Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సినిమా తరువాత ‘రష్మి’ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించినట్టు లేదు!!

September 5, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … నలుగురు “ఆమె”ల కధ 1993 లో వచ్చిన ఈ లేడీస్ స్పెషల్ సినిమా . దిగువ మధ్య తరగతి మహిళల సినిమా కష్టాలే ఈ సినిమా . ఈ ఆమెల అనుభవాలన్నీ మనందరికీ తెలిసినవే . మన చుట్టూ జరుగుతున్నవే . సంసారాలలో మగ మహారాజుల దాష్టికాలు , అత్తల ఆరళ్ళు , మూఢ మూర్ఖత్వాలు , అనుమానపు మొగుళ్ళు , ఏమీ సహకారం ఇవ్వకపోగా సతాయించే మొగుళ్ళు , ఇన్నీ భరించి పనిచేసే చోటికి పోగానే ఆడవాళ్ళని చులకనగా చూసే మగ మేనేజర్ పీనుగులు , వెరశి ఈ సినిమా .

అనగనగా ఓ సూపర్ మార్కెట్ . అందులో నలుగురు ఆమెలు పనిచేస్తుంటారు . ఒక్కొక్కరిది ఒక్కో సినిమా కధ . వాటన్నింటినీ అధిగమిస్తూ మర మనుషుల్లాగా బతుకు జట్కా బండ్లను ఈడుస్తుంటారు .‌ ఆ షాపుకో దొంగ మేనేజర్ . అతను షాపులో సరుకు దొంగతనంగా అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు .‌ అప్పుడప్పుడు కేష్ కౌంటర్లో డబ్బును కూడా ఎత్తేసి అమాయక యువతుల మీద నెడుతుంటాడు .

Ads

షాప్ అమ్మకాలు పడిపోవటంతో హెడ్డాఫీస్ వారు వన్ మన్త్ నోటీస్ సర్వ్ చేస్తారు . నలుగురూ కలిసి మేనేజర్ పీనుగును ఓ నెల పాటు కిడ్నాప్ చేయటానికి ప్లాన్ చేస్తారు . ఈలోపు అతనికి కూడా కొన్నాళ్ళు దాక్కోవలసిన అవసరం ఏర్పడుతుంది . దానితో వాళ్ళకు అతన్ని ఎత్తేయటం ఈజీ అవుతుంది . నలుగురిలో ఒకరయిన రష్మి (?!) ఇంట్లో దాచిపెట్టి షాప్ అమ్మకాలను పెంచుతారు .‌

ఈ ప్రయత్నంలో ఆ నలుగురికి హీరో సురేష్ సహకరిస్తాడు . క్లైమాక్సులో సూపర్ మార్కెట్ చైర్మన్ దిగిపోవటం , అతనికి అప్పటికే అన్ని విషయాలు తెలిసి ఉండటంతో మేనేజర్ పీనుగుని డిప్రమోట్ చేసి ఆ నలుగురిలో ఒకరయిన వాణీ విశ్వనాధుని మేనేజరుగా నియమించి అందరి జీతాలను పెంచటంతో సినిమా శుభాంతం అవుతుంది .

సినిమా కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు , దర్శకత్వం అన్నీ జంధ్యాలే .‌ దానితో సీరియస్ కధకు హాస్యాన్ని కూడా జోడించి గబగబా లాగించేస్తాడు సినిమాను . జంధ్యాల అనగానే కొన్ని హాస్య పాత్రలకయినా ప్రత్యేక మేనరిజాలను జొప్పించి ప్రేక్షకులకు గుర్తుండేలా చేస్తారు .

అలా గుర్తుండిపోయే పాత్ర శ్రీలక్ష్మిది . తనకొచ్చిన పెళ్ళి సంబంధాల వారిని వారి వారి సీరియల్ నంబరుతో సహా గుర్తు పట్టి వాళ్ళకు పెళ్ళిచూపుల్లో పెట్టిన తినుబండారాలు , గాత్రాలు , వగైరా అన్నీ గుర్తు చేస్తుండే పాత్ర . ప్రేక్షకులు మరచిపోలేరు .

నలుగురు “ఆమె”లుగా వాణీ విశ్వనాథ్ , దివ్యవాణి , సంధ్య , రష్మి నటించారు . హీరోగా సురేష్ , షాప్ మేనేజరుగా సుత్తి వేలు , షాపులో మగ గుమస్తాగా ధర్మవరపు , సూపర్ మార్కెట్ చైర్మనుగా దాసరి నారాయణ రావు నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం , అశోక్ కుమార్ , అశోక్ రావు , జెన్నీ , సుబ్బరాయ శర్మ , అతిధి పాత్రలో రాజేంద్రప్రసాద్ , కోట శ్రీనివాసరావు  తదితరులు నటించారు .

వాసూరావు సంగీత దర్శకత్వంలో సినారె , వేటూరి , జొన్నవిత్తుల వ్రాసిన పాటల్ని సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం , శైలజ , చిత్ర , మురళీకృష్ణ , స్వర్ణలత శ్రావ్యంగా పాడారు . ఐకానిక్ సాంగ్ స్త్రిజన్మ ఎంత మోహనం అది ఇలకే శోభనం చాలా శ్రావ్యంగా ఉంటుంది . పాటకు ఉపోద్ఘాతంగా అందరికీ తెలిసిన కార్యేషు దాసీ అనే పద్యాన్ని సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు . ఎంతయినా జంధ్యాల కదా !

హంసనాదమో పిలుపు అంటూ సాగే సురేష్ , వాణీ విశ్వనాధుల మీద డ్యూయెట్ బాగుంటుంది . నలుగురు ఆమెలు షాపునే జనంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు పాడే పాట భలే మంచి చౌక బేరము బాగుంటుంది . రష్మి , సుత్తి వేలుపై ఇంటి కాడ నిలవలేని అంటూ సాగే పాట సరదాగా సాగుతుంది .

ఇప్పుడు ఈ సినిమాను చూసేవారికి 1994 లో వచ్చిన ఆడవాళ్ళకు మాత్రమే అనే సినిమా గుర్తుకొస్తుంది . ఇందులో కూడా మేనేజర్ని కిడ్నాప్ చేస్తారు మహిళా ఉద్యోగులు . సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు .

మహిళలు కార్యసాధనలో మగవారికి ఏమీ తీసిపోరు అని , సవాలు ఎదురయితే మగవారి కన్నా మెరుగైన ఫలితాలను సాధించగలరు అనే సందేశాలను అందించే ఆరోగ్యకరమైన వినోదాత్మక సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసినా మరలా చూడతగ్గ సినిమాయే . మహిళా దినోత్సవం రోజున ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది ఈ సినిమా .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ సినిమా తరువాత ‘రష్మి’ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించినట్టు లేదు!!
  • ఉచ్చకు హిమాలయాలే కరిగిపోతున్నాయట! ఓ స్టడీ చెబుతోంది!!
  • కీలకాంశాల్లోనూ కేసీయార్ వాయిస్‌లో లోపించిన విజ్ఞత!
  • ఎంతగా బుర్ర చించుకున్నా- ఈ హోదా ఏమిటో అర్థం కాలేదు !!
  • ప్రతి లిక్కరూ విస్కీ కాదు – ప్రతి మద్యానికీ ఓ కథ ఉంది
  • గుండు గీకే ప్రోగ్రామ్ వద్దులే అమ్మాయ్… సినిమా సోసో, నువ్వు పాస్…
  • నింగి నుంచి నిశిత పరిశీలన- నిఘా… మన స్పై శాటిలైట్ విశేషాలివిగో…
  • అబ్బా… ఏం రీసెర్చ్‌రా బాబూ! 2026 ఇగ్ నోబెల్ విచిత్రాలు!!
  • ప్రతిపక్ష నేతగానూ పనికిరావ్… కేసీయార్‌‌పై ఇదోరకం అభిశంసన!
  • SLT – మనకు పనికిరాని ఉద్యోగిని ప్రత్యర్థికి అంటగట్టడం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions