Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?

November 7, 2026 by M S R

.

ఒకప్పుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అంటే అదో సంచలనం. పాట విడుదల కాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకేవి. ట్యూన్ మొదలైతే చాలు.. శ్రోతలను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే మాయాజాలం అతడి సొంతం. ఆస్కార్ అవార్డులు, గ్రామీలు, అంతర్జాతీయ గుర్తింపు.. భారతీయ సినిమా సంగీతాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఘనతలో రెహమాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? చేతి నిండా సినిమాలు, ఆల్బమ్‌లు ఉన్నాయి. అవకాశాలకు కొదవ లేదు. అయినా ఒకప్పటి సంగీతపు పస మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తనకు మతం కారణంగా అవకాశాలు రావడం లేదంటూ శోకాలు కూడా!

Ads

తాజాగా రామాయణ సినిమాకు రెహమాన్ అందించిన సంగీతం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. వేల కోట్ల భారీ ప్రాజెక్టు. భారతీయులందరికీ సుపరిచితమైన ఇతిహాసం. రాముడు, సీత పాత్రల్లో రణబీర్ కపూర్, సాయిపల్లవి. ఇలాంటి సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం ఏ సంగీత దర్శకుడికైనా గొప్ప గుర్తింపే. కానీ పాటలు విడుదలైన తర్వాత ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ‘మంగళ్ రంగ్’ పాటలో గతంలో తాను చేసిన ‘కున్ ఫయా కున్’ ఛాయలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు… తమిళంలో గతంలో వచ్చిన ‘ఎన్న సొల్ల పోగిరాయ్’ ట్యూన్‌ను గుర్తు చేస్తోందంటూ కొందరు పోలికలు తీశారు…. పాటలో ఖవ్వాలీ తరహా సంగీత ప్రయోగంపైనా అభ్యంతరాలు వచ్చాయి…

ప్రయోగాలు చేయడం రెహమాన్‌కు కొత్తేమీ కాదు. కొత్త శబ్దాలు, కొత్త వాద్యాలు, భిన్నమైన సంగీత శైలులను కలపడం అతడి ప్రత్యేకత. కానీ ప్రయోగం పేరుతో పాత అనుభూతినే మళ్లీ అందిస్తే ప్రేక్షకులు ప్రశ్నించకుండా ఉంటారా? ముఖ్యంగా రామాయణం వంటి ఇతిహాసానికి సంగీతం అందించేటప్పుడు ప్రేక్షకుల అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

ఇక్కడ విమర్శలన్నీ సమంజసమేనని చెప్పలేం. ఖవ్వాలీ ప్రభావం ఉందని చెప్పగానే అది తప్పయిపోదు. కానీ ఆ సంగీతం కథకు, సందర్భానికి ఎంతవరకు సరిపోయిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. అదేమంటే, విమర్శించినవారే రేపు మెచ్చుకుంటారులే అని డొల్ల కవరింగ్ సమర్థన…

గతంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో గత ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గడానికి పరిశ్రమలో వచ్చిన అధికార మార్పులే కారణమై ఉండొచ్చని, అందులో మతపరమైన కోణం కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. అయితే అది తనకు నేరుగా తెలియదని, ఇతరుల ద్వారా వినిపిస్తోందని కూడా చెప్పాడు. ఇది మరో దిక్కుమాలిన కవరింగ్… తనకు పని కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదని, తన నిజాయితీకి తగిన పని తన దగ్గరకు రావాలని కోరుకుంటానని అన్నాడు.

సరే.. వివక్ష ఉందా లేదా అన్నది వేరే చర్చ. ఒక కళాకారుడికి పరిశ్రమలో ఎదురయ్యే అనుభవాలను కొట్టిపారేయలేం. కానీ ఇదే సమయంలో రెహమాన్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల జాబితా చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఒక పోస్టర్‌లో ఏకంగా 17 సినిమాలు, ఆల్బమ్‌ల పేర్లు కనిపిస్తున్నాయి.

rehman

తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వరుస అవకాశాలు ఉన్నాయి. ఇంజి వెల్లం, దిల్కషీ, మీరా నాయర్ ప్రాజెక్టు, ఇమాజినరీ రైన్, కిల్లర్, ఖోజ్, జీనీ, మసూమ్, రామాయణం పార్ట్-2, కర్ణ, ధనుష్-మారి సెల్వరాజ్ సినిమా, తాల్-2.. ఇలా జాబితా పెద్దగానే ఉంది. వీటిలో కొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, మరికొన్ని ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. అవకాశాల పరంగా రెహమాన్ ఖాళీగా ఉన్నాడని లేదు.

నిజంగానే మతం కారణంగా అవకాశాలు రాకపోతే ఇన్నాళ్లూ ఈ సమాజం ఇచ్చిన దానికి విలువేమిటి..? ఇన్ని అవకాాశాలు చేతిలో ఉండీ ఏడుపు దేనికి..? ఇదీ అసలు ప్రశ్న… వచ్చిన అవకాశాలకే న్యాయం చేయలేని పర్‌ఫామెన్స్‌తో… అనిరుధ్, డీఎస్పీ వంటి తరంగాలు ముంచెత్తుతున్నప్పుడు, ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి..? పైగా చాన్సులన్నీ తనకే రావాలనే కోరిక ఏమిటి..?

ఒకప్పుడు రెహమాన్ పాట వస్తోందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్సాహం వేరు. రోజా, బొంబాయి, దిల్ సే, రంగీలా, తాళ్, లగాన్, జోధా అక్బర్, స్లమ్‌డాగ్ మిలియనీర్.. ఇలా ఎన్నో సినిమాల్లో అతడి సంగీతం ప్రత్యేకమైన ముద్ర వేసింది. కొత్తదనం, మెలోడీ, ప్రయోగం.. అన్నీ కలగలిసిన ఆ సంగీతం ఇప్పటికీ శ్రోతలను వెంటాడుతూనే ఉంది. ఆ స్థాయి అంచనాలు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ అదే స్థాయిలో కొత్త సంగీతాన్ని అందించాల్సిన బాధ్యత కూడా అతడిపైనే ఉంది. అక్కడే ఫెయిల్ అవుతున్నాడు…

అతడి కొత్త పాటలను పాత పాటలతో పోలుస్తున్నారు ఇప్పుడు. కొత్తగా ఏదైనా వినిపిస్తాడని ఎదురుచూస్తున్నారు సంగీత ప్రియులు. ఆ అంచనాలను అందుకోలేకపోతే విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంగీత దర్శకుడికి ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదు. కానీ ప్రతి విమర్శ వెనుక తను మతపరమైన వివక్షను వెతకడం మాత్రం చర్చకు తావిస్తోంది. సంగీతం నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు శ్రోతలకు ఖచ్చితంగా ఉంది. ఆ విమర్శను స్వీకరించడమూ కళాకారుడి పరిణతిలో భాగమే. అదే లోపించింది రెహమాన్‌లో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?
  • స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…
  • వీడియోకాన్ – దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతి పెద్ద దివాలా కేసు !
  • రామాయణ సినిమా మాత్రమే కాదు… ఈ మహాభారతం ఘనత కూడా చదవండి!
  • మరీ అంత ‘సీన్’ లేదు ! సో సో… అక్కడక్కడా బాగున్నట్టు అనిపిస్తుంది !!
  • ఔను… రామాయణంతోపాటే రావణాయణం కూడా… తప్పేముంది..?
  • వై నాట్ సిద్దిపేట..? ఏదీ ఎవరికీ కోట కాదు..! రేవంత్ చెబుతున్నది ఇదే..!!
  • సోషల్ మీడియా దిగ్గజాలకు భారత్ నుంచి కొత్త సవాల్ !
  • ఆ ‘ముగ్గురూ’ ప్లస్ ఆదానీ… విజయ్‌తో త్రిష… ఫోటో బాగుంది మాస్టారూ..!!
  • మన DNA లోనే రామాయణం ! – మన కుటుంబాల్లోనూ అవే పాత్రలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions