చీఫ్ ని అటు.. ఇటు వయ్యారంగా తిప్పుతూ వేసిన నాజూకైన స్టెప్పుకి థియేటర్లో క్లాప్స్.. ఈలలు.
ఆమె మాత్రం తక్కువా.. తనూ కర్చీఫ్ ని ఆడుకుంది..
‘ఆలుమగలు’లోని ‘చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే’ పాట మాత్రం తక్కువా?
ఇద్దరూ కలిసి శృంగార భావనలు.. వయ్యారాలు ఎడాపెడా ఒలకబోశారుగా!
ఇలా చెప్పుకుంటే పోతే.. ఎన్నని పాటలు.. ఎన్నని కథలు?
పాటల్లో ఒక ఊపు ఊపేసిన జంట ఇది..
పాటల కోసమే మళ్లీ మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించిన జోడీ ఇది!
అప్పట్లో రికార్డింగ్ డ్యాన్సుల వాళ్లకి ఈ పాటలే ఫుడ్డు పెట్టేవి..
రేడియోలో ఈ పాటలే మార్మోగేవి..
అందుకే, నాకు కూడా ఈ హిట్ పెయిర్ అంటే మహా ఇష్టం!
నా అదృష్టం ఏమిటంటే.. సుదీర్ఘమైన నా జర్నలిజం కెరీర్లో ఇద్దరినీ పలుసార్లు కలవడం .. పలు ఇంటర్వ్యూలు చేయడం జరిగింది.
ఇక అసలు విషయానికి వస్తే..
2004 సెప్టెంబర్ 20కి అక్కినేనికి 80 ఏళ్లు నిండాయి.
ఈ సందర్భాన్ని అభిమానులు ఓ పండుగలా నిర్వహించారు.
హైదరాబాదులో ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘యువకళావాహిని’ నిర్వాహకుడు, అక్కినేనికి ఆత్మీయుడు అయిన వై.కె.నాగేశ్వరరావు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘అక్కినేని అభినయ వేదం’ పేరిట ఓ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన వేడుకలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆ మర్నాడు అన్నపూర్ణా స్టూడియోలో పాత్రికేయుల మధ్య ఓ చిన్న వేడుకను నిర్వహించి.. ఆ పుస్తకాలను హిట్ పెయిర్ అక్కినేని- వాణిశ్రీల చేతుల మీదుగా మాకు అందించారు.
ఆ సందర్భంగా వీరి నుంచి ఆ పుస్తకాన్ని నేను కూడా స్వీకరించాను…. – మోహన్ గోటేటి
Share this Article