.
Veerendranath Yandamoori …. అవి నేను “ప్రార్థన” నవల వ్రాసే రోజులు, అప్పుడు ChatGPT; ఇంటర్నెట్ లేవు. బయో- కెమిస్ట్రీ గురించి (నేను కామర్సు స్టూడెంట్ని) తెలుసుకోవటానికి ‘ఐజాక్ ఆసిమోవ్’; “చీకట్లో సూర్యుడు” నవల కోసం ఆస్ట్రానమీ, ఉపగ్రహ సమాచార వ్యవస్థ, అంతరిక్ష ప్రయాణం, కంప్యూటర్ ఆధారిత ప్రపంచం గురించి ‘ఆర్థర్ సి.క్లార్క్’ చదవటం జరిగింది.
ఆ కథలు చదివితే ఆ రోజుల్లోనే వాళ్ల ఊహాశక్తి ఎంత దూరం వెళ్లగలదో అర్థమయ్యేది. రోబోలు, కృత్రిమ మేధ, భవిష్యత్ విద్యావిధానం వంటి అంశాలను చాలా ముందుగానే వీళ్లు తమ కథల్లో చూపించారు. ఆ ఊహలు అనేకం ఆ తర్వాత నిజమయ్యాయి. ఆర్థర్ క్లార్క్ వ్రాసిన “The Nine Billion Names of God” కథ విచిత్రంగా ఉంటుంది.
Ads
ఈ ప్రపంచంలో సకల మతాల దేవుడికి ఉండగల అన్ని పేర్లనూ రాయడం తమ పవిత్రమైన కర్తవ్యమని టిబెట్లో కొంతమంది సన్యాసులు నమ్ముతారు. (ఆ సన్యాసుల నమ్మకం ప్రకారం దేవుడి పేర్లన్నీ పూర్తయితే, ఆ తర్వాత సృష్టికి ఇక పని ఉండదు). చేతితో రాస్తే వేల సంవత్సరాలు పడుతుందని, ఆ పని త్వరగా పూర్తి చేయడానికి ఒక కంప్యూటర్ తెప్పిస్తారు.
ఈ కథను క్లార్క్ 1953లో రాశాడు. అప్పటికే కంప్యూటర్లు ఉన్నాయి గానీ, ఇవ్వాళలా చిన్నవి కావు; పెద్ద పెద్ద గదుల్ని నింపేసే, చాలా ప్రిమిటివ్ భారీ యంత్రాలు. అలాంటి రోజుల్లోనే కంప్యూటర్ను ఊహించి వ్రాయటం క్లార్క్ దూరదృష్టికి ఉదాహరణ.
పెద్దపర్వతం మీద కంప్యూటర్ను అమర్చడానికి వచ్చిన ఇద్దరు ఇంజనీర్లకు మాత్రం ఇదంతా మూఢనమ్మకంలా అనిపిస్తుంది. దాన్ని చూసి నవ్వుకుంటారు.
దేవుళ్ళ పేర్లను కంప్యూటర్ ప్రింట్ చేస్తున్న సమయంలో, వాళ్లు అక్కడి నుంచి బయలుదేరి కొండ దిగుతూ, “ఇప్పటికి ఆ సన్యాసుల పని పూర్తయి ఉంటుంది” అని నవ్వుకుంటూ ఆకాశం వైపు చూస్తారు.
అప్పుడు… ఆకాశంలో ఒక్కో నక్షత్రం నిశ్శబ్దంగా ఆరిపోవడం మొదలవుతుంది. అంతే కథ. సన్యాసులది మూఢనమ్మకం అనుకున్న మనకి “… ఒకవేళ వాళ్లే నిజమైతే?” అంటూ చివర్లో క్లార్క్ ఒక చిన్న షాక్ ఇస్తాడు.
మరో రచయిత ఆసిమోవ్ వ్రాసిన కథ “The Fun They Had”. భవిష్యత్తులో రెండు మూడు దశాబ్దాల తరువాత ఎప్పుడో… ఎక్కడో… ఒక రోజు ఒక చిన్న పాపకు “కాగితంపై ముద్రించిన పాత పుస్తకం” అనుకోకుండా దొరుకుతుంది; అది చూసి ఆమె ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. అందులో… ఒకప్పుడు టీచర్ అనే ‘మ..ని..షి’ పిల్లలకి ఎదురుగా నిలబడి పాఠాలు చెప్పేవాడని చదువుతుంది.
మొదట ఆ పాపకి అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ చివరికి AI ద్వారా వెనుకటి రోజుల విషయం తెలుసుకుంటుంది.
ఆ సాయంత్రం ఇంట్లో కంప్యూటర్ స్క్రీన్ ముందు చదువుకుంటూ, “అప్పటి పిల్లలు పక్క పక్కన కూర్చుని, ఎంత సరదాగా చదువుకునేవారో!” అని అనుకుంటుంది.
ఈ కథ అర్థం కావడానికి అస్ట్రానమీ తెలియక్కర్లేదు. ఒక చిన్న ఐడియా… చివర్లో ఒక చిన్న ట్విస్ట్… కానీ చదివిన తర్వాత చాలా సేపు మెదడులో తిరుగుతూనే ఉంటుంది.
కాపీ రచయితగా పేరొచ్చినా పర్వాలేదు గానీ, సైన్స్ ఫిక్షన్ వ్రాయాలనుకునే రచయితలు ఇద్దరి పుస్తకాలు చదివితే మంచిది. జ్ఞానం విస్తరిస్తుంది.

Share this Article