Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !

August 17, 2026 by M S R

.

చావని దేవదాసు… కాలం మారినప్పుడల్లా కొత్తగా పుడుతున్నాడు! ఒక మనిషి చనిపోయాడు. కానీ ఒక పాత్ర చావలేదు. దాదాపు వందేళ్లుగా చచ్చిపోకుండా తిరుగుతూనే ఉంది. పుడుతూనే ఉంది, కొత్త రూపాల్లో, కొత్త కేరక్టరైజేషన్‌తో… జనం కూడా ఇష్టపడుతూనే ఉన్నారు… ఆ పాత్ర పేరు దేవదాసు.

శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన దేవదాస్ నవలలో ప్రేమను కోల్పోయిన ఒక యువకుడు తనను తాను నాశనం చేసుకుంటాడు. మద్యం అతని తోడవుతుంది. తన నిర్ణయాలకంటే తన విషాదాన్నే ఎక్కువగా ప్రేమించే స్థితికి చేరుకుంటాడు. చివరికి పార్వతి ఇంటి గుమ్మం దగ్గర ప్రాణాలు వదులుతాడు. అది అసలు దేవదాసు. ఓ మందు సీసా, పక్కన ఓ కుక్క…

Ads

భారతీయ సినిమా మాత్రం ఆ దేవదాసును అక్కడే వదల్లేదు. సైలెంట్ సినిమా కాలం నుంచి మొదలైన ప్రయాణం… బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా ఎన్నో భాషల్లో తిరిగింది. నటులు మారారు. దర్శకులు మారారు. కాలం మారింది. సినిమా టెక్నాలజీ మారింది.

కానీ దేవదాసు మాత్రం దాదాపు అదే. ప్రేమ విఫలమైంది. పార్వతి దూరమైంది. చంద్రముఖి వచ్చింది. మద్యం మొదలైంది. దేవదాసు కూలిపోయాడు. చివరికి పార్వతి ఇంటి గేటు దగ్గర చచ్చిపోయాడు. దర్శకులు తమ తమ స్టైల్లో కథ చెప్పారు. కానీ ఆ దేవదాసు DNAను పెద్దగా కదపలేదు.

2002లో సంజయ్ లీలా భన్సాలీ వచ్చి ఆ కథకు భారీ సెట్లు, రంగులు, సంగీతం, వైభవం జోడించాడు. కానీ కథలో దేవదాసు మాత్రం దేవదాసుగానే ఉన్నాడు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది.  ఎందుకు?

వందేళ్ల క్రితం రాసిన పాత్రను ఇప్పటికీ అదే మానసిక స్థితిలో ఎందుకు ఉంచాలి? అక్కడి నుంచి అసలు ప్రయోగం మొదలైంది. దేవదాసును చంపకుండా… దేవదాసు స్వభావాన్ని మార్చేశారు. 2009లో అనురాగ్ కశ్యప్ తీసిన Dev.D వచ్చేసింది. ఇది దేవదాసు కథను రీమేక్ చేయలేదు. దేవదాసు అనే భావనను రీమిక్స్ చేసింది. ఇక్కడ దేవ్ కేవలం ప్రేమ విఫలమై మందుకు బానిసైన వాడు కాదు.

అతని పతనంలో అతని అహంకారం ఉంది. అతని తప్పు నిర్ణయాలు ఉన్నాయి. అతని స్వభావం ఉంది. పార్వతి కూడా పాత పారో కాదు. తన జీవితాన్ని తాను ముందుకు తీసుకెళ్లే అమ్మాయి. చంద్రముఖి కూడా ఇక చంద్రముఖి కాదు. ‘చందా’.

అంటే శరత్ చంద్ర రాసిన పాత్రల పేర్లు, కాలం, వాతావరణం, సామాజిక పరిస్థితులు… అన్నింటినీ తీసి పారేసి, ఆ కథలోని మూల సంఘర్షణను మాత్రం పట్టుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఇంకా పెద్ద ట్విస్ట్? పాత దేవదాసులా ఈ దేవ్ చచ్చిపోడు. తన తప్పులు తెలుసుకుంటాడు. కొత్త జీవితాన్ని ఎంచుకుంటాడు.

అంటే మొదటిసారి దేవదాసుకు Redemption వచ్చింది. శరత్ చంద్ర రాసిన ట్రాజెడీకి అనురాగ్ కశ్యప్ ఒక ఎగ్జిట్ ఇచ్చాడు. తర్వాత దేవదాసు కోపంగా మారాడు. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇక్కడ దేవదాసు మరింత మారిపోయాడు. అతని చేతిలో మద్యం ఉంది. మాదకద్రవ్యాలు ఉన్నాయి. ప్రేమ విఫలమైంది. కానీ…

సెల్ఫ్ పిటీ లేదు. అదే పెద్ద మార్పు. అర్జున్ తన బాధను ఏడుస్తూ కూర్చుని అనుభవించడు. కోపంగా మారుస్తాడు. అరుస్తాడు అతని ప్రేమ విఫలం కావడం వ్యక్తిగత విషాదంగా మాత్రమే ఉండదు. సమాజం మీద, పరిస్థితుల మీద, తన చుట్టూ ఉన్న ప్రపంచం మీద అతని ఆగ్రహంగా బయటపడుతుంది.

ఇంకో ఆసక్తికరమైన మార్పు — దేవదాసు మద్యానికి బానిసైనా తన వృత్తిలో మాత్రం అసాధారణమైన నైపుణ్యం కలిగిన సర్జన్. అంటే దర్శకుడు దేవదాసులో ఉన్న self-destructionను తీసుకుని, దానికి rage, ego, aggression, professional brilliance జోడించాడు. పారు కూడా అతని జీవితంలో కేవలం కోల్పోయిన ప్రేమగా మిగలదు. చంద్రముఖి స్థానంలో జియా వస్తుంది. మళ్లీ దేవదాసు చచ్చిపోడు.

అక్కడ కూడా కథ విషాదం నుంచి బయటపడుతుంది. దేవదాసు ట్రాజెడీ కాదు… ప్రేమకథ అవుతుంది. ఇప్పుడు మరీ దారుణంగా మార్చేశారు! అరుణ్ మాథేశ్వరన్ DCతో వచ్చాడు. ఇక్కడ మాత్రం దేవదాసు DNA మాత్రమే మార్చలేదు. బాడీనే మార్చేశాడు!

DCలో లోకేష్ కనగరాజ్ దేవదాస్‌గా, వామికా గబ్బి చంద్రగా నటించారు. పార్వతిగా సంజన కృష్ణమూర్తి కనిపిస్తుంది. సినిమా ఆగస్టు 7న విడుదలైంది. ఇది ఇక విషాద ప్రేమకథలా కనిపించదు. ఇది Crime. Revenge. Violence. Romance. దేవదాస్ ఒక రఫ్, డార్క్ క్యారెక్టర్.

చంద్ర ఇక బార్‌లో కూర్చుని దేవదాసు బాధ వింటూ ఓదార్చే చంద్రముఖి కాదు. ఆమె కూడా ఈ చీకటి ప్రపంచంలో భాగమే. పార్వతి?

ఈసారి ఆమె కథలో కేంద్రం కాదు. అంటే శరత్ చంద్ర కథలోని ప్రేమ త్రిభుజాన్నే తీసుకుని…

ఒకడు psychological drama చేశాడు.

మరొకడు raw romantic drama చేశాడు.

ఇంకొకడు dark action thriller చేశాడు.

అందుకే ఈ మూడు సినిమాల మధ్య ఒక అద్భుతమైన సంబంధం కనిపిస్తుంది.

Dev.D — దేవదాసుకు Redemption ఇచ్చింది.

Arjun Reddy — దేవదాసుకు Rage ఇచ్చింది.

DC — దేవదాసుకు Revenge ఇచ్చింది.

మరి జనం వీటిని ఎందుకు చూస్తున్నారు? ఇక్కడే అసలు కథ ఉంది. ఎందుకంటే ప్రేక్షకుడు దేవదాసు కథను కాదు… తన కాలానికి సంబంధించిన దేవదాసును చూస్తున్నాడు. శరత్ చంద్ర కాలంలో దేవదాసు ఒక సామాజిక వ్యవస్థకు బలైన యువకుడు. తర్వాతి తరాల సినిమాల్లో అతను ప్రేమలో ఓడిపోయిన విషాద నాయకుడు.

Dev.Dలో అతను తన నిర్ణయాలతో తన జీవితాన్ని నాశనం చేసుకునే ఆధునిక యువకుడు. Arjun Reddyలో అతను ప్రేమ కోల్పోయిన తర్వాత ప్రపంచం మీదే యుద్ధం చేసే అగ్రెసివ్ మేల్. DCలో అతను ప్రేమ, నేరం, హింస, ప్రతీకారం మధ్య తిరిగే యాంటీ హీరో.

పాత్ర అదే. కాలం మారింది. అందుకే దేవదాసు కూడా మారాడు. ఇదే ఈ పాత్రకు ఉన్న అసలు గొప్పతనం. క్లాసిక్‌ను గౌరవించడం అంటే దాన్ని ముట్టుకోకపోవడమా? 

అది పెద్ద అపోహ. ఒక క్లాసిక్‌ను యథాతథంగా మళ్లీ తీయడం ఒక రకమైన గౌరవం. కానీ…

దాని ఆత్మను పట్టుకుని, దాని శరీరాన్ని పూర్తిగా మార్చడం మరో స్థాయి ధైర్యం. అక్కడ దర్శకుడికి కరేజ్ కావాలి. రచయితకు ఇంటెలిజెన్స్ కావాలి. ప్రేక్షకుడి అభిరుచిని అర్థం చేసుకునే సెన్స్ కావాలి. అన్నింటికంటే…

‘ఇది దేవదాసు కథ కదా… కాబట్టి దేవదాసులాగే తీయాలి’ అనే భయాన్ని వదిలేయాలి. అనురాగ్ కశ్యప్ ఆ భయాన్ని వదిలేశాడు. సందీప్ రెడ్డి వంగా వదిలేశాడు. అరుణ్ మాథేశ్వరన్ అయితే… అసలు దేవదాసును చూసి ‘ఇదేం చేయగలం?’ అనకుండా, ‘దీన్ని ఏం చేయలేం?’ అని ఆలోచించినట్టున్నాడు.

అందుకే ఈ మూడు సినిమాలు ఒకే కథకు మూడు రీమేకులు కావు. మూడు కాలాల దేవదాసులు. ఒకడు తన తప్పుల నుంచి బయటపడ్డాడు.

ఒకడు తన ప్రేమ కోసం ప్రపంచంతో పోరాడాడు.

మరొకడు తుపాకీ పట్టుకుని తిరిగాడు.

అయినా ముగ్గురిలోనూ ఎక్కడో ఒకచోట…

దేవదాసే ఉన్నాడు. అందుకే దేవదాసు చనిపోలేదు. పార్వతి ఇంటి గేటు ముందు చచ్చిపోయినది శరత్ చంద్ర దేవదాసు మాత్రమే. సినిమా మాత్రం అతన్ని ప్రతిసారీ తిరిగి బతికిస్తోంది. కాలం మారినప్పుడల్లా కొత్త బట్టలు వేస్తోంది.

కొత్త కోపం ఇస్తోంది.

కొత్త ప్రేమ ఇస్తోంది.

కొత్త పాపాలు ఇస్తోంది.

కొత్త విముక్తి ఇస్తోంది.

అంతిమంగా…

దేవదాసు ఒక కథ కాదు. భారతీయ సినిమా తన కాలాన్ని పరీక్షించుకునే ఒక ప్రయోగశాల. అందుకే వందేళ్ల తర్వాత కూడా… దేవదాసు చావడు. దర్శకుడు మారిన ప్రతిసారీ కాలానికి అనుగుణంగా మారుతూ మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !
  • పార్టీలో అప‘స్వరాలు ! ఔట్ స్పోకెన్ రేవంత్ అసాధారణ నిశ్శబ్దం !
  • కృష్ణ, విజయనిర్మల … డెయిలీ పేపర్ల కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి !!
  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
  • Viral Mansi Sherni – ‘మోనాలిసాతో పోల్చితే మర్యాద దక్కదు సుమా’
  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!
  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…
  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions