.
( ఇం ) కోతి కొమ్మచ్చి… – 10 … ఆ రోజుల్లో సెన్సారు వారు పండించిన హాస్యం…. ‘ ఆ జమున డైలాగుల్లో ఓ డజను డైలాగులు కత్తిరించి మీరే ఇచ్చెయ్యండి. ‘ సెన్సారు అధికారులు.
‘ అదేమిటీ ? ఎందుకలాగా ? ‘ నిర్మాతలు.
‘ వాటిలో బూతులుంటాయి. ‘ సెన్సారు అధికారులు. ‘ ఉంటే చూసి మీరేచెప్పండి, అవి కట్ చేసి ఇస్తాం. ‘ నిర్మాతలు.
‘ అబ్బా ! అవి అలా దొరకవండీ ! అసలే కోనసీమ భాష. అందులో ఆవిడ స్పీడ్ గా మాట్లాడుతుంది. జల్లెడ వేయడం కష్టం. అంచేత మీరే ఉజ్జాయింపుగా కాసిని డైలాగులు కట్ చెయ్యండి. మేము కట్లు చెప్పే పనిలేకుండా, శుభ్రమైన సర్టిఫికెట్ ఇస్తా౦ ‘
ఇది మూగమనసులు సెన్సారు సమయంలో, సెన్సారు వారికీ, నిర్మాతలకూ మధ్య జరిగిన సంభాషణ.
Ads
ఇప్పుడైతే అలాంటి సంభాషణలు జరిగే తావులేదు. పూర్వం విశ్రాంత చీఫ్ జస్టిస్ రాజమన్నారు గారి లాంటివారు సెన్సారు కమిటీలలో వున్నప్పుడు, సరదాగా మీటింగులలో కూర్చుని తీర్పులూ, మార్పులూ చేయిస్తూ వుండేవారు, నిర్మాతల మనసులు నొచ్చుకోకుండా, అసభ్య సన్నివేశాలు, సంభాషణలు తెరమీదికి రాకుండా. అలా సంసారపక్షం, సెన్సారు పక్షం రెండూ తృప్తిపడేవి…
సెన్సారు అనగానే కేవలం బూతు మాటలూ, పాటలూ కత్తిరించడం అనే భావన చాలామందిలో వుంటుంది. ‘ సమాజానికి హాని చేసేదీ, ప్రభుత్వ విధానాలకు అడ్డు వచ్చేది కూడా సెన్సారు యోగ్యమే ! ‘ అని చాలామంది నిర్మాతలు భావించరు. ఇక్కడ పిల్లలకు వేరే సినిమాలు లేవు కదా !
మన సినిమాలు నవరసాలు కలిపి విందుభోజనంలాగా తాత గారి నుంచీ మనవడి దాకా, ఉగ్గుపాల చిన్నారి దాకా చూపిస్తాం. అంచేత సెన్సారు వాళ్ళ పని చాలా క్లిష్టమైనది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. కప్ప అంటే నిర్మాత, పాము అంటే సెన్సారు అన్నమాట !
ఆ విధంగా రమణ గారు మూగమనసులు సినిమా సెన్సారింగ్ కి వెళ్లి, జమున గారి డైలాగులలో కట్లు లేకుండా చూసుకున్నారు.
అదేవిధంగా, బుద్దిమంతుడు సినిమా సెన్సారింగులో, ఒక ఆడ మెంబరు, ‘ దారుణం అపచారం ! మనం పడుకునే నులక మంచం మీద కృష్ణ పరమాత్మను కూర్చోపెట్టి, అటుకులు తినిపించడమా కట్ కట్ ‘ అని మొత్తుకున్నారు.
దానికి రమణ గారు, ‘ మేడం ! రామాయణంలో రాముడు గట్టుమీద కూర్చుని శబరి చేతి ఎంగిలిపళ్ళు తినలేదా ! మా సినిమాలో పూజారి పెట్టిన అటుకులు తింటే ఏం ? ‘ అని సర్ది చెప్పి ఆమె కోపంగా చూస్తున్నా, ‘ ఓకే ‘ చేయించారు.
భక్త కన్నప్ప చిత్రంలో, ఒక భక్తురాలు దేవుడికి ‘ నిలువు దోపిడీ ‘ యిచ్చుకుంటానని మొక్కుకుంటే కూడా, ఆ ఆడ మెంబరు, అందులో నుంచి బూతు అర్ధం లాగింది. ఆమె లాగిన అర్ధానికి దేవుడే షాకు తిని కొయ్యబారి పోయాడు.
అలాగే, ఆత్రేయ గారు తనకుతానే ‘ బూత్రేయ ‘ అని బిరుదు ఇచ్చుకుని, వేరెవరికీ ఆ అవకాశం లేకుండా చేశారు. అయితే ఆయన శృంగార సంభాషణలకే పరిమితం అయ్యారు గానీ, కామెడీ ట్రాకులు వేరేవారు వ్రాసేవారు. ‘ ఇక్కడొక హాస్య సన్నివేశం ‘ అనిమాత్రం వ్రాసి వూరుకునే వారు, ఆత్రేయ.
ఇంకో సంఘటన : ఆదుర్తి గారితో ముళ్లపూడి రమణ గారు పనిచేసిన ‘ దాగుడు మూతలు ‘ సినిమాలో ముద్దు మీద ఒక పాట వున్నది. అందులో అసలు బూతు లేకపోయినా, బూతుకీ శృంగారానికి తేడా తెలియని అధికారులు దానికి కత్తెర వేశారు. ‘ అడగక ఇచ్చిన ముద్దే ముద్దు… ‘ అనే పాటలో చివరలో, ‘ ముద్దుకు ముద్దు..’ అని వచ్చే చోట, కట్ అన్నారు.
‘ ఇప్పటికే ముద్దులు చాలా వచ్చాయి. ఇక చాలు. ‘ అన్నారు, అధికారులు. అయితే ఆదుర్తి గారు వాదించకుండా, అడ్డుచెప్పకుండా, ‘ ఓకే ‘ అనేసి, అక్కడ సౌండ్ మాత్రం కట్ చేసారు. సినిమాలో ఎన్టీఆర్ – బీ. సరోజ పెదవులు, ఆ మాటలు ఉచ్చరిస్తున్నట్లు అందరికీ అర్ధమవుతూనే వుంటుంది.
సెన్సారు వాళ్ళు, వద్దు అన్న ‘ ముద్దుకు ముద్దు ‘ అనే మాట, ముద్దున్నరగా, ముద్దుముప్పావుగా అర్ధమై పోయింది ప్రేక్షకులకు. వారికి హమ్మింగ్ కి అడ్డు రాకుండా పోయింది. . ఈలలతో, చప్పట్లతో హాలు హాలంతా సందడి జరిగింది.
మేధావులు సెన్సారు అధికారులుగా వున్నా అప్పుడప్పుడు, చాదస్తమే ! ఒకసారి ఒక మేధావి అధికారి, హీరో ప్రేయసితో ‘ గుళ్ళోకెళ్తున్నానని ఇంట్లో చెప్పి పార్కుకి వచ్చేయ్. పాట పాడేసుకుందాం. ‘ అంటాడు. దానికి ఆ మేధావి కట్ చెప్పి, ఎందుకని అడిగితే, ‘ పెద్దవాళ్ళని మోసగించే కుట్ర దేవుడి పేరుతో సహించం. ‘ అన్నారు. తలలు పట్టుకున్నారు నిర్మాతలు.
అలాగే పోలీసులకు, ధర్మాసుపత్రిలో అణా బేడా లంచం ఇచ్చినట్లు చూపిస్తే, ‘ ఛీ ఛీ ! పోలీసులు లంచం తీసుకోరు. అది రూల్సుకి వ్యతిరేకం. ‘ అని కత్తిరించేసారు.
ఇంకోసారి, కొసరాజు గారు ఒక పాటలో, ‘ దాని తస్సాదియ్యా ‘ అనే మాట వేస్తే, ఠస్సా అనేది బూతుమాట అని కట్ చేసారు. తస్సాదియ్యా అంటే, ఎద్దులకు మదం దించి మచ్చిక చెయ్యడం. అందులో ఆవిధంగా బూతు కనబడింది ఆ అధికారికి.
అయితే, ఇవన్నీ రైతులు వాడే పదాలని నిఘంటువు చూపించి దానిని ఓకే చేయించుకున్నారు రచయిత, నిర్మాతలూ.
అలాగే ‘ ఆరి భడవా ! ‘ అనే మాటను కత్తిరించి, ‘ భడవా అంటే తార్పుడుగాడు ‘ అని అర్ధం చెప్పారు, అధికారులు, ఒకసారి.
మన తెలుగు ఇళ్లలో దానిని అంత నీచమైన పదంగా వాడరనీ, ప్రతి తాతగారు, పిల్లలని ‘ భడవా ! ‘ అని కోప్పడినప్పడు సంబోధిస్తారని, చెప్పి ఒప్పించేసరికి తాతలు దిగివచ్చారు, రమణ గారికి.
ఆ మాటకొస్తే, రచయితలు కూడా అమాయకులేం కారు. పచ్చి బూతు రాసి కూడా, అభ్యంతరం పెడితే, ‘ హవ్వ ! దీనిలో కూడా బూతు చూస్తారా ? ‘ అని అమాయకంగా అడిగే వాళ్ళూ వున్నారు.
కొందరు ద్వందార్ధాల నిపుణులు వుంటారు. వాళ్ళ చేత వేరే సంభాషణలు హాస్యపాత్రలకు రాయించి జత చేస్తారు. బూతులో నుంచి నీతి వస్తుందని వారు వాదిస్తారు.
‘ ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ ! ‘ ‘ అబ్బ నీ తియ్యనీ దెబ్బ ! ‘ అని రాసిన వేటూరి వారు కూడా, ‘ బూతు నా రాతలో లేదు, నీ బుర్రలో వున్నది. ‘ అని సమర్ధించుకున్నారు.
రమణ గారి సినిమా , ‘ బాలరాజు కధ ‘ సెన్సారు సమయంలో ఒక తమాషా సంఘటన ఎదురైంది, రమణ గారికి.
సెన్సారు అధికారి నాలుగైదు కట్స్ చెప్పారు. దానికి రమణ గారు ఏమీ అభ్యంతరం పెట్టకుండా, ‘ అలాగే సర్ ! ఆఫీస్ కెళ్ళి, మీరు చెప్పిన కట్స్ చేసి రేపు సబ్మిట్ చేస్తాను. ‘ అని చెప్పారు.
‘ అరే ! అలా అనేస్తే ఎలా మీరు ? ‘ అన్నారు అధికారి. ‘ కట్స్ చెప్పారు కదా, కట్ చేసి తెస్తాను. ‘ అని మళ్ళీ రమణగారు అన్నారు.
‘ అదికాదండీ ! కట్ అడగగానే సరే అనేస్తే ఎలా ? ఇంకో మాట ఏదైనా చెప్పండి. ‘ అన్నారు అధికారి. రమణ గారికి అప్పుడర్ధమైంది, ఆయన డబ్బు ఆశిస్తున్నాడని.
‘ నాకు అలాంటివి ఇష్టముండవండీ ! ‘ అని రమణ గారు అనగానే, ఆయన తలవంచుకున్నాడు. మాట్లాడలేదు.
అప్పుడు రమణ గారికి కూడా, ‘ అలా చేస్తే పోలా ‘. అనిపించింది.
‘ సరే ! ఏం చెయ్యమంటారు సర్ ! ‘ అధికారితో రమణ గారు. ‘ క్యాష్ వద్దు. ప్రమాదం. రేపు మా ఇంటికి ఒక బియ్యం బస్తా పంపించండి. చాలు. ‘ అన్నారు.
రమణ గారికి ఏడుపు వచ్చినంత పని అయింది. సరిగ్గా అడగడం చేతగాని ఆయన మీద జాలి కూడా వేసింది. బియ్యం పంపారు రమణ గారు.
కొసమెరుపు ఏమిటంటే, ఆ బియ్యం బస్తా తిరిగి వచ్చేసింది. కారణం అడిగితే, ‘ కొందరు మెంబర్లు, కట్స్ కావాలని పట్టు పడుతున్నారు. మీరు పంపిన బియ్యం నాకు అవసరమే కానీ, వాడుకోలేను. నేను అడిగిన కట్స్ చేసి రేపు సబ్మిట్ చెయ్యండి. ‘ అని చెప్పారు, ఆ అధికారి.
ఆయన బియ్యం బస్తా తిరిగి పంపకపోయినా, రమణ గారు ఏమీ అనుకునేవారు కాదు. అందుకే ఆయనకు రమణ గారు అభివందనలు, గౌరవాభివందనాలు మనసులోనే సమర్పించారు, ఆ నిబద్ధతకు.
ఇవి ఆకాలం సెన్సారు వారి ధోరణి. ఈ కాలానికి ఇవి ఆశ్చర్యకరంగా వుండవూ ! (Gandavarapu Prabhakara Rao వాల్ నుంచి సేకరణ)…
Share this Article