.
మొన్న నేషనల్ క్రికెట్ క్రష్ స్మృతి మంధాన గురించిన వార్త చదివాం కదా… వుమెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో టాప్ స్కోరర్ ఇప్పుడు తను… ఆ విశేషాలు సెర్చుతుంటే ఆమె రద్దయిన పెళ్లి వార్తలు కనిపించాయి… ఎంగేజ్మెంట్, తండ్రి అనారోగ్యం, పెళ్లి రద్దు జరిగాక కూడా ఆమె మెంటల్‌గా ఏమాత్రం డిస్టర్బ్ కాలేదు, తనపై దాని ప్రభావం ఏమీ లేకుండా చూసుకుంది…
తన పంథాలో తాను బ్యాటింగులో దూసుకుపోతోంది… హర్మన్ ప్రీత్ తరువాత తనే కెప్టెన్సీకి రెడీ అని కూడా అంటోంది… ఆ పెళ్లి రద్దుకు ఎవరెవరో ఏదేదో రాశారు… ఆమె మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు… అది నా వ్యక్తిగతం, దట్సాల్… ఇదీ నచ్చింది… జస్ట్, ఇగ్నోర్డ్… మరి ఆ పెళ్లి రద్దయిన కేరక్టర్ ఎవరు? ఏం చేస్తున్నాడు? అని ఆరా తీస్తే…
Ads
తన పేరు పలాశ్ ముచ్చల్… కంపోజర్, సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్… స్మృతికి విరుద్ధంగా పాపం తన మనసు విరిగిపోయింది… కాస్త వైరాగ్యం… బ్రేకప్ ప్రభావం చూపినట్టుంది కొంత… ఎన్నాళ్లుగానో అనుకుంటున్న ఓ ఆధ్యాత్మిక సినిమా తీస్తున్నాడు… పైగా ఇప్పుడు దేవుళ్లు ట్రెండీ మార్కెట్ కదా… ఎవరి మీదో తెలుసా..? షిర్డి సాయిబాబా మీద!
సినిమా పేరు తేరా సాయి ! ఇది యాదృచ్ఛికమా? వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాల తర్వాత వచ్చిన ఆలోచనా? లేక పలాష్‌కు చాలాకాలంగా ఉన్న ఆధ్యాత్మిక ఆసక్తికి రూపమా? సమాధానం పలాష్కే తెలుసు. కానీ సినిమా నిర్మాణ నేపథ్యం మాత్రం ఆసక్తికరంగానే ఉంది…
పలాశ్ ముచ్చల్ స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజయ్ మిశ్రా సాయిబాబా పాత్రలో కనిపించబోతున్నాడు. అవికా గోర్, సాయాజీ షిండే, మనోజ్ జోషి, ఓంకార్ దాస్ మాణిక్‌పురి, రోహన్ మెహ్రా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు… షూటింగ్ పూర్తయింది… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి… 2027లో హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది…
అంటే ఇది కేవలం ఒక హిందీ సినిమా కాదు. తెలుగు సహా నాలుగు భాషల్లో వస్తున్న పాన్-ఇండియా ప్రయత్నం. ‘సాయిబాబా’గా సంజయ్ మిశ్రా… ఇక్కడే మొదటి ఆసక్తికరమైన విషయం. సాయిబాబా పాత్రను ఇంతకుముందు పలువురు నటులు పోషించారు. కానీ సంజయ్ మిశ్రా ఎంపిక మాత్రం భిన్నంగా అనిపిస్తుంది.
ఎందుకంటే ఆయన నటనలో ఒక సహజత్వం ఉంటుంది. అతిగా దైవత్వాన్ని ప్రదర్శించే నటన కంటే… మౌనంలో, చూపులో, చిన్న హావభావంలో భావాన్ని పలికించే నటుడు. అలాంటి నటుడు సాయిబాబాగా ఎలా కనిపిస్తాడన్నది ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
సాయిబాబా కథేనా? లేక సాయిబాబా సందేశమా? మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం ‘తేరా సాయి’ కేవలం సాయిబాబా జీవిత చరిత్రను వరుసగా చెప్పే ఉత్త బయోపిక్ కాదు. విశ్వాసం… మానవత్వం… ఆశ… మనం ఎప్పుడూ ఒంటరిగా లేమన్న నమ్మకం… ఇవి సినిమా ప్రధాన భావాలుగా చెబుతున్నారు.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా పలాష్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఈ సినిమా తనకు వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైన ప్రయాణమని, ‘faith, humanity, hope’ చుట్టూ కథ తిరుగుతుందని అన్నాడు. ఇక్కడే పలాష్ వ్యక్తిగత జీవితాన్ని, స్మృతితో పెళ్లి రద్దు ప్రభావాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేం…
వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మలుపు, నిరాశ ఎదురైన సమయంలో, ‘విశ్వాసం– ఆశ– మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు’ అనే కథను పలాష్ ఎంచుకోవడం విశేషం… మనిషి జీవితంలో కొన్ని దశల్లో సినిమాలు కేవలం సినిమాలు కాకుండా… మనసులోని ప్రశ్నలకు సమాధానాలు వెతికే మార్గాలుగా కూడా మారుతాయి…
సాయిబాబా ఎవరు? భక్తులకు ఆయన దేవుడు… కొంతమందికి మహాసంత్… మరికొందరికి మతాల మధ్య గోడలు కూల్చిన ఆధ్యాత్మిక వ్యక్తి… కానీ ఇటీవలి కాలంలో సాయిబాబా దైవత్వంపైనే కొన్ని సనాతన వాద వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి… ఇది ఇప్పుడు కేవలం సోషల్ మీడియా వాదనగా కూడా మిగల్లేదు.
2026లో షిర్డీ సాయిబాబా గురించి అభ్యంతరకరమైన, తప్పుడు లేదా రెచ్చగొట్టే కంటెంట్ ప్రచారంపై షిర్డీ సాయిబాబా సంస్థాన్ న్యాయపోరాటం కూడా చేసింది… ఢిల్లీ హైకోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వ Grievance Appellate Committee సంబంధిత కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇచ్చింది… సుమారు 35 వీడియోలు, ఇతర కంటెంట్‌పై ఈ వివాదం నడిచింది…
అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో కూడా షిర్డీ సాయిబాబా విషయంలో చర్చ రేగింది… దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ SRIVANI నిధులను షిర్డీ సాయిబాబా ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమని, ప్రాచీన హిందూ శాస్త్రాలు, మతగ్రంథాల్లో సాయిబాబా ప్రస్తావన లేదని వ్యాఖ్యానించాడు…
అంటే… ఒకవైపు సాయిబాబా భక్తి దేశవ్యాప్తంగా కోట్లాది మందిలో బలంగా ఉంది… మరోవైపు… “సాయిబాబాను హిందూ దేవుడిగా పూజించాలా?” “ఆయన దైవమా? సాధువా?” “సనాతన ధర్మ సంప్రదాయాల్లో ఆయనకు స్థానం ఏమిటి?” అనే ప్రశ్నలు కూడా మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలోనే సాయిబాబాపై ఒక పెద్ద సినిమా రావడం యాదృచ్ఛికం కాదు గానీ… టైమింగ్ మాత్రం ఆసక్తికరం… అదీ ఒక యువ దర్శకుడు, తన జీవితంలో వ్యక్తిగతంగా పెద్ద కుదుపు ఎదుర్కొన్న తర్వాత తీస్తున్న ఆధ్యాత్మిక సినిమా… పైగా సంజయ్ మిశ్రా సాయిబాబాగా!
సో, సాయిబాబా దైవత్వాన్నే ప్రశ్నిస్తున్న సనాతన వాదులు దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం? ముఖ్యంగా… తెలుగు నేలపై ఈ ‘తేరా సాయి’ని ‘హమారా సాయి’గా స్వీకరిస్తారా? గతంలో విజయచందర్, నాగార్జున సాయిబాబా పాత్రలు పోషించినప్పుడు ఈ వివాదం లేదు…
‘‘విరిగిన తన మనస్సుకు సాంత్వన కోసం బాబా బోధనల్ని సినిమాగా తీసే దర్శకుడు ఒకవైపు... దేవుళ్ల ట్రెండ్ మరోవైపు... సనాతనుల గొడవ ఇంకోవైపు... అందుకే ఈ సినిమా ఇంట్రస్టింగుగా మారుతోంది’’
Share this Article