Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!

September 15, 2026 by M S R

.

నో డౌట్… భారీ ఖర్చుతో నిర్మిస్తున్న రామాయణం ఫస్ట్ సాంగ్ అచ్యుతం కేశవం పాట బాగుంది… ఏ అపప్రయోగాలూ లేకుండా ఓ భజనగీతంలా… ప్లెయిన్‌గా, డివోషనల్ వైబ్స్‌తో వినడానికి బాగుంది… రెహమాన్ సొంత ట్యూన్ ఏమీ కాదు, తరాలుగా అందరికీ తెలిసిన పాపులర్ ధోరణే… సింగర్స్ శ్రేయాఘోషాల్, ఆర్జిత్ సింగ్ గాత్రాలకు తిరుగేముంది..?

రణబీర్ రాముడిగా బాగానే ఉన్నాడు, పక్కనే సాయిపల్లవితో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు బాగుంది… కానీ ఎక్కడో ఏదో చిన్న అసంతృప్తి… రాముడి పాటకు కొత్తదనం ఎక్కడ..? ‘అచ్యుతం కేశవం’ మధురమే.. కానీ ఇంత భారీ రామాయణానికి ఇంతేనా?

Ads

రెహమాన్ సంగీతం అంటేనే ఏదో కొత్తదనం కోసం చెవులు ఎదురు చూస్తాయి. కానీ ఈసారి ఆయన ఎలాంటి ప్రయోగాల జోలికీ వెళ్లలేదు. చాలా సింపుల్‌గా, చాలా స్వచ్ఛంగా, వీనులవిందుగా ‘అచ్యుతం కేశవం రామ నారాయణం’ను ట్యూన్ చేశాడు… నిజానికి ఏమీ చేయలేదు, ఇది పాపులర్ ట్యూనే… ఇక్కడి వరకు ఎలాంటి సమస్యా లేదు…

నిజానికి ట్రెండ్ కూడా అదే కదా... ఏశనాగుల కట్ట మీద అని ప్యారడైజ్ జడల నాని పాడినా... మల్లెపూల పల్లకీ అంటూ రవితేజ ఎగిరినా... అవి ఆల్రెడీ హిట్ పాటలే... వాటి పాపులారిటీని వాడుకోవడం ఓ వ్యాపారాత్మక ఆలోచన, అంతేతప్ప క్రియేటివిటీ లేదు, ప్రయాస లేదు, టేస్ట్ లేదు... డబ్బుల యావ తప్ప..! అంటే ఆ హుక్ లైన్లు బాగా లేవని కాదు, మనం కొత్తగా ఏం చేయగలుగుతున్నాం అనేదే ప్రశ్న...

ramayana

ఒక భజన లేదా ఒక కీర్తన గుర్తుచేస్తాను… అచ్యుతం కేశవం రామ నారాయణం, జానకీ వల్లభం, కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్, శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే…

అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది.  ఇది ‘రామాయణం’. వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిని మోస్తున్న ఇతిహాసం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్న భారీ సినిమా. ఇంతటి ప్రాజెక్టుకు రాముడి పాటగా చివరికి మనం ఇప్పటికే వందలసార్లు విన్న భజననే తీసుకురావాలా?

‘అచ్యుతం కేశవం’ కొత్త పాట కాదు. ఈ పల్లవితో వందలాది భజనలు, కీర్తనలు, ఆలయ గీతాలు ఉన్నాయి. దేశంలోని అనేక భాషల్లో, అనేక మంది గాయకులు దీన్ని పాడారు. వేదికల మీదా, యూట్యూబ్‌లోనూ ఎన్నో వెర్షన్లు ఉన్నాయి. పైగా శ్రేయా ఘోషల్ స్వయంగా పాడిన ‘అచ్యుతం కేశవం’ వెర్షన్ కూడా ఇప్పటికే ప్రేక్షకులకు బాగా పరిచయం…

అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన పాటకు… ప్రేక్షకుడి జ్ఞాపకాల్లో ఇప్పటికే ఉన్న ట్యూన్, ఇప్పటికే తెలిసిన పల్లవి, ఇప్పటికే పాడిన గాయని! కొన్ని కొత్త పదాలు జోడించారు. కొత్తగా అల్లారు. రెహమాన్ తన ముద్ర వేశారు. అంతే.

bapu

పాట బాగోలేదని కాదు. ఇంత పెద్ద సినిమాకు ‘ఇంకా అద్భుతంగా ఉండాల్సింది’ అన్న అసంతృప్తి… ఎందుకంటే రాముడిపై కొత్తగా రాయడానికి పదాల కొరత లేదు. ఊహకు కొదవ లేదు. భారతీయ భాషల్లో రాముడిపై ఇప్పటికే వేలాది పాటలు వచ్చాయి. సంస్కృతం నుంచి తెలుగు వరకు, తమిళం నుంచి హిందీ వరకు, భక్తి సాహిత్యం నుంచి సినిమా పాటల వరకు రాముడి వ్యక్తిత్వంలోని ప్రతి కోణం మీద రచనలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాలోనే ఎందుకు ఒక కొత్త రామగీతాన్ని సృష్టించకూడదు? అదే విషయాన్ని మన తెలుగు సినిమా ఎన్నో ఏళ్ల క్రితమే అనేకసార్లు చూపించింది… ఒక ఉదాహరణ…


బాపు చేసిన ఆ ఒక్క పని గుర్తొస్తుంది… ‘శ్రీరామరాజ్యం’ సినిమా గుర్తొస్తే ముందుగా గుర్తొచ్చే వాటిలో ‘జగదానందకారక’ పాట ఒకటి… బాపు రామాయణాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు రాముడిపై ఇప్పటికే ఉన్న పాటల్లోంచి ఒకదాన్ని తీసుకుని సరిపెట్టుకోలేదు. తన సినిమాకోసం జొన్నవిత్తులతో ప్రత్యేకంగా పాట రాయించారు. దాన్ని ప్రత్యేకంగా చిత్రీకరించారు.

సినిమా గురించి ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా… ‘జగదానందకారక’ మాత్రం ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. అందులో బాపు కళాత్మకత కనిపిస్తుంది. రాముడి చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని పాటలోనే నిర్మించారు. అది సినిమా మధ్యలో వచ్చే మరో పాట కాదు. రాముడి వైభవాన్ని చూపించే ఒక ప్రత్యేక దృశ్య కావ్యం.

ఇంకో అందమైన విషయం ఏమిటంటే — ఆ పాటలోని పదాల వినియోగం. సాధారణంగా శాపనార్థాలు, ప్రతికూల భావాలకు వాడే పదబంధాల ఒత్తిడిని కూడా రచయిత సానుకూలమైన భక్తి వైబ్రేషన్ వైపు మళ్లిస్తాడు.  పదాల ధ్వనితోనే ఒక పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తాడు. అదే కదా పాట రచయిత చేయాల్సిన అసలు పని? జొన్నవిత్తుల మంచి సృ‌జన…

మంగళకరమవు నీ రాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమవుగాక, నీ పాలన శ్రీకారమవుగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక… ఇలా తెలుగుతనం ధ్వనించే మనకు తెలిసిన పదాలతోనే మనకు తెలియని ఓ పాజిటివ్, అలౌకిక అనుభూతిని సృష్టించడం…

అన్ని భాషలకు ఒకే పాట… ఎందుకు? ‘అచ్యుతం కేశవం’కు మరో ప్రత్యేకత ఉంది. అది భాషలకు అతీతం. సంస్కృత ఆధారిత పదాలు కావడంతో దేశంలోని చాలామందికి అర్థమవుతాయి. భక్తి పాటగా ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. ఎన్ని మార్పులు చేసుకున్నా ఒరిజినల్‌లాగే ధ్వనిస్తుంది… అందుకే బహుశా మేకర్స్‌కు ఇది సేఫ్ ఛాయిస్ అనిపించి ఉండొచ్చు.

హిందీలోనూ పనిచేస్తుంది. తెలుగులోనూ పనిచేస్తుంది. తమిళుడికీ పరిచయమే. కేరళలోనూ వినిపిస్తుంది. ఉత్తరాదిలోనూ వినిపిస్తుంది.

కానీ సేఫ్ ఛాయిస్, గొప్ప కళాత్మక నిర్ణయం ఒకటేనా? ఇదే అసలు ప్రశ్న. ఇంత భారీగా ఖర్చు చేస్తున్నప్పుడు… ఇంతటి ప్రపంచ స్థాయి విజువల్ కాన్వాస్‌ను నిర్మిస్తున్నప్పుడు… ఒక్కో భాష ప్రేక్షకుడి కోసం ప్రత్యేకంగా ఆలోచించి పాట రాయించాల్సిన అవసరం లేదా?

హిందీకి ఒక రామగీతం.
తెలుగుకు మరో రామగీతం.
తమిళానికి మరో రూపం.
మలయాళం, కన్నడ, ఇతర భాషలకు వారి భాషా సంస్కృతికి తగ్గ పదప్రయోగం.

ట్యూన్ ఒకటే ఉన్నా సరే. భావం ఒకటే ఉన్నా సరే…

ramayan

కానీ ఆ భాషలో పుట్టినట్టుగా అనిపించే పాట ఉండొచ్చు కదా! రాముడు అందరివాడే. అందుకే రాముడి పాట కూడా అందరికీ అర్థమయ్యేలా ఉండాలి అనేది ఒక వాదన. కానీ అందరికీ అర్థమయ్యేలా చేయడానికి ఒకే పాటను అన్ని చోట్ల పెట్టాల్సిన అవసరం లేదు. రాముడు ఒకడే కావచ్చు. కానీ ప్రతి భాషలో రాముడిని చూసే కళ్లూ వేరు. అదే భారతీయతలోని అందం.

రెహమాన్ దగ్గర ప్రయోగం ఆశించకూడదా? ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. రెహమాన్‌ను ఎందుకు ఎంచుకున్నారు? తన పాపులారిటీ ఉపయోగకరమనేనా? ఆయన మంచి మెలోడీ ఇస్తాడని మాత్రమేనా? లేక ప్రపంచ ప్రేక్షకుడికి భారతీయ ఆధ్యాత్మిక సంగీతాన్ని కొత్త శబ్ద ప్రపంచంలో పరిచయం చేయగలడని కూడా ఆశించారా?

రెహమాన్ తన సంగీతంలో సంప్రదాయాన్ని ఆధునికతతో కలిపి కొత్త అనుభూతులు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తి చేతిలో రామాయణం లాంటి కాన్వాస్ పడితే… మనకు ఒక కొత్త రామగీతం వినాలనిపిస్తుంది. మనకు ఇప్పటికే తెలిసిన భజనను మరింత అందంగా ప్యాకేజ్ చేసిన వెర్షన్ కాదు. అది కూడా తప్పు కాదు. కానీ ఇంత పెద్ద సందర్భంలో అది కొంచెం చిన్న ఆలోచనగా అనిపించవచ్చు.

రామాయణం కొత్తది కాదు. రాముడి కథ కొత్తది కాదు. రాముడిపై పాటలు కొత్తవి కాదు. అయితే ఈ సినిమాలో కొత్తగా మిగిలేది ఏమిటి? అక్కడే దర్శకుడి విజన్ పరీక్షకు వస్తుంది. వాల్మీకి రామాయణం చెప్పిన కథే అయినా ప్రతి తరం దాన్ని తనదైన రీతిలో చెప్పింది. బాపు తన రాముడిని తన కళలో చూపించాడు. ‘శ్రీరామరాజ్యం’ తనదైన పాటలను సృష్టించుకుంది. ఇప్పుడు ఈ తరం ఈ రామాయణం ఏమి కొత్తగా చెబుతుంది? విజువల్స్‌లో కొత్తదనం ఉండొచ్చు. టెక్నాలజీలో ఉండొచ్చు. స్టార్ కాస్టింగ్‌లో ఉండొచ్చు.

బాపు ‘జగదానందకారక’తో చూపించిన ఆ కళాత్మక ధైర్యం… ఈ రామాయణంలో కూడా కనిపిస్తే బాగుండేది... 

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!
  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?
  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions