Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సరిగమలు! ఓ విశ్వనాథ్ తీయాల్సిన సినిమా ఓ రాఘవేంద్రరావు తీస్తే..?

September 6, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … గొప్ప సంగీతాత్మక చిత్రం 1993 లో వచ్చిన ఈ సరిగమలు . సినిమా ప్రేమికులలో ఎంత మంది ఈ సినిమాను చూసారో నాకు తెలియదు . కానీ తప్పక చూడతగ్గ సినిమా . ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు క్రాంతి కుమార్ .

మళయాళంలో అవార్డుల వానలో మునిగిపోయిన సర్గమ్ సినిమాకు రీమేక్ మన సరిగమలు . మళయాళంలో నటించిన వినీత్ , మనోజ్ కె జయన్ , రంభలే తెలుగులో కూడా నటించారు .‌ మళయాళంలో రంభకు ఇదే తొలి సినిమా . తెలుగు సినిమాకు దర్శకత్వాన్ని బాలీవుడ్ సంగీత దర్శకుడు రవి అద్భుతంగా అందించారు . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ , పాటల మ్యూజిక్ రెండూ అద్భుతం .

Ads

వేటూరి పాటలనన్నీ గొప్పగా వ్రాసారు . అంతే శ్రావ్యంగా పాడారు బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , చిత్ర . జేసుదాస్ మూడు పాటల్ని పాడారు . వాటిల్లో ఒకటి త్యాగరాజ విరచిత కృతి రాగ సుధా రస పానము జేసి రాజిల్లవే మనసా . ఎంత శ్రావ్యంగా పాడారో !

మరో పాట స్వరరాగ గంగా ప్రవాహమే . మూడవది కృష్ణ కృపా సాగరం వేణు సుధా సేవనం జయదేవ కృతం జన మోక్షకరం . అద్భుతమైన చిత్రీకరణ కూడా . చాలామంది మళయాళీలు అనగానే అయ్యప్ప భక్తులు అనుకుంటారు . గొప్ప కృష్ణ భక్తులు . గురువాయూర్ వెళితే శ్రీకృష్ణుని దేవాలయ నిర్వహణ ఎంత గొప్పగా ఉంటుందో కనులారా చూడవచ్చు .

సంగీతమే సరస సల్లాపమే అనే పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . ఇవి కాకుండా వినీత్ , రంభ మీద సాగే డ్యూయెట్ సరిగమలు ఆపవయ్యా సరసన చేరవయ్యా కూడా బాగుంటుంది . ఇవన్నీ కాకుండా చిన్న చిన్న పాటలు కూడా ఎంతో శ్రావ్యంగా ఉంటాయి .

టూకీగా కధ ఏంటంటే : గోదావరి జిల్లాలో ఓ గ్రామంలో ఓ రాజు గారు . కళాపోషకులు . ఎక్కడపడితే అక్కడ కళావతులను పోషిస్తూ ఉంటాడు . ఆయన భార్య భారతి అందరికీ గౌరవనీయురాలు .‌ వారి కుమారుడు చిన్నప్పటి నుంచి మూర్ఛ రోగ బాధితుడు . మనోజ్ కె జయన్ అనే మళయాళ నటుడు ఈ పాత్రను పోషించాడు .‌ కోపిష్టి , అవేశపరుడు .

అతనికో విశ్వాసపాత్రుడయిన స్నేహితుడు . వినీత్ ఈ పాత్రను పోషించాడు .‌ బహుశా తెలుగులో అతనికి ఇదే మొదటి సినిమా అనుకుంటాను .‌ ఇతనికి స్నేహితుడే లోకం . వినీత్ , మనోజ్ బంధువుల అమ్మాయి అయిన రంభ ప్రేమించుకుంటారు . వివాహం అయితే మూర్ఛ రోగం తగ్గుతుందనే భావనతో తల్లి అతని వివాహాన్ని రంభతో నిర్ణయిస్తుంది .

వినీత్ , రంభ ప్రేమ గురించి సమాచారం ఉన్న మనోజ్ తల్లి (సీనియర్ నటి భారతి నటించింది ఈ పాత్రను) వినీత్ ను ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపొమ్మని చెపుతుంది . మనోజ్ , రంభ వివాహం జరిగినా దాంపత్యం పొసగదు . వినీత్ , రంభ ప్రేమ గురించి తెలుసుకున్న మనోజ్ ఆత్మహత్య చేసుకుంటాడు . రంభ పక్షవాతానికి గురవుతుంది . భారతి మనోవేదనతో మంచం పట్టుతుంది .

ఊరు వదిలి వెళ్ళిపోయిన వినీత్ దేశంలోనే గొప్ప సంగీత విద్వాంసుడిగా పేరు గడిస్తాడు . భారతి అభ్యర్ధన మేరకు గ్రామానికి తిరిగొచ్చిన వినీత్ కు ఇక్కడ పరిస్థితులన్నీ తెలుస్తాయి . క్లైమాక్సులో వినీత్ పాటకు రంభలో చలనం వస్తుంది . భారతి చనిపోతూ వినీత్ , రంభ చేతులను కలుపుతుంది . సినిమా ముగుస్తుంది .

ప్రధాన పాత్రల్లో ఈ నలుగురితో పాటు జె వి సోమయాజులు , ప్రసాద్ బాబు , సుత్తి వేలు , పి జె శర్మ , శారదాప్రీతి , నాగమణి , అల్లు రామలింగయ్య , నారాయణరావు , మల్లికార్జున రావు  తదితరులు నటించారు .‌ డైలాగులను గణేష్ పాత్రో బాగా వ్రాసారు . మళయాళ మాతృక కాబట్టి కధను హరిహరన్ వ్రాసారు .
ఈ సంగీతాత్మక సినిమా యూట్యూబులో ఉంది . రస హృదయులు , ముఖ్యంగా సంగీత ప్రియులు తప్పక చూడతగ్గ సినిమా .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సరిగమలు! ఓ విశ్వనాథ్ తీయాల్సిన సినిమా ఓ రాఘవేంద్రరావు తీస్తే..?
  • సూపర్‌స్టార్ రజినీకాంత్ అహం పూర్తిగా బద్ధలైన ఆ సందర్భం..!!
  • రేవంత్ రెడ్డిని ‘అండర్ ఎస్టిమేట్’ చేశారు – అడ్డంగా బుక్కయ్యారు !!
  • వావ్ గుజ్జూస్- ఏదైనా మాయ చేయగలరు… 8542 వోట్లు- ఖర్చు 290 కోట్లు !!
  • హోర్ముజ్ మాత్రమే కాదు – జిబ్రాల్టర్ జలసంధీ జియోపాలిటిక్స్ కేంద్రమే!!
  • మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…
  • Just డేటా సెంటర్ కాదు… తెలంగాణ భవిష్యత్తుకు ‘కంప్యూట్ పవర్’!
  • సారూ, ఒక్కరిని… ప్లీజ్ ఇలాంటి ఒక్క గురువును చూపించండయ్యా…
  • ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు- వైవిధ్యం తక్కువ ! తెలిసిన మొహాలూ తక్కువ !
  • ఉండవల్లి అంటే ఉడుంపట్టు ! కానీ పోరాటమార్గాలు ఏం మిగిలాయి !?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions