.
( యండమూరి వీరేంద్రనాథ్ )…. ఇంటర్వ్యూ బోర్డులో నలుగురు సభ్యులు ఉన్నారు. అందరూ పెద్ద వ్యాపారవేత్తలూ, చదువుకున్నవారే. మార్కెటింగ్ వ్యూహాలు, వినియోగదారుల మనస్తత్వంపై ఒక్కొక్కటిగా ప్రశ్నలు వచ్చాయి.
“అంబుష్ మార్కెటింగ్ అంటే ఏమిటి?” కళ్లద్దాలు సరి చేసుకుంటూ అడిగాడు మధ్యలో కూర్చున్న సభ్యుడు.
“రెండు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతున్నప్పుడు, మొదటి రెండు మ్యాచ్‌లలో పెర్-ఫ్యూమ్, సిమెంట్, చివరికి కండోమ్ ప్రకటనలు వస్తున్నాయనుకుందాం. మూడో మ్యాచ్ వచ్చేసరికి దాని ప్రత్యర్థి బ్రాండ్ కూడా అకస్మాత్తుగా రంగంలోకి దిగటం మనం గమనించవచ్చు. దాన్నే ‘అంబుష్ మార్కెటింగ్’ అంటారు”
Ads
“సగం సిరీస్ అయిపోయాక, ఎందుకలా మధ్యలో రంగంలోకి దిగటం?”
“కోట్లు ఖర్చు పెట్టి ఒక సంస్థ సీరీస్ ని స్పాన్సర్ చేస్తే, అది గుత్తాధిపతి అవుతుంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆ వేడుకలోని వెలుతురును మన బోర్డుపై కూడా పడేలా చేసుకోవడమే ఆ౦బుషింగ్.”
బోర్డు సభ్యులు ఒకరినొకరు చూసుకున్నారు. శంభుమిత్ర కొనసాగించాడు. “ఒక వీధి మొదట్లో ఒకే పేద్ద బంగారం దుకాణం భారీ బోర్డు ఉంటే, ఆ ప్రాంతంలో ‘బంగారం’ అనగానే అదే పేరు గుర్తుకు వస్తుంది. కానీ దాని పక్కనే మరో చిన్న దుకాణం బోర్డు పెట్టినా సరే, కొనుగోలుదారుడు కనీసం ఒక్క క్షణమైనా రెండింటి మధ్య ఆలోచిస్తాడు..”
“ఈ పోటీ తత్వం క్రికెట్ మ్యాచ్‌లలోనే ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది? టీవీ సీరియల్స్ మధ్యలో కూడా ప్రకటనలు వస్తాయి కదా. ఈ పోటీ అక్కడ ఎందుకు ఉండదు?”
“సీరియల్స్ పై ప్రేక్షకుడికి పెద్ద ఏకాగ్రత ఉండదు. మ్యాచ్ లో అడ్రినలిన్, కార్టిసాల్ స్థాయిలు పెరిగి, డోపమైన్ ప్రభావం చురుగా ఉండటం వాళ్ళ, కళ్ళ ఎదురుగా కనిపించిన ప్రకటన కన్స్యూమర్ మనసులో బలంగా ముద్రపడుతుంది. మార్కెటింగ్‌కు కావలసింది అదే కదా.”
“Strategic Liability Transfer అంటే ఏమిటి?”
శంభుమిత్ర చిరునవ్వుతో “ఒక నిరర్ధక ఉన్నతోద్యోగిని మనంతట మనం తొలగిస్తే గ్రాట్యుటీ, పి.ఎఫ్. వగైరాలు భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అతనికి వరుసగా రెండు ప్రమోషన్లు ఇచ్చి, అతడో అపూర్వ ప్రతిభావంతుడనే భ్రమను మార్కెట్లో సృష్టిస్తే, ప్రత్యర్థి సంస్థ అతన్ని మరింత పెద్ద జీతంతో తీసుకుంటుంది. మన లైబిలిటీని ఇలా ప్రత్యర్థి సంస్థకు అంటగట్టడాన్ని SLT అంటారు” సమాధానమిచ్చాడు.
“ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే?” చివరి ప్రశ్న అడిగాడు చైర్మన్…
“మార్కెట్లోకి కొత్త పోటీదారు వచ్చినప్పుడు, మన ప్రోడక్టు ధర భారీగా తగ్గించి, అతడి పెట్టుబడి పూర్తిగా కరిగి పోయి మార్కెట్ నుంచి వెళ్లి పోయేలా చేసి, పోటీదారు వెళ్లిపోయాక మన నష్టాన్ని పూడ్చుకోవటానికి ధరని మరింత పెంచాటాన్ని, ‘కిల్ ది కాంపిటిషన్ ప్రైసింగ్’ అంటారు సర్”.
గదిలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం నెలకొంది. సభ్యులు తమ ముందున్న కాగితాలపై ఏదో వ్రాసుకు౦టున్నారు.
“థాంక్యూ, మిస్టర్ శంభుమిత్ర” అన్నాడు చైర్మన్…. (మీ స్పందనకు, పుస్తకం కోసం yandamoori@hotmail.com )
Share this Article