.
టాలీవుడ్‌లో కులవివక్ష, ఆధిపత్య ధోరణులు ఎప్పటి నుంచో చర్చనీయాంశాలే… ప్రత్యేకించి అగ్రవర్ణాల పెత్తందారీ పోకడలు… తొక్కేస్తారనే భయంతో బాధితుల్లో బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినా… ఇప్పుడిప్పుడే గొంతులు కొన్ని వినిపిస్తున్నాయి… భయం వీడి వివక్షను బయటపెడుతున్నాయి…
మొదట్లో రెడ్లు- కమ్మలు… తరువాత కమ్మల ప్రాబల్యం… దాసరి నుంచి చిరంజీవి- అల్లు అరవింద్ దాకా కాపులు… కృష్ణంరాజు నుంచి ప్రభాస్ దాకా రాజులు… 24 క్రాఫ్ట్స్‌లో ప్రధానంగా బ్రాహ్మణులు… మళ్లీ వీళ్లందరూ ఆంధ్రా… ఇలాంటి చర్చలు ఫిలిం సర్కిళ్లలో నడుస్తూనే ఉంటాయి…
Ads
ఇతర కులాలు, తెలంగాణ కళాకారులు, ఇతర భాషల ఆర్టిస్టుల మెరిట్ క్రమేపీ బలం పుంజుకునే కొద్దీ చాలా కుల సిండికేట్లు దెబ్బతింటున్నాయనే చర్చ కూడా సాగుతూ ఉంది… కన్నడ, తమిళ, మలయాళ దర్శకులు, ఆర్టిస్టుల ప్రభావం, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన కళాకారుల హవా తెలుగు ఇండస్ట్రీ మీద కూడా పడుతూ ఈ తెలుగు కుల పెత్తనాల్లో మార్పు వేగంగానే కనిపిస్తోంది కూడా… (లింగ వివక్ష- దోపిడీ మరో పెద్ద సబ్జెక్టు)…
సినిమాల్లో కూడా అగ్రవర్ణాల పాత్రలే అధికంగా ఉండేవి… ఇప్పుడు తప్పనిసరై వివిధ సామాజికవర్గాల, అణగారిన వర్గాలకు చెందిన పాత్రల్ని కూడా ప్రధాన పాత్రలుగా పెద్ద హీరోలు చేయాల్సి వస్తోంది, చేస్తున్నారు, చేయాల్సిందే… ఐతే, ఇప్పటికీ ఈ కులవివక్ష బాగానే ఉందా..? ఉందనే అంటున్నాడు నటుడు రవికృష్ణ… తన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరం… బుల్లితెరపై సీరియల్స్, రియాల్టీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఈ రవికృష్ణ…
‘విరుపాక్ష’ సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చాడు… ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగానే ఉన్నాడు… ఇండస్ట్రీలో కులం పిచ్చి ఉందని, తన కులం కారణంగా ఎన్నో ఆఫర్లు మిస్ అయినట్లు చెప్పుకొచ్చాడు రవి… బహుశా తను విజయవాడకు చెందిన యాదవ్ కావచ్చు… (కొన్నాళ్లుగా టీవీ నటి నవ్య స్వామితో ప్రేమబంధం ఉన్నట్టుంది)…
‘కులం అనేది ఏ రంగంలోనైనా దాగి ఉన్న సమస్యే… నేనయితే కులం కారణంగా కెరీర్ స్టార్టింగ్‌లో ఇబ్బంది పడ్డాను… అన్నీ మాట్లాడేసి, సెలక్ట్ అయ్యి… అంతా అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ చెయ్యడానికి చాలా డిటెయిల్స్ తీసుకుంటారు. అప్పుడు ఆధార్ కార్డులో పూర్తి పేరు, చిరునామా చూసి… మా అబ్బాయి అనుకున్నాం, కాదా? సరే, మళ్ళీ చెబుతాం అని అనేవారు…
అదేంటి సర్, అగ్రిమెంట్ అని పిలిచారు కదా అని అడిగితే… అవును, మీకు తరువాత మళ్లీ ఇన్ఫార్మ్ చేస్తాం అని చెప్పేవారు. అలా నాకు మూడు, నాలుగు ప్రాజెక్టులు పోయాయి… ఇంకోవిషయం ఏంటంటే… కొందరు డైరెక్ట్‌గా నో అని చెప్పడానికి ఇబ్బంది పడి, ఫస్ట్ హీరో క్యారెక్టర్ అనుకున్నాం కదా, హీరో కాదు- హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనేవారు… పర్వాలేదు సర్, ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా చేస్తాను అంటే… లేదు, హీరో కంటే నువ్వు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నావంటూ, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ ప్రాజెక్టుకి చూద్దాం అనేవారు’ అంటూ చెప్పుకొచ్చాడు రవి…
తప్పేమీ లేదు, ఉన్నదే చెప్పాడు, ఇవన్నీ చెబితే తనను ఇంకా తొక్కేస్తారని భయపడకుండా కొొన్ని నిజాల్ని వెల్లడిస్తున్నాడు… మంచిదే… ఎవరో ఒకరు మాట్లాడాలి కదా మరి !!
Share this Article